India vs Australia: ప్రపంచకప్ సెమీస్ చేరిన భారత్.. ఆస్ట్రేలియాపై ప్రతీకార విజయం.. అక్షర్ సూపర్ క్యాచ్.. రోహిత్ ధనాధన్-ind vs aus india races to t20 world cup 2024 semi finals after win over australia rohit sharma axar patel super catch ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Australia: ప్రపంచకప్ సెమీస్ చేరిన భారత్.. ఆస్ట్రేలియాపై ప్రతీకార విజయం.. అక్షర్ సూపర్ క్యాచ్.. రోహిత్ ధనాధన్

India vs Australia: ప్రపంచకప్ సెమీస్ చేరిన భారత్.. ఆస్ట్రేలియాపై ప్రతీకార విజయం.. అక్షర్ సూపర్ క్యాచ్.. రోహిత్ ధనాధన్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 25, 2024 01:06 AM IST

India vs Australia T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్‍కు భారత్ దూసుకెళ్లింది. సూపర్-8 మ్యాచ్‍లో ఆస్ట్రేలియాను ఓడించి.. ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్‍లో ఇంగ్లండ్‍తో టీమిండియా తలపడనుంది. ఆసీస్ ఆశలు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‍పై ఉన్నాయి.

India vs Australia: ప్రపంచకప్ సెమీస్ చేరిన భారత్.. ఆస్ట్రేలియాపై ప్రతీకార విజయం.. అక్షర్ సూపర్ క్యాచ్.. రోహిత్ ధనాధన్
India vs Australia: ప్రపంచకప్ సెమీస్ చేరిన భారత్.. ఆస్ట్రేలియాపై ప్రతీకార విజయం.. అక్షర్ సూపర్ క్యాచ్.. రోహిత్ ధనాధన్ (Surjeet Yadav)

IND vs AUS T20 World Cup 2024: ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకార విజయం సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‍లో ఓడించి టైటిల్‍ను దూరం చేసిన ఆసీస్‍ను.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024 కీలక మ్యాచ్‍లో భారత్ చిత్తుచేసింది. కాస్త రివేంజ్ చీర్చుకుంది. అలాగే, సూపర్ 8లో మూడింట మూడు గెలిచి సెమీఫైనల్‍కు టీమిండియా దూసుకెళ్లింది. సెయింట్ లూసియా వేదికగా నేడు (జూన్ 24) జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 గ్రూప్1 సూపర్-8 మ్యాచ్‍లో టీమిండియా 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‍ల్లో భారత్ సెమీస్ చేరడం ఇది ఐదోసారి. ఈ మ్యాచ్ ఎలా సాగిందంటే..

yearly horoscope entry point

హెడ్ దుమ్మురేపినా..

206 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (43 బంతుల్లో 76 పరుగులు; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) దుమ్మురేపాడు. దూకుడైన ఆటతో రాణించాడు. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో టీమిండియాకు దెబ్బేసిన హెడ్ మరోసారి టెన్షన్ పెట్టాడు. అయితే, 17వ ఓవర్ వరకు పోరాడిన హెడ్‍ను భారత పేసర్ బుమ్రా ఔట్ చేశాడు. మొత్తంగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి ఓటమి పాలైంది. డేవిడ్ వార్నర్ (6)ను భారత పేసర్ అర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే ఔట్ చేశాడు. ఆ తర్వాత హెడ్ దూకుడు చూపాడు.

హెడ్ అదరగొడుతుండగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 37 పరుగులు; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతడికి జత కలిశాడు. ఇద్దరూ దూకుడుగా ఆడారు. అయితే, 9వ ఓవర్లో కుల్దీప్ బౌలింగ్‍లో అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మార్ష్ ఔటయ్యాడు. దీంతో 84 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోగా మ్యాచ్ మలుపు తిరిగింది.

ఓ ఎండ్‍లో హెడ్ దూకుడుగా ఆడినా.. మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఓ దశలో ఆసీస్ గెలిచేలా కనిపించినా.. క్రమంగా కట్టడి చేశారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (20) కాసేపు మెరిపించినా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. మార్కస్ స్టొయినిస్ (2) విఫమయ్యాడు. అయితే, హెడ్ మాత్రం పోరాడుతూ వచ్చాడు. 17వ ఓవర్లో హెడ్‍ను బుమ్రా ఔట్ చేయడంతో ఆసీస్ ఆశలు ముగిశాయి. టిమ్ డేవిడ్ (15), మాథ్యూ వేడ్ (1) సహా తర్వాతి బ్యాటర్లు రాణించలేదు.

భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. జస్‍ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు.

అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్

టీమిండియా ప్లేయర్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‍లో సూపర్ క్యాచ్ పట్టాడు. 9వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‍లో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ భారీ షాట్ కొట్టగా.. డీప్ మిడ్ వికెట్ బౌండరీ దగ్గర ఎగిరి ఒక్కో చేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు అక్షర్. బౌండరీ లైన్‍కు తగలకుండా జంప్ చేశాడు. సిక్స్ వెళ్లే బంతిని క్యాచ్‍గా మలిచాడు అక్షర్. 87 పరుగులకు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఆసీస్ పటిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు మార్ష్ క్యాచ్ పట్టి మ్యాచ్‍ను టర్న్ చేశాడు అక్షర్ పటేల్.

రోహిత్ సునామీ

భారత కెప్టెన్ రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‍ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. 41 బంతుల్లోనే 224 స్ట్రైక్ రేట్‍తో 92 పరుగులు చేశాడు రోహిత్. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో దుమ్మురేపాడు. స్టార్క్ వేసిన మూడో ఓవర్లో హిట్‍మ్యాన్ ఏకంగా నాలుగు సిక్స్‌లు, ఓ ఫోర్ బాది చుక్కలు చూపించాడు. 19 బంతుల్లోనే అర్ధ శకతం మార్క్ చేరి.. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడాడు. అయితే, 8 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మొత్తంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు చేసింది.

సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 31 పరుగులు; 3 సిక్స్‌లు, 2 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 27 పరుగులు నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (22 బంతుల్లో 28 పరుగులు) రాణించారు. భారత స్టార్, ఓపెనర్ విరాట్ కోహ్లీ (0) డకౌటై.. ఈ టోర్నీలో మళ్లీ నిరాశపరిచాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. జోస్ హాజిల్‍వుడ్ ఓ వికెట్ తీశాడు.

సెమీస్‍లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్

టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్‍లో ఇంగ్లండ్‍తో భారత్ తలపడనుంది. జూన్ 27వ తేదీన రాత్రి 8 గంటలకు గయానా వేదికగా ఈ సెమీస్ జరగనుంది.

అఫ్గాన్ గెలిస్తే ఆస్ట్రేలియా ఔట్

గ్రూప్1 సూపర్-8లో చివరి మ్యాచ్ రేపు (జూన్ 25) అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‍లో అఫ్గానిస్థాన్ గెలిస్తే.. సెమీఫైనల్ చేరుతుంది. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి ఔట్ అవుతుంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా ఆసీస్ నిష్క్రమించాల్సిందే. ఒకవేళ అఫ్గానిస్థాన్‍పై బంగ్లాదేశ్ గెలిస్తే.. నెట్‍రన్ రేట్‍తో ఆస్ట్రేలియా సెమీస్ చేరుతుంది. ఇక బంగ్లాదేశ్‍పైనే ఆసీస్ ఆశలు పెట్టుకుంది. ఒకవేళ అఫ్గాన్‍పై తొలుత బ్యాటింగ్ చేస్తే 61 పరుగుల తేడాతో లేకపోతే రెండో బ్యాటింగ్ చేస్తే 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదిస్తే బంగ్లాకు కూడా సెమీస్ ఛాన్స్ ఉంటుంది. ఆ గణాంకాలు కాకుండా ఒకవేళ బంగ్లా స్పల్ప లక్ష్యంతో గెలిస్తే.. ఆసీస్ సెమీస్‍కు వెళుతుంది.

Whats_app_banner