Pawan On Alliance: పొత్తు ధర్మం పాటించాలి.. కూటమిని గెలిపించాలి… జనసేన క్యాడర్‌కు పవన్ సందేశం…
28 March 2024, 7:36 IST
- Pawan On Alliance: ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు జనసేన శ్రేణులు మద్దతివ్వాలని పవన్ విజ్ఞప్తి చేశారు. పొత్తు ధర్మాన్ని అంతా గౌరవించాలని కోరారు.
తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థితో పవన్ కళ్యాణ్
Pawan On Alliance: ఏపీలో పొత్తు ధర్మాన్ని పాటిద్దాం... మిత్ర పక్ష కూటమిని గెలిపిద్దామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ Pawan Kalyan పిలుపునిచ్చారు. జనసేన నాయకులు, శ్రేణులు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఎక్కడా పొరపాట్లకు, లోటు పాట్లకు తావివ్వకుండా మూడు పార్టీలూ క్షేత్ర స్థాయి నుంచి ముందుకు వెళ్ళాలని సూచించారు.
Andhra pradesh ఎన్నికల కూటమి ఏర్పాటు అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించిందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ‌్ సూచించారు. . పొత్తులో భాగంగా జనసేన పార్టీ చేసిన త్యాగాలు రాష్ట్ర సౌభాగ్యం, అభివృద్ధి, ప్రజల సంరక్షణ, శాంతిభద్రతల పునరుద్ధరణ కోసమని తొలి నుంచీ బలంగా చెబుతూనే ఉన్నామన్నారు. పొత్తు ధర్మాన్ని పాటిద్దాం.... మిత్ర పక్ష కూటమిని గెలిపిద్దామని పిలుపు ఇచ్చారు.
జనసేనలో ఎవరైనా పొత్తు ధర్మానికి భిన్నంగా- వ్యక్తిగత ప్రయోజనాల కోసం, స్వార్థ బుద్ధితో వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకొనేందుకు వెనుకాడనని పవన్ హెచ్చరించారు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ పరిశీలిస్తూనే ఉంటుందని పవన్ కళ్యాణ ప్రకటించారు.
మూడు స్థానాలపై కసరత్తు…
ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే 21 స్థానాల్లో 18 నియోజక వర్గాల అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. టీడీపీ-బీజేపీలతో కలిసి పోటీ చేస్తున్న జనసేన మొత్తం 21 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో 18మందిని ఇప్పటికే ఖరారు చేశారు.
వీటితో పాటు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ Palakonda, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ Avanigadda, విశాఖ దక్షిణ Visakha Southనియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదు. జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల నేతలతో బుధవారం పవన్ కల్యాణ్ చర్చించారు.
మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని తొలుత బాలశౌరి పేరును ప్రకటించినా దానిని అధికారికంగా ఖరారు చేయలేదు. బుధవారం ఎంపీ బాలశౌరితో పవన్ భేటీ అయ్యారు. విజయవాడ పశ్చిమ సీటు కోసం ఆందోళన చేస్తున్న పోతిన మహేశ్ కూడా పవన్‌ను పార్టీ కార్యాలయంలో కలిశారు. మార్చి 30న పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్ననేపథ్యంలో ముందే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని భావిస్తున్నారు.
పవన్‌తో మాగుంట, వరప్రసాద్ భేటీ….
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో ఒంగోలు ఎంపీ, టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు కుమారుడు మాగుంట రాఘవ్, ఒంగోలు నేతలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ తదితరులు ఉన్నారు.
తిరుపతి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా పవన్‌తో భేటీ అయ్యారు. ఏపీలో ఎన్నికల పొత్తులో భాగంగా 2ఎంపీ, 21 ఎమ్మెల్యే స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. బీజేపీ 6ఎంపీ, 10ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తోంది. వీటికి అభ్యర్థుల్ని ఖరారు చేశారు. బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులను బుధవారం రాత్రి ప్రకటించారు. మరికొన్ని స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.