Team India: టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లయినా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడని స్టార్ క్రికెటర్స్ వీళ్లే!
12 September 2024, 10:37 IST
Team India: సంజూ శాంసన్, యజువేంద్ర చాహల్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్లు పైనే అయ్యింది. టీమిండియా తరఫున పలు వన్డేల, టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ ఇద్దరు క్రికెటర్లు ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. టెస్టు జట్టులో స్థానం వారికి కలగానే మిగిలిపోయింది.
టీమిండియా
Team India: వన్డేలు, టీ20లతో పోలిస్తే టెస్ట్‌ల్లో ఆటతీరు భిన్నంగా ఉంటుంది. దూకుడుతో ఈ ఫార్మెట్‌లో పని ఉండదు. టాలెంట్‌తో పాటు టన్నుల కొద్ది ఓపిక, సహనం ఉంటేనే టెస్టుల్లో రాణించే అవకాశం ఉంటుంది. బ్యాట్స్‌మెన్స్ అయితే గంటల కొద్ది క్రీజులో పాతుకుపోవాలి. టెస్టుల్లో బౌలర్లు ఒక్కోసారి యాభై ఓవర్లకుపైనే బౌలింగ్ చేయాల్సివస్తుంది. క్రికెటర్లకు అసలైన పరీక్షగా టెస్ట్‌లు నిలుస్తుంటాయి. టెస్టుల్లో రాణిస్తేనే సంపూర్ణ క్రికెటర్‌గా మారినట్లుగా ప్లేయర్స్ భావిస్తుంటారు. టెస్టు ల్లోకి ఎంట్రీ కోసం ఎదురుచూస్తుంటారు.
అందని ద్రాక్షగానే...
జాతీయ జట్టుకు సెలెక్ట్ అయినా చాలా మంది క్రికెటర్లు కొద్దిరోజుల్లోనే టెస్టుల్లో స్థానం దక్కించుకుంటారు. కొందరు మాత్రం వన్డే, టీ20 ఫార్మెట్‌లకే పరిమితం కావాల్సివస్తుంది. టెస్టు జట్టులో స్థానం వారికి అందని దాక్షగానే మిగులుతుంది. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడని క్రికెటర్లు భారత జట్టులో పలువురు ఉన్నారు. వాళ్లు ఎవరంటే?
యజువేంద్ర చాహల్...
టీమిండియాలో మోస్ట్ అన్‌లక్కీయెస్ట్ క్రికెటర్‌గా యజువేంద్ర చాహల్‌ను చెబుతుంటారు. జాతీయ జట్టులోకి చాహల్ 2016లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు టీమిండియా తరఫున 72 వన్డేలు, 80 టీ20 మ్యాచ్‌లు ఆడిన చాహల్‌కు టెస్ట్ ఎంట్రీ మాత్రం కలగానే మిగిలింది.
టీమిండియాలోకి అడుగుపెట్టి ఎనిమిదేళ్లయినా ఒక్క టెస్ట్‌లోనూ చాహల్‌కు స్థానం దక్కలేదు. టెస్టుల్లో సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా నుంచి చాహల్‌కు పోటీ ఎదురవుతోంది. చాహల్ తర్వాత జట్టులోకి వచ్చిన స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ పలు టెస్ట్‌లు ఆడారు.
సంజూ శాంసన్
చాహల్ కంటే ఓ ఏడాది ముందుగానే నేషనల్ టీమ్‌లోకి అరంగేట్రం చేశాడు సంజూ శాసన్. అయినా టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. తొమ్మిదేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు 30 టీ20 మ్యాచ్‌లు, 16 వన్డేలు మాత్రమే ఆడాడు. టెస్ట్ టీమ్‌లో ఒక్కసారి కూడా స్థానం సంపాదించుకోలేకపోయాడు. భవిష్యత్తులో అతడికి అవకాశం దక్కడం డౌట్‌గానే కనిపిస్తోంది.
ఐపీఎల్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్ కూడా టీమిండియా తరఫున 23 టీ20 మ్యాచ్‌లు, ఆరు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో ఎంట్రీ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు ఈ చెన్నై కెప్టెన్.