India vs Australia World Cup Final Highlights: చేతులెత్తేసిన టీమిండియా.. ఆరోసారి వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా-india vs australia world cup final live score updates ind vs aus live ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Australia World Cup Final Highlights: చేతులెత్తేసిన టీమిండియా.. ఆరోసారి వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా

India vs Australia World Cup Final Highlights: చేతులెత్తేసిన టీమిండియా.. ఆరోసారి వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా

Hari Prasad S HT Telugu
Nov 19, 2023 10:03 PM IST

India vs Australia World Cup Final Live Score: ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్ గెలిచింది. ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ లలో చేతులెత్తేసిన వేళ కంగారూలు మరోసారి విశ్వవిజేతగా నిలిచారు.

ట్రావిస్ హెడ్, లబుషేన్
ట్రావిస్ హెడ్, లబుషేన్ (AFP)

India vs Australia World Cup Final Live Score: ఆస్ట్రేలియా మరో వరల్డ్ కప్ గెలిచింది. ఫైనల్లో ఇండియాను 6 వికెట్లతో చిత్తు చేసి ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది. ట్రావిస్ హెడ్ సెంచరీ, లబుషేన్ హాఫ్ సెంచరీతో 241 రన్స్ టార్గెట్ ను మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. స్వదేశంలో టీమిండియాకు ఇది ఘోర పరాభవం. వరుసగా పది మ్యాచ్ లు గెలిచిన ఇండియా.. అసలు మ్యాచ్ లో చేతులెత్తేసింది.

India vs Australia World Cup 2023 Final Live Score

10.01 PM: Ind vs Aus World Cup Final Live: ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా విరాట్ కోహ్లి నిలిచాడు. టోర్నీలో 765 రన్స్ చేసిన విషయం తెలిసిందే. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి.

9.36 PM: Ind vs Aus World Cup Final Live: ఆస్ట్రేలియా 1987, 1999, 2003, 2007, 2015, 2023లలో ఆరుసార్లు వరల్డ్ కప్ గెలిచింది.

9.32 PM: Ind vs Aus World Cup Final Live: ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ట్రావిస్ హెడ్ కే దక్కింది. ఫైనల్లో అతడు 120 బంతుల్లోనే 137 రన్స్ చేశాడు. సెమీఫైనల్లోనూ హెడ్ కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ ఏడాది మొదట్లో ఇండియాపైనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో రాణించిన హెడ్ అప్పుడు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎగరేసుకుపోవడం విశేషం.

9.31 PM: Ind vs Aus World Cup Final Live: 2003 వరల్డ్ కప్ ఫైనల్ కు స్వదేశంలో ప్రతీకారం తీర్చుకుంటుందనుకున్న టీమిండియా.. చివరికి బొక్కబోర్లా పడింది.

9.28 PM: Ind vs Aus World Cup Final Live: మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఒక్కో పరుగు చేయడానికి ఇబ్బంది పడిన పిచ్ పైనే ఆస్ట్రేలియా బ్యాటర్లు హెడ్, లబుషేన్ సులువుగా ఆడారు. ఇద్దరూ సునాయాసంగా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును ఉరకలెత్తించారు. దీంతో ఆస్ట్రేలియా సులువుగా గెలిచింది. టోర్నీ మొదట్లోనే వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన ఆస్ట్రేలియా.. చివరికి వరుసగా 9 మ్యాచ్ లు గెలిచి వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవడం విశేషం.

9.26 PM: Ind vs Aus World Cup Final Live: 241 రన్స్ చేజింగ్ లో ఆస్ట్రేలియా 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. హెడ్, లబుషేన్ మ్యాచ్ ను ఇండియాకు దూరం చేశారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు ఏకంగా 192 పరుగులు జోడించారు. మొదటి పది ఓవర్లలో షమి, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసినా.. మిగతా బౌలర్లు ఆ ఒత్తిడిని కొనసాగించలేకపోయారు.

9.24 PM: Ind vs Aus World Cup Final Live: స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ లో వరుసగా పది మ్యాచ్ లు గెలిచి మూడో వరల్డ్ కప్ పై ఆశలు రేపిన ఇండియన్ టీమ్.. ఫైనల్లో ఆస్ట్రేలియా జోరు ముందు నిలవలేకపోయింది. అద్భుతమైన బౌలింగ్, కళ్లు చెదిరే ఫీల్డింగ్, ఒత్తిడిలోనూ అదరగొట్టిన బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్ గెలిచింది.

9.21 PM: Ind vs Aus World Cup Final Live: ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్ గెలిచింది. 241 రన్స్ లక్ష్యాన్ని 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. మూడో వరల్డ్ కప్ గెలవాలన్న టీమిండియా కల కలగానే మిగిలిపోయింది. అసలు మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లలో టీమిండియా చేతులెత్తేసింది. ట్రావిస్ హెడ్ 120 బంతుల్లోనే 137 రన్స్ చేసి ఆస్ట్రేలియాను గెలిపించాడు. లబుషేన్ కూడా 58 పరుగులతో అజేయంగా నిలిచాడు.

9.13 PM: Ind vs Aus World Cup Final Live: 41 ఓవ‌ర్ల‌లో 230 ర‌న్స్ చేసిన ఆస్ట్రేలియా. విజ‌యానికి ఇంకో ప‌ద‌కొండు ప‌రుగుల దూరంలో ఆస్ట్రేలియా నిలిచింది.

9.10 PM: Ind vs Aus World Cup Final Live: ల‌బుషేన్ ఫోర్‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తిచేసుకున్నాడు. 99 బాల్స్‌లో 53 ర‌న్స్ చేశాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 40 ఓవ‌ర్ల‌లో 225 ర‌న్స్ చేసింది.

9.04 PM: Ind vs Aus World Cup Final Live: 39 ఓవ‌ర్ల‌లో 219 ర‌న్స్ చేసిన ఆస్ట్రేలియా. హెడ్ 127, ల‌బుషేన్ 48 ప‌రుగుల‌తో ఆడుతోన్నాడు. విజ‌యం కోసం ఆస్ట్రేలియా 22 ర‌న్స్ చేయాల్సి ఉంది.

8.56 PM: Ind vs Aus World Cup Final Live: హెడ్‌, ల‌బుషేన్ జోడీ నాలుగో వికెట్‌కు 150 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని జోడించారు. సెంచ‌రీ త‌ర్వాత హెడ్ సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డుతోన్నాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 37 ఓవ‌ర్ల‌లో 204 ర‌న్స్‌చేసింది.

8.51 PM: Ind vs Aus World Cup Final Live: 36 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల న‌ష్టానికి 195 ప‌రుగులు చేసింది. హెడ్ 109, ల‌బుషేన్ 42 ప‌రుగుల‌తో ఆడుతోన్నారు.

8.46 PM: Ind vs Aus World Cup Final Live: వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో సెంచ‌రీ చేసిన దిగ్గ‌జాల జాబితాలో హెడ్ చేరాడు. ప్ర‌స్తుతం విజ‌యానికి మ‌రో 49 ప‌రుగుల దూరంలో ఆస్ట్రేలియా ఉంది.

8.44 PM: Ind vs Aus World Cup Final Live:ట్రావిస్ హెడ్ సెంచ‌రీ చేశాడు. 95 బాల్స్‌లో 100 ర‌న్స్ చేశాడు. 35 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా 192 ర‌న్స్ చేసింది.

8.35 PM: Ind vs Aus World Cup Final Live: 32 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా 172 ప‌రుగులు చేసింది. హెడ్ 88, ల‌బుషేన్ 40 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

8.28 PM: Ind vs Aus World Cup Final Live: 30 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి ఆస్ట్రేలియా 167 ర‌న్స్ చేసింది. హెడ్ 86, ల‌బుషేన్ 37 ర‌న్స్‌తో ఆడుతోన్నారు. భార‌త బౌల‌ర్లు ఈ జోడీని విడ‌గొట్ట‌డానికి తీవ్రంగా శ్ర‌మిస్తోన్నారు.

8.21 PM: Ind vs Aus World Cup Final Live: 28 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా 162 ర‌న్స్ చేసింది. హెడ్ 84, ల‌బుషేన్ 34 ప‌రుగుల‌తో నిల‌క‌డ‌గా ఆడుతోన్నారు. విజ‌యానికి ఆస్ట్రేలియా 79 ప‌రుగుల దూరంలో ఉంది.

8.14 PM: Ind vs Aus World Cup Final Live: 27 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా 148 ర‌న్స్ చేసింది. హెడ్ 71, ల‌బుషేన్ 34 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

8.04 PM: Ind vs Aus World Cup Final Live: హెడ్‌, ల‌బుషేన్ ఆస్ట్రేలియాను విజ‌యం దిశ‌గా న‌డిపిస్తోన్నారు. 24 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా 127 ప‌రుగులు చేసింది.

7.57 PM: Ind vs Aus World Cup Final Live: ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచ‌రీ చేశాడు. 58 బాల్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 50 ర‌న్స్ చేశాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 22 ఓవ‌ర్ల‌లో 117 ర‌న్స్ చేసింది.

7.49 PM: Ind vs Aus World Cup Final Live: ఆస్ట్రేలియా స్కోరు వంద ప‌రుగులు దాటింది. హెడ్‌, ల‌బుషేన్ నిల‌క‌డ‌గా ఆడుతూ ఆస్ట్రేలియాను విజ‌యం దిశ‌గా న‌డిపిస్తోన్నారు. హెడ్ 44, ల‌బుషేన్ 14 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

7.42 PM: Ind vs Aus World Cup Final Live: 18 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా 95 ప‌రుగులు చేసింది. ల‌బుషేన్ 11, హెడ్ 41 ప‌రుగుల‌తో ఆడుతోన్నారు.

7.30 PM: Ind vs Aus World Cup Final Live: ప‌ద‌హారు ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా 87 ప‌రుగులు చేసింది. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో హెడ్ సిక్స్ కొట్టాడు. విజ‌యానికి ఆస్ట్రేలియా 154 ప‌రుగుల దూరంలో ఉంది.

7.30 PM: Ind vs Aus World Cup Final Live: ఆస్ట్రేలియా ప‌దిహేను ఓవ‌ర్ల‌లో 78 ర‌న్స్ చేసింది. హెడ్ 28 ప‌రుగులు, ల‌బుషేన్ 9 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

7.24 PM: Ind vs Aus World Cup Final Live: ప‌ద‌మూడు ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆస్ట్రేలియా 70 ర‌న్స్ చేసింది. హెడ్ 24 ర‌న్స్‌, ల‌బుషేన్ 4 ప‌రుగుల‌కు క్రీజులో ఉన్నారు.

7.15 PM: Ind vs Aus World Cup Final Live: ప‌ది ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్లు న‌ష్ట‌పోయి 60 ర‌న్స్ చేసింది. ట్రావిస్ హెడ్ 19, ల‌బుషేన్ 0 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌల‌ర్ల‌లో బుమ్రా 2, ష‌మీ ఒక్క వికెట్ తీశారు

7.03 PM: Ind vs Aus World Cup Final Live: టీమిండియాకు బుమ్రా మ‌రో బ్రేక్ ఇచ్చాడు. స్మిత్‌ను ఔట్‌చేశాడు. 9 బాల్స్‌లో నాలుగు ప‌రుగులు మాత్ర‌మే చేసిన స్మిత్ పెవిలియ‌న్ చేరుకున్నాడు. ప్ర‌స్తుతం ఏడు ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా 47 ప‌రుగులు చేసింది.

6.52 PM: Ind vs Aus World Cup Final Live: ఆస్ట్రేలియా ఐదు ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు న‌ష్ట‌పోయి 41 ప‌రుగులు చేసింది. ఐదో ఓవ‌ర్‌ను బుమ్రా మెయిడిన్‌గా వేశాడు. బుమ్రా, ష‌మీ త‌లో ఒక్క వికెట్ తీశారు.

6.51 PM: Ind vs Aus World Cup Final Live: 41 ప‌రుగుల‌ వ‌ద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. మార్ష్‌ను బుమ్రా ఔట్ చేశాడు. 15 బాల్స్‌లో 15 ప‌రుగులు చేశాడు మార్ష్‌.

6.47 PM: Ind vs Aus World Cup Final Live: ల‌క్ష్య‌ఛేధ‌న‌లో ఆస్ట్రేలియా ధాటిగా ఆడుతోంది. నాలుగు ఓవ‌ర్ల‌లో 41 ర‌న్స్ చేసింది. ట్రావిస్ హెడ్ 8, మార్ష్ 15 ప‌రుగుల‌తో ఆడుతోన్నారు.

6.36 PM: Ind vs Aus World Cup Final Live: టీమిండియాకు ష‌మీ బ్రేకిచ్చాడు. రెండో ఓవ‌ర్‌లో వార్న‌ర్‌ను ఔట్ చేశాడు. ఏడు ప‌రుగులు చేసిన వార్న‌ర్ పెవిలియ‌న్ చేరుకున్నాడు. రెండు ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆస్ట్రేలియా 28 ప‌రుగులు చేసింది.

6.30 PM: Ind vs Aus World Cup Final Live: ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లోనే ఆస్ట్రేలియా ప‌దిహేను ప‌రుగులు చేసింది. హెడ్ రెండు ఫోర్లు, వార్న‌ర్ ఒక ఫోర్ కొట్టాడు.

5.57 PM: Ind vs Aus World Cup Final Live: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పిచ్ పై బ్యాటింగ్ చాలా కష్టంగా సాగింది. కొత్త బంతితో రోహిత్ మాత్రమే ధాటిగా ఆడగా.. తర్వాత కోహ్లి, రాహుల్ లాంటి బ్యాటర్లు కూడా బౌండరీలు బాదడానికి చాలా ఇబ్బంది పడ్డారు. 10 నుంచి 50 ఓవర్ల మధ్య ఇండియా కేవలం 5 ఫోర్లు మాత్రమే కొట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

5.53 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి 10 ఓవర్లలోనే 80 రన్స్ చేసిన ఇండియా.. చివరి 40 ఓవర్లలో కేవలం 160 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి మన బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇండియా ఇన్నింగ్స్ మొత్తం కేవలం 13 ఫోర్లు మాత్రమే ఉండటం గమనార్హం.

ఆస్ట్రేలియా తరఫున స్టార్క్ 3, కమిన్స్, హేజిల్ వుడ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మధ్యలో రివర్స్ స్వింగ్ కావడంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. కేఎల్ రాహుల్ 66 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోహ్లి 54 రన్స్ చేశాడు. మొదట్లోచెలరేగి ఆడిన రోహిత్ 31 బంతుల్లో 47 రన్స్ చేశాడు. అతడు 4 ఫోర్లు, 3 సిక్స్ లు కొట్టాడు. కోహ్లి 4, రాహుల్ ఒక ఫోర్ మాత్రమే కొట్టగలిగారు.

5.47 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 49 ఓవర్లలో 9 వికెట్లకు 232 రన్స్ చేసింది. మరొక్క ఓవర్ మాత్రమే మిగిలి ఉంది.

5.42 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 48 ఓవర్లలో 9 వికెట్లకు 227 రన్స్ చేసింది. హేజిల్ వుడ్ బౌలింగ్ లో సూర్యకుమార్ 18 రన్స్ చేసి ఔటయ్యాడు.

5.31 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 46 ఓవర్లలో 8 వికెట్లకు 221 రన్స్ చేసింది.

5.24 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 8వ వికెట్ కోల్పోయింది.

5.19 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా ఏడో వికెట్ కోల్పోయింది. షమి (6) ఔటయ్యాడు. అతడు 10 బంతుల్లో 6 రన్స్ చేశాడు. ఇండియా 43.4 ఓవర్లలో 7 వికెట్లకు 211 రన్స్ చేసింది.

5.16 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియాకు రివర్స్ స్వింగ్ పరీక్ష పెడుతోంది. ఆస్ట్రేలియా బౌలర్లు రివర్స్ స్వింగ్ చేస్తుండటంతో బ్యాటర్లు పరుగులు చేయలేకపోతున్నారు. 43 ఓవర్లలో 6 వికెట్లకు 211 రన్స్ చేసింది.

5.08 PM: Ind vs Aus World Cup Final Live: కేఎల్ రాహుల్ కూడా కీలకమైన సమయంలో ఔటయ్యాడు. దీంతో 203 పరుగుల దగ్గర ఆరో వికెట్ కోల్పోయింది. రాహుల్ 107 బంతుల్లో కేవలం ఒకే ఫోర్ తో 66 రన్స్ చేశాడు.

5.00 PM: Ind vs Aus World Cup Final Live: రెండో పవర్ ప్లే ముగిసింది. ఈ పవర్ ప్లే 30 ఓవర్లలో ఇండియా కేవలం రెండే రెండు ఫోర్లు కొట్టింది. ఇప్పుడు మరో 10 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇండియా 5 వికెట్లకు 197 రన్స్ చేసింది.

4.56 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా గత 29 ఓవర్లలో కేవలం రెండో ఫోర్ మాత్రమే కొట్టింది. 39వ చివరి బంతికి సూర్యకుమార్ బౌండరీ బాదాడు. దీంతో ఇండియా 39 ఓవర్లలో 5 వికెట్లకు 192 రన్స్ చేసింది.

4.51 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా ఒత్తిడిలో పడిపోయింది. 38 ఓవర్లలో 5 వికెట్లకు 182 రన్స్ చేసింది.

4.47 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 37 ఓవర్లలో 5 వికెట్లకు 179 రన్స్ చేసింది. రాహుల్, సూర్య క్రీజులో ఉన్నారు.

4.40 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా (22 బంతుల్లో 9) ఔటయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్ లో అతడు వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఇండియా 35.5 ఓవర్లలో 5 వికెట్లకు 178 రన్స్ చేసింది.

4.34 PM: Ind vs Aus World Cup Final Live: కేఎల్ రాహుల్ ఫైటింగ్ హాఫ్ సెంచరీ చేశాడు. అతడు 86 బంతుల్లో కేవలం ఒకే ఒక్క బౌండరీతో ఫిఫ్టీ చేయడం విశేషం. దీంతో ఇండియా 35 ఓవర్లలో 4 వికెట్లకు 173 రన్స్ చేసింది.

4.18 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా ఇన్నింగ్స్ 32 ఓవర్లు ముగిశాయి. టీమిండియా 4 వికెట్లకు 162 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ 45, జడేజా 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. కమిన్స్ 2, మ్యాక్స్‌వెల్, స్టార్క్ చెరొక వికెట్ తీశారు.

4.11 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 30 ఓవర్లలో 4 వికెట్లకు 152 రన్స్ చేసింది.

4.02 PM: Ind vs Aus World Cup Final Live: టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కమిన్స్ బౌలింగ్ లో విరాట్ కోహ్లి బౌల్డయ్యాడు. అతడు 63 బంతుల్లో 54 రన్స్ చేశాడు. కేవలం 4 బౌండరీలు కొట్టాడు. రాహుల్ తో కలిసి నాలుగో వికెట్ కు కోహ్లి 67 రన్స్ జోడించాడు. గాడిలో పడుతుందనుకున్న ఇన్నింగ్స్ కోహ్లి ఔట్ తో మళ్లీ కష్టాల్లో పడినట్లు అయింది. అయితే కోహ్లి ఔటైన తర్వాత సూర్యకుమార్ స్థానంలో రవీంద్ర జడేజా రావడం విశేషం.

3.56 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 97 బంతుల తర్వాత ఓ బౌండరీ కొట్టింది. 27వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ బౌలింగ్ లో రాహుల్ తన తొలి ఫోర్ కొట్టాడు. దీంతో ఇండియా 27 ఓవర్లలో 3 వికెట్లకు 142 రన్స్ చేసింది.

3.50 PM: Ind vs Aus World Cup Final Live: విరాట్ కోహ్లి మరో హాఫ్ సెంచరీ చేశాడు. అతడు 56 బంతుల్లో 4 ఫోర్లతో ఫిఫ్టీ చేయడం విశేషం. రాహుల్ తో కలిసి నాలుగో వికెట్ కు ఇప్పటికే ఫిఫ్టీ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పాడు. ఇండియా 26 ఓవర్లలో 3 వికెట్లకు 135 రన్స్ చేసింది.

3.48 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా ఇన్నింగ్స్ సగం ఓవర్లు ముగిశాయి. కోహ్లి, రాహుల్ 15 ఓవర్లుగా ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. దీంతో ఇండియా 25 ఓవర్లలో 3 వికెట్లకు 131 రన్స్ చేసింది.

3.41 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 23 ఓవర్లలో 3 వికెట్లకు 125 రన్స్ చేసింది. 13 ఓవర్లుగా ఒక్క ఫోర్ కూడా రాలేదు.

3.37 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 22 ఓవర్లలో 3 వికెట్లకు 121 రన్స్ చేసింది. 12 ఓవర్లుగా రాహుల్, కోహ్లి ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. ఇద్దరూ వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

3.34 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 21 ఓవర్లలో 3 వికెట్లకు 119 రన్స్ చేసింది. 11 ఓవర్లుగా ఒక్క బౌండరీ కూడా రాలేదు. కోహ్లి, రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు.

3.29 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 20వ ఓవర్లో కేవలం 2 రన్స్ చేసింది. దీంతో 20 ముగిసే సమయానికి ఇండియా 3 వికెట్లకు 15 రన్స్ తో ఉంది.

3.25 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 19 ఓవర్లలో 3 వికెట్లకు 113 రన్స్ చేసింది. కోహ్లి, రాహుల్ ఇన్నింగ్స్ తిరిగి నిర్మించడానికి ఆచితూచి ఆడుతున్నారు.

3.18 PM: Ind vs Aus World Cup Final Live: 17వ ఓవర్లో కేవలం 3 పరుగులకే వచ్చాయి. కోహ్లి, రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు.

3.12 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 16 ఓవర్లలో 3 వికెట్లకు 101 రన్స్ చేసింది. రెండు ఓవర్ల వ్యవధిలో రెండు వికెట్లు పడిపోవడంతో కోహ్లి, రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు. సింగిల్స్ పైనే ఎక్కువ దృష్టి సారించారు. దీంతో స్కోరుబోర్డు నెమ్మదించింది.

3.08 PM: Ind vs Aus World Cup Final Live: టీమిండియా భారమంతా కోహ్లి, రాహుల్ లపైనే వేసింది. ఇండియా 15 ఓవర్లలో 3 వికెట్లకు 97 రన్స్ చేసింది.

2.54 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 12 ఓవర్లలో 3 వికెట్లకు 87 రన్స్ చేసింది.

2.46 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా మూడో వికెట్ కోల్పోయింది. టాప్ ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ కేవలం 4 రన్స్ చేసి కమిన్స్ బౌలింగ్ లో వికెట్ కీపర్ ఇంగ్లిస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇండియా 10.2 ఓవర్లలో 3 వికెట్లకు 81 రన్స్ చేసింది.

2.42 PM: Ind vs Aus World Cup Final Live: టీమిండియాకు షాక్ తగిలింది. రోహిత్ శర్మ 47 రన్స్ చేసి ఔటయ్యాడు. మరోసారి హాఫ్ సెంచరీ ముందే రోహిత్ ఔటయ్యాడు. అతడు 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 47 రన్స్ చేశాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్ లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి తర్వాత బంతికే మరో భారీ షాట్ కు ప్రయత్నించగా.. ట్రావిస్ హెడ్ కళ్లు చెదిరే క్యాచ్ తో రోహిత్ ను పెవిలియన్ కు పంపించాడు. ఇండియా తొలి పవర్ ప్లే 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లకు 80 రన్స్ చేసింది.

2.39 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 రన్స్ చేసింది. రోహిత్ 37, కోహ్లి 23 రన్స్ తో ఆడుతున్నారు. ఇండియా ఈ మ్యాచ్ లో 6.3 ఓవర్లలోనే 50 చేసింది. వరల్డ్ కప్ ఫైనల్స్ లో అత్యంత వేగంగా 50 రన్స్ చేరుకున్న టీమ్ గా ఇండియా నిలిచింది.

2.35 PM: Ind vs Aus World Cup Final Live: విరాట్ కోహ్లి ఊపు మీదున్నాడు. స్టార్క్ బౌలింగ్ లో వరుసగా మూడు ఫోర్లు బాదిన కోహ్లి.. తర్వాత మ్యాక్స్‌వెల్ఓవర్లో ఒక ఫోర్ కొట్టాడు. దీంతో ఇండియా 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 61రన్స్ చేసింది.

2.22 PM: Ind vs Aus World Cup Final Live: రోహిత్ శర్మ మరో సిక్స్ బాదాడు. ఐదో ఓవర్లో స్టార్క్ వేసిన చివరి బంతికి లాంగాఫ్ పైనుంచి సిక్స్ కొట్టాడు. దీంతో ఇండియా వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది.

2.19PM: Ind vs Aus World Cup Final Live: ఫైనల్లో ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్ లో మిడాన్ లో జంపాకు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు.

2.17PM: Ind vs Aus World Cup Final Live: నాలుగో ఓవర్లో రోహిత్ శర్మ ఓ సిక్స్, ఫోర్ కొట్టాడు. దీంతో ఇండియా వికెట్ నష్టపోకుండా 30 రన్స్ చేసింది. హేజిల్‌వుడ్ లక్ష్యంగా రోహిత్ బాదేస్తున్నాడు.

2.12 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా మూడు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 18 రన్స్ చేసింది. రోహిత్ 14, గిల్ 3 పరుగులతో ఆడుతున్నారు.

2.07 PM: Ind vs Aus World Cup Final Live: రెండో ఓవర్లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఇండియా వికెట్ నష్టపోకుండా 13 రన్స్ చేసింది.

2.02 PM: Ind vs Aus World Cup Final Live: తొలి ఓవర్ ముగిసింది. ఇండియా వికెట్ నష్టపోకుండా 3 రన్స్ చేసింది. రోహిత్ 3, గిల్ 0తో ఆడుతున్నారు.

2.00 PM: Ind vs Aus World Cup Final Live: మొదలైన ఫైనల్ మ్యాచ్. తొలి బంతికే రోహిత్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసిన స్టార్క్.

1.55 PM: Ind vs Aus World Cup Final Live: భారత జాతీయ గీతంతో మార్మోగిన నరేంద్ర మోదీ స్టేడియం. లక్ష మందికిపైగా జాతీయ గీతం ఆలపించారు.

1.50 PM: Ind vs Aus World Cup Final Live: టాస్ సందర్భంగా రోహిత్ ఏమన్నాడంటే..

“నేను కూడా మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నా. మంచి పిచ్ లా ఉంది. పెద్ద మ్యాచ్. మంచి స్కోరు చేయాలి. ఎప్పుడు ఇక్కడ ఆడినా పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారు. క్రికెటింగ్ ఈవెంట్ లో ఇదే అతి పెద్ద సందర్భం. మేము కామ్ గా ఉండాలి. ఫైనల్లో ఇండియన్ టీమ్ కు కెప్టెన్ గా ఉండటం కల నిజమవడం లాంటిదే. బాగా ఆడి ఫలితం రాబట్టాలి. ఫీల్డ్ లో సరైన నిర్ణయాలు తీసుకోవాలి.”

1.45 PM: Ind vs Aus World Cup Final Live: ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే

డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్

1.40 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా తుది జట్టు ఇదే

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, బుమ్రా, సిరాజ్, షమి

1.35 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కు ముందు నరేంద్ర మోదీ స్టేడియంపై సూర్యకిరణ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్ షో జరుగుతోంది. 1.35 నుంచి 1.50 గంటల వరకూ ఈ షో ఉంటుంది.

1.30 PM: Ind vs Aus World Cup Final Live: ఇండియాతో ఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తాను టాస్ గెలిస్తే బ్యాటింగే ఎంచుకునే వాడినని రోహిత్ శర్మ చెప్పడం విశేషం. ఫైనల్లోనూ తుది జట్టులో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. సూర్య స్థానంలో అశ్విన్ వస్తాడని అంచనా వేసినా.. రోహిత్ మాత్రం గెలుపు గుర్రాలతోనే ఫైనల్లో చరిత్ర సృష్టించడానికి సిద్ధమయ్యాడు.

1.25 PM: Ind vs Aus World Cup Final Live: రవిశాస్త్రి పిచ్ రిపోర్ట్ ఇదీ

ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ పిచ్ నంబర్ 5పై జరగనుందని, ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన పిచ్ ఇదే అయినా అప్పటికీ ఇప్పటికీ మారిపోయిందని పిచ్ రిపోర్ట్ సందర్భంగా రవిశాస్త్రి చెప్పాడు. "పిచ్ డ్రైగా ఉంది. ఎక్కువ రోలింగ్ చేయలేదు. పాకిస్థాన్ మ్యాచ్ లో కాస్త ఎక్కువ రోలింగ్ చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన భారీ స్కోరు చేయడం మంచిది. అయితే ఇండియా అన్ని రకాలుగా సిద్ధమైన కారణంగా దీని గురించి పెద్దగా ఆలోచించకపోవచ్చు" అని రవిశాస్త్రి అన్నాడు.

1.20 PM: Ind vs Aus World Cup Final Live: అశ్విన్ ఆడతాడా?

వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియాతోనే తొలి మ్యాచ్ ఆడిన స్పిన్నర్ అశ్విన్ ఇప్పుడు ఫైనల్ ఆడతాడా? మ్యాచ్ జరగబోయే పిచ్ పక్కనే ఉన్న మరో పిచ్ పై అశ్విన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం. ఇండియాన్ బౌలర్లలో అతడొక్కడే బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.

1.05 PM: Ind vs Aus World Cup Final Live: నీలి సముద్రమైన నరేంద్ర మోదీ స్టేడియం

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం నీలి సముద్రంగా మారిపోయింది. వరల్డ్ కప్ 2023లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ చూడటానికి లక్ష మందికిపైగా ఫ్యాన్స్ స్టేడియానికి తరలివచ్చారు. దాదాపు అందరూ టీమిండియాకు చెందిన బ్లూ జెర్సీలు వేసుకోవడంతో స్టేడియమంతా నీలిమయమైంది.

12.45 PM: Ind vs Aus World Cup Final Live: క్లోజింగ్ సెర్మనీ సాగేది ఇలా..

వరల్డ్ కప్ 2023 క్లోజింగ్ సెర్మనీని ఒకేసారి కాకుండా.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభం నుంచి ముగింపు వరకూ నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ ను కూడా రిలీజ్ చేసింది.

  • మధ్యాహ్నం టాస్ తర్వాత 1.35 నుంచి 1.50 వరకు సూర్యకిరణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షో ఉంటుంది.
  • ఫస్ట్ ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ లో ఆదిత్య గడ్వి ప్రదర్శన ఉంటుంది
  • ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్రేక్ లో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్, సింగర్లు జొనితా గాంధీ, అమిత్ మిశ్రా, నకాశ్ అజీజ్ లాంటి వాళ్ల ప్రదర్శన ఉంటుంది
  • రెండో ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ లో లేజర్, లైట్ షో నిర్వహిస్తారు.

12.38 PM: Ind vs Aus World Cup Final Live: 140 కోట్ల మంది మీ వెనుక ఉన్నారు: నరేంద్ర మోదీ

వరల్డ్ కప్ 2023 ఫైనల్ కు ముందు టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ బెస్ట్ విషెస్ చెప్పారు. 140 కోట్ల మంది మీ వెనుక ఉన్నారని, ఆల్ ద బెస్ట్ టీమిండియా అని ట్వీట్ చేశారు. బాగా ఆడండి.. ప్రకాశవంతంగా వెలగండి.. క్రీడాస్ఫూర్తిని చాటండి అని మోదీ అన్నారు.

12.35 PM: Ind vs Aus World Cup Final Live: స్టేడియానికి పోటెత్తుతున్న అభిమానులు

ప్రపంచంలోనే అతిపెద్దదైన క్రికెట్ స్టేడియంలో జరగబోతున్న వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలి వస్తున్నారు. సుమారు 1.3 లక్షల మంది ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసే అవకాశాలు ఉన్నాయి. వేలాది మంది అభిమానులతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

12.25 PM: Ind vs Aus World Cup Final Live: ఊపు మీదున్న టీమిండియా బ్యాటర్లు

ఈ వరల్డ్ కప్ లో టీమిండియా బ్యాటర్లు మాంచి ఊపు మీదున్నారు. టాప్ 10లో ఏకంగా ముగ్గురు ఇండియన్సే కావడం విశేషం. టాప్ ప్లేస్ లో 711 పరుగులతో విరాట్ కోహ్లి ఉన్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 550 పరుగులతో ఐదో స్థానంలో ఉండగా.. నాలుగో స్థానంలో అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్ 526 రన్స్ తో ఏడో స్థానంలో ఉన్నాడు. వీళ్లలో కోహ్లి సగటు 101.57 కావడం విశేషం.

12.20 PM: Ind vs Aus World Cup Final Live: బయలుదేరిన టీమిండియా

వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా స్టేడియానికి బయలుదేరింది. 1.30 గంటలకు టాస్, 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

11.55 AM: Ind vs Aus World Cup Final Live: బెట్టింగ్స్ మొత్తం ఇండియాపైనే..

వరల్డ్ కప్ 2023 ఫైనల్ పై వేల కోట్ల బెట్టింగ్స్ నడుస్తుండగా.. ఇండియానే ఫేవరెట్ అంటూ అందరూ తేల్చేస్తున్నారు. ఇటు ఆస్ట్రేలియా, అటు యూకేలాంటి దేశాల్లోనూ ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పందెం రాయుళ్లు తేల్చేస్తున్నారు.

11.45 AM: Ind vs Aus World Cup Final Live: తుది జట్టులో మార్పులు ఉంటాయా?

వరల్డ్ కప్ 2023లో టీమిండియా తాను ఆడిన చివరి 6 మ్యాచ్ లలో తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎలాంటి ప్రాధాన్యత లేని నెదర్లాండ్స్ తో మ్యాచ్ కు కూడా పూర్తిస్థాయి జట్టుతోనే దిగింది. ఇక ఇప్పుడు ఫైనల్ కు కూడా అదే రిపీటయ్యే అవకాశాలు ఉన్నాయి. అహ్మదాబాద్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఇండియన్ టీమ్ స్పిన్నర్ అశ్విన్ తీసుకుంటుందని భావిస్తున్నా.. ఈ మెగా ఫైనల్ కు ఎలాంటి రిస్క్ తీసుకునే ఉద్దేశం మేనేజ్‌మెంట్ కు ఉండకపోవచ్చు.

11.15 AM: Ind vs Aus World Cup Final Live: టీమిండియాకు గుడ్ న్యూస్

ఈ వరల్డ్ కప్ లో టీమిండియా బౌలర్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఈ టోర్నీలో సెమీఫైనల్ వరకూ 10 మ్యాచ్ లలో ఇండియన్ బౌలర్లు ఏకంగా 95 వికెట్లు తీశారు. ఇప్పటి వరకూ వరల్డ్ కప్ చరిత్రలో రెండుసార్లు మాత్రమే ఇలా జరిగింది. 2003లో ఆస్ట్రేలియా బౌలర్లు 96 వికెట్లు తీశారు.

తర్వాత 2007లోనూ అదే టీమ్ కు చెందిన బౌలర్లు 97 వికెట్లు తీసుకున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆస్ట్రేలియా టీమ్ వరుసగా 11 మ్యాచ్ లు గెలిచి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. ఇప్పుడు ఇండియా కూడా దానికి అడుగు దూరంలో ఉంది. అంతేకాదు తొలిసారి 100 వికెట్లకుపైగా తీసే అవకాశం కూడా ఉంది.

11.10 AM: Ind vs Aus World Cup Final Live: వరల్డ్ కప్‌లలో ఇండియా vs ఆస్ట్రేలియా రికార్డు ఇదీ

వరల్డ్ కప్ లలో ఇండియా, ఆస్ట్రేలియా 13సార్లు తలపడ్డాయి. అందులో ఇండియా 5, ఆస్ట్రేలియా 8 మ్యాచ్ లలో గెలిచాయి. నాకౌట్ స్టేజ్ లో మూడుసార్లు తలపడగా.. రెండుసార్లు ఆస్ట్రేలియా గెలిచింది. 2003 ఫైనల్, 2011 క్వార్టర్ ఫైనల్, 2015 సెమీఫైనల్స్ లో ఈ టీమ్స్ ఆడాయి. 2011లో మాత్రమే ఇండియా గెలిచింది.

10.35 AM: Ind vs Aus World Cup Final Live: అదిరిపోనున్న క్లోజింగ్ సెర్మనీ

వరల్డ్ కప్ 2023 ఫైనల్ సందర్భంగా బీసీసీఐ అదిరిపోయే క్లోజింగ్ సెర్మనీ ప్లాన్ చేసింది. ఈ మ్యాచ్ కు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రానుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఇక ఇప్పటి వరకూ వరల్డ్ కప్ లు గెలిచిన కెప్టెన్లందరికీ ప్రత్యేకమైన బ్లేజర్ లు ఇవ్వనున్నారు. వాళ్లంతా ఈ జెర్సీల్లోనే మ్యాచ్ చూస్తారు. ఫైనల్ క్లోజింగ్ సెర్మనీలో ఏయే కార్యక్రమాలు ఉండబోతున్నాయో బీసీసీఐ శనివారమే (నవంబర్ 18) ఓ ప్రకటనలో వెల్లడించింది.

10.05 AM: Ind vs Aus World Cup Final Live: ఇండియా ఆధిపత్యానికి కారణమిదే: రోహిత్

వరల్డ్ కప్ 2023లో ఇండియా తిరుగులేని ఆధిపత్యం చెలాయించడానికి కారణమేంటో చెప్పాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఫైనల్ కు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు. "బ్రాండ్ క్రికెట్ ఆడటం అవసరం. ఒకవేళ అలా ఆడాలని నిర్ణయిస్తే దానిని అమలు చేయాల్సిందే. ప్లేయర్స్ అదే చేశారు. మేము చేసిన స్కోర్లు, చేజింగ్ లు అదే చెబుతున్నాయి.

ఆ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటానికి అందరూ వెళ్లి దూకుడుగా ఆడటం సరికాదు. ఒక్కో వ్యక్తికి ఒక్కో రోల్ ఇచ్చాం. అలా ఆడితే టీమ్ కు లబ్ధి చేకూరుతుందని చెప్పాం. 99.9 శాతం అలాగే ఆడాం. 0.1 శాతం చేయలేదు. ఎందుకంటే ఎవరూ పర్ఫెక్ట్ కాదు కదా" అని రోహిత్ అన్నాడు.

9.56 AM: Ind vs Aus World Cup Final Live: ఏసీఏ అదిరిపోయే ప్లాన్

ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కోసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సూపర్ ప్లాన్ వేసింది. ఈ మ్యాచ్ ను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి లైవ్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వైజాగ్ లో ఇప్పటికే ఆర్కే బీచ్ రోడ్డులో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఫైనల్ సందర్భంగానూ అక్కడ ఫ్యాన్స్ లైవ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు.

9.35 AM: Ind vs Aus World Cup Final Live: ఇండియాకు మూడొస్తుందా?

ఇండియాకు మూడొస్తుందా? ఆస్ట్రేలియా ఆరేస్తుందా? ఇప్పుడు క్రికెట్ అభిమానులందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే. ఇండియా ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ గెలుస్తుందా లేక ఆస్ట్రేలియా ఆరోసారి కప్పు అందుకుంటుందా చూడాలి. ఇండియా 1983, 2011 వరల్డ్ కప్ లలో గెలవగా.. ఆస్ట్రేలియా 1987, 1999, 2003, 2007, 2015లలో గెలిచింది.

9.30 AM: Ind vs Aus World Cup Final Live: ఇండియా, పాకిస్థాన్ ఆడిన పిచ్ పైనే..

వరల్డ్ కప్ 2023లో ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కు అప్పటికే ఉపయోగించిన పిచ్ నే వాడటంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఫైనల్లోనూ అదే జరగనుంది. ఈ వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్థాన్ ఆడిన పిచ్ పై ఫైనల్ కూడా జరగనుంది. ఈ పిచ్ కాస్త నెమ్మదిగా ఉండటంతో.. ఫైనల్ లోస్కోరింగ్ థ్రిల్లర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

8.55 AM: Ind vs Aus World Cup Final Live: ఫైనల్ మ్యాచ్‌కు వాతావరణం ఎలా ఉందంటే?

ఇండియా, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు వాతావరణం పూర్తి పొడిగా ఉండనుంది. కనిష్ఠంగా 19 డిగ్రీలు, గరిష్ఠంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ మ్యాచ్ కు అసలు వర్షం కురిసే అవకాశాలే లేవు.

8.20 AM: Ind vs Aus World Cup Final Live: ఇండియా గెలవాలని పూజలు

ఆస్ట్రేలియాతో జరగబోతున్న వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా గెలవాలని వారణాసిలోని దశశ్వమేధ ఘాట్ లో ప్రత్యేక హారతి, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత త్రివర్ణ పతాకంతోపాటు రోహిత్ శర్మ, ఇతర ఇండియన్ టీమ్ ప్లేయర్స్ ఫొటోలను అభిమానులు పట్టుకొని కనిపించారు.

8.15 AM: Ind vs Aus World Cup Final Live: ఛాంపియన్ టీమ్స్ ఫైనల్ ఫైట్

45 రోజుల పాటు ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన వరల్డ్ కప్ 2023 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం (నవంబర్ 19) గ్రాండ్ ఫినాలేలో ఛాంపియన్ టీమ్స్ ఇండియా, ఆస్ట్రేలియా టైటిల్ కోసం తలపడబోతున్నాయి.

సెమీఫైనల్లో ఇండియా 70 పరుగులతో న్యూజిలాండ్ ను చిత్తు చేసి రాగా.. మరో సెమీఫైనల్లో సౌతాఫ్రికాను కష్టమ్మీద 3 వికెట్లతో ఓడించింది ఆస్ట్రేలియా. ఈ రెండు టీమ్స్ లో విజేత ఎవరన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.

Whats_app_banner