WTC 2025 Final: డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‍కు చేరాలంటే భారత్ ఏం చేయాలి?
20 October 2024, 18:22 IST
- WTC 2025 Final - Team India: న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో భారత్ పరాజయం పాలైంది. అయినా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్‍లో ఉంది. అయితే, 2025లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే భారత్ ఇంకా ఎన్ని మ్యాచ్‍లు గెలువాలంటే..
WTC 2025 Final: డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‍కు చేరాలంటే భారత్ ఏం చేయాలి?
న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో చివరి రోజైన నేడు (అక్టోబర్ 20) న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్‍పై గెలిచింది. 36ఏళ్ల తర్వాత భారత గడ్డపై ఓ టెస్టు విజయం రుచిచూసింది కివీస్. ఈ టెస్టులో ఓ దశలో పుంజుకున్నా చివరికి రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఓడిపోయింది.
పాయింట్ల పట్టికలో టాప్‍లోనే..
న్యూజిలాండ్‍తో తొలి టెస్టు ఓడినా ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ టాప్‍లోనే ఉంది. ఈ సైకిల్‍లో ఇప్పటి వరకు 12 టెస్టుల్లో 8 గెలిచి, మూడు ఓడి, ఒకటి డ్రా చేసుకుంది భారత్. దీంతో 98 పాయింట్లు, 68.06 శాతంతో ఫస్ట్ ప్లేస్‍లో కొనసాగింది. ఆస్ట్రేలియా (90 పాయింట్లు, 62.50 శాతం), శ్రీలంక (60 పాయింట్లు, 55.56 శాతం)తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ (48 పాయింట్లు, 44.44 శాతం) నాలుగో ప్లేస్‍లో నిలిచింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, వెస్టిండీస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ సైకిల్ ముగిసే సరికి టాప్-2లో ఉండే జట్లు 2025 జూన్‍లో లార్స్డ్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతాయి.
భారత్ ఫైనల్ చేరాలంటే..
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‍లో భారత్ ఇంకా ఏడు టెస్టు మ్యాచ్‍లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్‍తో ప్రస్తుతం సిరీస్‍లో రెండు టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ ఏడు టెస్టుల్లో టీమిండియా కనీసం నాలుగు మ్యాచ్‍ల్లో గెలిచి.. రెండు డ్రా చేసుకోవాలి. ఇలా చేస్తే 67.54 శాతంతో డబ్ల్యూటీసీ ఫైనల్‍లో భారత్ అడుగుపెడుతుంది. ఐదు మ్యాచ్‍ల్లో గెలిస్తే మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే, ఈ ఏడు టెస్టుల్లో రెండు కంటే ఎక్కువ మ్యాచ్‍లను భారత్ ఓడిపోతే ఫైనల్ చేరడం కష్టమవుతుంది. ఒకవేళ మూడు మాత్రమే గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఫైనల్ బెర్త్ ఆధారపడుతుంది.
మూడు టెస్టుల సిరీస్‍లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో మ్యాచ్ అక్టోబర్ 24వ తేదీన మొదలుకానుంది. పుణె వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా టీమిండియా, కివీస్ మధ్య నవంబర్ 1వ తేదీ నుంచి మూడో టెస్టు జరగనుంది. ఈ సిరీస్‍లో తొలి టెస్టులో ఓడి 0-1తో వెనుకంజలో ఉన్న భారత్.. పుంజుకోవాలని కసితో ఉండనుంది. ఈ సిరీస్‍ను 2-1తో కైవసం చేసుకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు భారత్‍కు పెరుగుతాయి. ఆసీస్ గడ్డపై రెండు టెస్టులు గెలిచినా సరిపోతుంది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ నవంబర్ 22 నుంచి 2025 జనవరి 7వ తేదీ మధ్య జరగనుంది.
కాగా, న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైనా టీమిండియా బాగా పుంజుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ (150) తొలి శకతం చేయడం సహా రిషబ్ పంత్ (99) అద్భుతంగా ఆడటంతో పటిష్ట స్థితికి చేరింది. అయితే, చివరి 7 వికెట్లను 54 పరుగుల వ్యవధిలో కోల్పోయి కష్టాల్లో పడింది. 462 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. 107 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లే కోల్పోయి ఛేదించింది న్యూజిలాండ్.
టాపిక్