తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Australia: 8 నెలల్లో మూడుసార్లు.. భారత అభిమానులకు బాధ మిగిల్చిన ఆస్ట్రేలియా

India vs Australia: 8 నెలల్లో మూడుసార్లు.. భారత అభిమానులకు బాధ మిగిల్చిన ఆస్ట్రేలియా

11 February 2024, 22:24 IST

google News
    • India vs Australia Finals: భారత క్రికెట్‍కు గత 8 నెలల్లో మూడుసార్లు బాధను మిగిల్చింది ఆస్ట్రేలియా. మూడు ఫైనళ్లలో దెబ్బకొట్టింది. ఆ వివరాలు ఇవే.
డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్ 2023, అండర్-19 ప్రపంచకప్ 2024 టైటిళ్లు అందుకున్న ఆస్ట్రేలియా జట్లు
డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్ 2023, అండర్-19 ప్రపంచకప్ 2024 టైటిళ్లు అందుకున్న ఆస్ట్రేలియా జట్లు (AFP)

డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్ 2023, అండర్-19 ప్రపంచకప్ 2024 టైటిళ్లు అందుకున్న ఆస్ట్రేలియా జట్లు

India vs Australia Finals: భారత క్రికెటర్లు, అభిమానులకు ఆస్ట్రేలియా గత 8 నెలల్లో మూడుసార్లు అంతులేని బాధను మిగిల్చింది. నాకౌట్ మ్యాచ్‍ల్లో మంచి రికార్డు ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ సీనియర్ టీమ్.. గతేడాది రెండుసార్లు భారత్‍ను ఐసీసీ ట్రోఫీ దక్కించుకోకుండా అడ్డుకుంది. ఇప్పుడు ఈ ఏడాది ఆసీస్ అండర్-19 టీమ్.. భారత అండర్-19 జట్టును ప్రపంచకప్ తుదిపోరులో ఓడించింది. బెనోనీలో నేడు (ఫిబ్రవరి 11) జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ టీమిండియాను 79 పరుగుల తేడాతో ఆసీస్ ఓడించి టైటిల్ దక్కించుకుంది. గత 8 నెలల్లో భారత్‍పై ఆస్ట్రేలియా గెలిచిన మూడు ఫైనళ్ల వివరాలు ఇవే.

డబ్ల్యూటీసీ ఫైనల్

ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (2021-23) ఫైనల్‍లో గతేడాది భారత్‍‍ను దెబ్బకొట్టింది ఆస్ట్రేలియా. 2023 జూలై 7 నుంచి 11వ తేదీ మధ్య ఇంగ్లండ్‍లోని ఓవల్ వేదిక జరిగిన ఈ ఫైనల్‍లో ఆసీస్ 209 పరుగుల భారీ తేడాతో భారత్‍పై గెలిచింది. టీమిండియా ఆశలపై నీళ్లు జల్లి.. టైటిల్ ఎగరేసుకుపోయింది కంగారూ జట్టు.

డబ్ల్యూటీసీ ఫైనల్‍లో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 469 రన్స్ చేయగా.. భారత్ 296 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్లకు 270 పరుగులకే డిక్లేర్ చేసింది. 444 పరుగుల లక్ష్యం ముందుడగా రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే ఆలౌటై.. భారత్ ఓటమి పాలైంది. వరుసగా రెండుసారి డబ్ల్యూటీసీ ఫైనల్‍లో పరాజయం పాలైంది.

వన్డే ప్రపంచకప్ ఫైనల్

స్వదేశంలో గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో అద్భుతమైన ఆటతో అజేయంగా ఫైనల్‍కు చేరింది భారత్. అహ్మదాబాద్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 19న ఈ ఫైనల్ ఫైట్ జరిగింది. అయితే, పన్నెండేళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ టైటిల్ పట్టాలన్న భారత్ కలను ఆసీస్ చెరిపివేసింది. ఈ ఫైనల్‍లో 6 వికెట్ల తేడాతో రోహిత్ శర్మ సేనను ఆస్ట్రేలియా ఓడించింది. ఆరోసారి వన్డే ప్రపంచకప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి నుంచి ఇంకా భారత క్రికెట్ జట్టు, అభిమానులు ఇంకా కోలుకోలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చాలా ఆవేదనకు లోనయ్యాడు. కమిన్స్ సేన మరోసారి ఒకే ఏడాది రెండుసార్లు టీమిండియాను దెబ్బ కొట్టింది.

వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 240 పరుగులే చేయగలిగింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (137) సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్‍కు ఓటమి ఎదురైంది. టీమిండియా అభిమానుల గుండె బద్దలైంది.

అండర్-19లోనూ..

ఈ ఏడాది ఇప్పుడు అండర్-19 ప్రపంచకప్‍లోనూ భారత జట్టుకు నిరాశ మిగిల్చింది ఆస్ట్రేలియా. నేడు (ఫిబ్రవరి 11, 2024) అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‍లో ఆస్ట్రేలియా టీమ్ 79 పరుగుల తేడాతో ఇండియాపై గెలిచింది. నాలుగోసారి అండర్-19 ప్రపంచకప్‍ను చేజిక్కించుకుంది. ఈ ఏడాది టోర్నీలోనూ అజేయంగా ఫైనల్‍‍కు దూసుకొచ్చిన భారత్ అండర్-19 టీమ్.. తుదిపోరులో ఆసీస్ చేతిలో చిత్తయింది. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 రన్స్ చేసింది. లక్ష్యఛేదనలో భారత జట్టు 174 పరుగులకే ఆలౌటైంది.

ఇలా.. గత 8 నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా సీనియర్ టీమ్ రెండుసార్లు, ఓసారి జూనియర్ జట్టు.. భారత్‍ను ఫైనళ్లలో ఓడించాయి. టీమిండియా క్రికెట్ అభిమానులకు బాధను మిగిల్చాయి.

తదుపరి వ్యాసం