India vs England Weather: వర్షం వల్ల భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ రద్దయితే ఏం జరుగుతుంది?
26 June 2024, 6:29 IST
- India vs England T20 World Cup 2024 Semi Final: టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్‍లో ఇంగ్లండ్‍తో టీమిండియా తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‍కు వర్షం ముప్పు ఉంది. ఒకవేళ వాన వల్ల ఈ సెమీస్ రద్దయితే ఏం జరుగుతుందో ఇక్కడ చూడండి.
India vs England Weather: వర్షం వల్ల భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ రద్దయితే ఏం జరుగుతుంది?
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో అద్భుత ఆట తీరుతో భారత్ దుమ్మురేపుతోంది. సూపర్-8 దశలోనూ మూడు మ్యాచ్‍ల్లో మూడు గెలిచి సెమీఫైనల్‍కు దూసుకెళ్లింది. టీ20 ప్రపంచకప్‍ల్లో ఐదోసారి సెమీస్ చేరింది. టీ20 ప్రపంచకప్ 2024 రెండో సెమీఫైనల్‍లో ఇంగ్లండ్‍తో టీమిండియా తలపడనుంది. గురువారం (జూన్ 27) గయానా వేదికగా ఈ సెమీస్ పోరు జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‍కు వాన ముప్పు అధికంగా ఉంది. వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి.
వాన పడే అవకాశాలు ఎంత..
భారత్, ఇంగ్లండ్ సెమీఫైనల్ జరిగే జూన్ 27న గయానాలో వర్షం పడే అవకాశాలు 88 శాతం ఉన్నాయని అక్యువెదర్ రిపోర్ట్ వెల్లడిస్తోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు (అక్కడ ఉదయం 10:30 గంటలు) మొదలవుతుంది. వాతావరణ రిపోర్టుల ప్రకారం చూస్తే ఈ మ్యాచ్‍కు వాన వల్ల ముప్పు ఉందని అర్థమవుతోంది.
ఒకవేళ రద్దయితే?
ఒకవేళ వర్షం వల్ల ఈ సెమీఫైనల్ రద్దయితే టీమిండియా నేరుగా ఫైనల్ చేరుతుంది. ఇంగ్లండ్ ఇంటిబాట పట్టాల్సిందే. సూపర్-8 దశలో గ్రూప్-1లో భారత్ టాప్‍లో నిలిచి సెమీఫైనల్‍కు అర్హత సాధించింది. ఇంగ్లండ్ గ్రూప్-2లో రెండో స్థానం దక్కించుకొని సెమీస్‍కు వచ్చింది. అందుకే ఒకవేళ ఈ సెమీఫైనల్‍లో వాన వల్ల ఆట సాధ్యం కాకుండా రద్దయితే టాప్ ప్లేస్‍తో వచ్చిన భారత్ నేరుగా ఫైనల్‍కు అర్హత సాధిస్తుంది.
సెమీస్‍కు నో రిజర్వ్ డే
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో సెమీఫైనళ్లకు రిజర్వ్ డే లేదు. అయితే వాన వల్ల అంతరాయాలు ఏర్పడితే అదనంగా 250 నిమిషాల టైమ్ కేటాయింపు ఉంటుంది. ఒకవేళ వాన వల్ల ఆరోజున మ్యాచ్ జరగపోతే రద్దయినట్టే. ఫైనల్‍కు మాత్రమే రిజర్వ్ డే ఉంది.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో జూన్ 27న రెండు సెమీఫైనల్స్ జరగనున్నాయి. తొలి సెమీఫైనల్‍లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. ట్రినిడాడ్ వేదికగా ఉదయం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఈ మ్యాచ్ మొదలవుతుంది. రెండో సెమీఫైనల్ భారత్, ఇంగ్లండ్ మధ్య గయానా వేదికగా జూన్ 27నే జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది.
భారత్ సెమీస్‍కు ఇలా..
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో టీమిండియా అజేయంగా సెమీస్‍లో అడుగుపెట్టింది. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‍ల్లో మూడు గెలువగా.. ఓ మ్యాచ్ వర్షం రద్దయింది. ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాపై భారత్ విజయం సాధించగా.. కెనడాతో మ్యాచ్ క్యాన్సిల్ అయింది. దీంతో గ్రూప్-ఏలో టాప్ ప్లేస్‍తో సూపర్-8లో అడుగుపెట్టింది. సూపర్-8లో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలను భారత్ చిత్తుచేసింది. సూపర్-8 గ్రూప్1లో టాప్‍లో నిలిచి సెమీస్‍లో అడుగుపెట్టింది రోహిత్ శర్మ సేన.
తన సూపర్-8 చివరి మ్యాచ్‍లో ఆస్ట్రేలియాను భారత్ చిత్తుగా ఓడించింది. చివరి సూపర్-8 పోరులో బంగ్లాదేశ్‍పై అఫ్గానిస్థాన్ గెలిచింది. దీంతో టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్ అయి.. అఫ్గాన్ సెమీస్ చేరింది. డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‍లో ఓడించి టైటిల్‍ను దూరం చేసిన ఆస్ట్రేలియాను ఈ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో ఔట్ చేసి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.
టాపిక్