తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Nz: కివీస్‍ను కుమ్మేసిన భారత్.. కోహ్లీ చరిత్రాత్మక శతకం.. శ్రేయస్ తుఫాన్ సెంచరీ

IND vs NZ: కివీస్‍ను కుమ్మేసిన భారత్.. కోహ్లీ చరిత్రాత్మక శతకం.. శ్రేయస్ తుఫాన్ సెంచరీ

15 November 2023, 18:18 IST

google News
    • IND vs NZ World Cup 2023: ప్రపంచకప్ సెమీఫైనల్‍లో న్యూజిలాండ్‍ను భారత బ్యాటర్లు కుమ్మేశారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ శతకాలు చేశారు. దీంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. 
IND vs NZ: కివీస్‍ను కుమ్మేసిన భారత్.. విరాట్ చరిత్రాత్మక శతకం.. శ్రేయస్ తుఫాన్ సెంచరీ
IND vs NZ: కివీస్‍ను కుమ్మేసిన భారత్.. విరాట్ చరిత్రాత్మక శతకం.. శ్రేయస్ తుఫాన్ సెంచరీ (AFP)

IND vs NZ: కివీస్‍ను కుమ్మేసిన భారత్.. విరాట్ చరిత్రాత్మక శతకం.. శ్రేయస్ తుఫాన్ సెంచరీ

IND vs NZ World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో టీమిండియా అద్భుతమైన ఆటతీరును కొనసాగించింది. న్యూజిలాండ్‍తో సెమీఫైనల్‍లోనూ బ్యాటింగ్‍లో ఎదురులేని దూకుడును భారత్ చూపించింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (113 బంతుల్లో 117 పరుగులు) చరిత్రాత్మక శతకానికి తోడు శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 105 పరుగులు; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీ చేశాడు. దీంతో నేడు (నవంబర్ 15) న్యూజిలాండ్‍తో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు చేసింది. ముంబై వాంఖడే స్టేడియంలో కివీస్ బౌలర్లను భారత బ్యాట్స్‌మెన్ కుమ్మేశారు. న్యూజిలాండ్‍ ముందు భారీ టార్గెట్ ఉంచింది భారత్.

విరాట్, శ్రేయస్ సెంచరీలు చేయగా.. శుభ్‍మన్ గిల్ అర్ధ శతకంతో (80 పరుగులు; రిటైర్డ్ హర్ట్) రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (29 బంతుల్లో 47 పరుగులు) వీర హిట్టింగ్‍తో అద్భుతమైన ఆరంభం అందించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథి మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్‍లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ వన్డే క్రికెట్‍లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 50 వన్డే శతకాలు చేసిన తొలి బ్యాటర్‌గా ఘనత దక్కించుకున్నాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (49 వన్డే శతకాలు) అత్యధిక వన్డే సెంచరీల కోహ్లీ బద్దలుకొట్టాడు.

చితక్కొట్టిన బ్యాటర్లు

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది భారత్. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‍మన్ గిల్ అదిరే ఆరంభం ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ హిట్టింగ్ మోత మోగించాడు. వేగంగా పరుగులు చేశాడు. అయితే, అర్ధ సెంచరీకి మూడు పరుగుల దూరంలో 9వ ఓవర్లో భారీ షాట్ కొట్టబోయి ఔటయ్యాడు. అయితే, శుభ్‍మన్ గిల్ మాత్రం దూకుడుగా ఆడాడు. అర్ధ శతకం తర్వాత కూడా అదరగొట్టాడు. అయితే, కాలు ఇబ్బంది పెట్టడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. 

ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సత్తాచాటాడు. కోహ్లీ పరిస్థితిని బట్టి సమయోచితంగా ఆడగా.. అయ్యర్ మాత్రం ఆరంభం నుంచే కుమ్మేశాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు విరాట్ కోహ్లీ జోరు పెంచాడు. కోహ్లీ 106 బంతుల్లో శతకానికి చేరాడు. ఆ తర్వాత కాసేపటికి ఔటయ్యాడు. మెరుపు బ్యాటింగ్ కొనసాగించిన శ్రేయస్ అయ్యర్ 67 బంతుల్లోనే సెంచరీకి చేరి మరోసారి సత్తాచాటాడు. 49వ ఓవర్లో అయ్యర్ ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 39; నాటౌట్) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా భారత్ 397 పరుగుల భారీ స్కోరు చేసింది. సెమీస్‍లో కివీస్ ముందు కొండంత టార్గెట్ ఉంచింది.  

తదుపరి వ్యాసం