EC Orders to AP Govt : సంక్షేమ పథకాల నిధుల జమ ప్రక్రియను వెంటనే నిలిపివేయండి - ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
EC On AP Welfare Schemes :ఏపీలో సంక్షేమ పథకాల నిధులపై జమపై ఈసీ కీలక ఆదేశాలను జారీ చేసింది. పోలింగ్ కు రెండు రోజుల ముందు ఎలాంటి నిధులను జమ చేయవద్దని స్పష్టం చేసింది. పోలింగ్ ముగిసిన తర్వాత దీనిపై మార్గదర్శకాలను ఇస్తామని తెలిపింది.
EC On AP Welfare Schemes : ఏపీలో ఎన్నికల వేళ సంక్షేమ పథకాలపై ఈసీ(Election Commission of India) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు కేవలం రెండు రోజుల ముందు వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సుమారు రూ.14,165 కోట్లును జమ చేయాలని ఏపీ సర్కార్ కసరత్తు చేసింది. దీనిపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ…. నిధుల జమ ప్రక్రియను వెంటనే ఆపివేయాలని ఈసీ ఆదేశాలను జారీ చేసింది.
ఈ ఆదేశాలకు సంబంధించి ఏపీ సీఎస్ కు ఈసీ నుంచి లేఖ అందింది. ఆరు వేర్వురు పథకాల కోసం ప్రత్యేక ప్రయోజన బదిలీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 14,165.66 కోట్లను జమ చేయాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని ప్రస్తావించింది. ఈ డబ్బులను మే 10, 11 తేదీల్లో జమ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసిందని పేర్కొంది. ఎప్పుడో విడుదలైన ఈ డబ్బులు జమ కావటంలో ఎందుకు ఆలస్యమైందని వివరణ కోరింది.
వైఎస్ఆర్ ఆసరా పథకం కింద జనవరి 23న రూ. 6,394 కోట్లు విడుదలకు ముఖ్యమంత్రి బటన్ నొక్కారని ఈసీ గుర్తు చేసింది. ఫిబ్రవరి 28న వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద రూ.78.53 కోట్లు, మార్చి 1న జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లు, మార్చి 6న రైతుల ఇన్‌పుట్ సబ్సిడీకి రూ.1294.59 కోట్లు, వైఎస్ఆర్ చేయూత పథకం కింద మార్చి 7న రూ.5060.49 కోట్లు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద మార్చి 14న రూ.629.37 కోట్ల విడుదలకు బటన్ నొక్కారని పేర్కొంది.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఈ పథకాల నిధుల జమ కోసం బటన్ నొక్కారని ఈసీ గుర్తు చేసింది. “డీబీటీల ద్వారా…. ఈ నిధులు 24 గంటలలోపు లేదా గరిష్టంగా 48 గంటల్లో లబ్ధిదారులకు బదిలీ చేయబడతాయి. డీబీటీతో వెంటనే నగదు లబ్ధిదారుల ఖాతాలకు చేరుతున్నా ఎందుకు ఆలస్యమైంది? ఈ నిధుల జమ ప్రక్రియపై మాకు ఫిర్యాదులు అందాయి.” అని ఈసీ తెలిపింది.
“మే 11 మరియు 12 తేదీల్లో అంటే మే 13న పోలింగ్ తేదీకి చాలా దగ్గరగా ఉండే తేదీలలో బ్యాంకులకు నిధులను బదిలీ చేయడం ద్వారా లబ్ధిదారులకు సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని కమిషన్‌కు తెలిసింది. ఇది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది" అని ఈసీ స్పష్టం చేసింది.
నిధుల జమ ప్రక్రియలో చాలా ఆలస్యం జరిగిందని, ఇందుకు గల కారణాలను తెలపాలని ప్రభుత్వాన్ని ఈసీ కోరింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ విషయంపై తగిన మార్గదర్శకాలు ఇస్తామని ఈసీ స్పష్టం చేసింది.