Virat Kohli Fight: ఆస్ట్రేలియా జర్నలిస్టుతో గొడవకు దిగిన విరాట్ కోహ్లి.. తప్పుగా అర్థం చేసుకున్నాడంటూ..
19 December 2024, 14:23 IST
- Virat Kohli Fight: విరాట్ కోహ్లి ఓ ఆస్ట్రేలియా జర్నలిస్టుతో గొడవకు దిగిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మూడో టెస్టు తర్వాత టీమిండియా మెల్‌బోర్న్ చేరుకోగా.. అక్కడ ఎయిర్‌పోర్టులోనే కోహ్లి ఓ జర్నలిస్టుతో వాగ్వాదానికి దిగినట్లు ఛానెల్ 7 రిపోర్టు తెలిపింది.
ఆస్ట్రేలియా జర్నలిస్టుతో గొడవకు దిగిన విరాట్ కోహ్లి.. తప్పుగా అర్థం చేసుకున్నాడంటూ..
Virat Kohli Fight: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా మీడియాతో గొడవకు దిగాడు. గురువారం (డిసెంబర్ 19) బ్రిస్బేన్ నుంచి మెల్‌బోర్న్ చేరుకున్న టీమిండియాతోపాటు ఉన్న కోహ్లి.. ఓ జర్నలిస్టు, కెమెరామ్యాన్ తో వాదించాడు. తన భార్యాపిల్లలతో కలిసి వెళ్తున్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని అతడు పొరపడినట్లు ఛానెల్ 7 రిపోర్టు తెలిపింది.
కోహ్లి గొడవ.. ఏం జరిగిందంటే?
ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ లో డిసెంబర్ 26 నుంచి జరగబోయే బాక్సింగ్ డే టెస్టు కోసం టీమిండియా గురువారం (డిసెంబర్ 19) అక్కడికి చేరుకుంది. ఎయిర్‌పోర్టులో తన ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న సమయంలో తన అనుమతి లేకుండా అక్కడి మీడియా తన ఫొటోలు, వీడియోలు తీస్తుందని అతడు భావించాడు. తన పిల్లల వైపు కెమెరాలు ఉంచిన ఓ ఆస్ట్రేలియా టీవీ జర్నలిస్టుతో కోహ్లి వాగ్వాదానికి దిగినట్లు ఛానెల్ 7 రిపోర్టు తెలిపింది.
"అక్కడ కెమెరాలతో వేచి చూస్తున్న వారిని చూడగానే కోహ్లి సహనం కోల్పోయాడు. తన పిల్లలతో కలిసి తనను వీడియో తీస్తున్నారని అతడు అపార్థం చేసుకున్నాడు" అని ఛానెల్ 7 రిపోర్టర్ థియో డోరోపోలస్ తెలిపారు. అది చూసిన కోహ్లి.. "నా పిల్లలతో ఉన్నప్పుడు నాకు కొంచెం ప్రైవసీ కావాలి. నన్ను అడగకుండా వీడియో తీయకూడదు" అని ఆ జర్నలిస్టుతో అన్నట్లు వినిపించింది.
అయితే తాము వీడియో తీయడం లేదని సదరు జర్నలిస్టు, కెమెరాపర్సన్.. విరాట్ కోహ్లికి వివరించే ప్రయత్నం చేశారు. దీంతో అతడు శాంతిచాడు. ఛానెల్ 7 కెమెరాపర్సన్ తో చేయి కలుపుతూ కోహ్లి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇలా..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే మూడు టెస్టులు ముగిశాయి. తొలి టెస్టులో ఇండియా, రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలవగా.. మూడో టెస్టు డ్రా అయింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇప్పుడు డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ లో బాక్సింగ్ డే టెస్టు జరగనుంది. అయితే ఈ సిరీస్ లో కోహ్లి దారుణమైన ఫామ్ లో ఉన్నాడు పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసినా.. తర్వాత వరుసగా 5, 7, 11, 11 స్కోర్లు మాత్రమే చేశాడు.
ఆఫ్ సైడ్ లో దూరంగా వెళ్తున్న బంతిని వేటాడి పదే పదే ఔటవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు టెస్టుల్లో అతడు ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా మిగిలిన రెండు టెస్టులు గెలిచిన సిరీస్ గెలవాల్సిన పరిస్థితుల్లో టీమిండియా ఉంది. వీటిలో ఒక్క టెస్టు ఓడినా ఫైనల్ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉంటుంది.