Virat Kohli Angry: శ్రీలంకలో కోహ్లికి చేదు అనుభవం.. ఆ మాట అన్నాడని అభిమానిపై విరాట్ ఆగ్రహం.. వీడియో వైరల్
31 July 2024, 11:56 IST
- Virat Kohli Angry: శ్రీలంకలో విరాట్ కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. ఓ అభిమాని తనపై నోరు పారేసుకోవడంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీలంకలో కోహ్లికి చేదు అనుభవం.. ఆ మాట అన్నాడని అభిమానిపై విరాట్ ఆగ్రహం.. వీడియో వైరల్
Virat Kohli Angry: శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం ఆ దేశానికి వెళ్లిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లోనే టీమ్మేట్స్ అందరి ముందు ఓ అభిమాని తనపై నోరు పారేసుకోవడం అతనికి ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కోహ్లిని చోక్లీ అన్న అభిమాని
విరాట్ కోహ్లి డ్రెస్సింగ్ రూమ్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. బయట నుంచి ఓ అభిమాని అతన్ని వీడియో తీస్తున్నాడు. కాసేపటి తర్వాత అతడు చోక్లీ చోక్లీ అంటూ అరిచాడు. అది విరాట్ ఎంతో కోపంగా అతని వైపు తిరిగి చూశాడు. కోహ్లిని చోక్లి అంటూ ట్రోలింగ్ చేయడం కొన్నాళ్లుగా నడుస్తోంది. విరాట్ ఇంటి పేరు కోహ్లి, పెద్ద మ్యాచ్ లలో విఫలమయ్యే వారిని పిలిచే చోకింగ్ కలిపి ఇలా చోక్లీ అంటున్నారు.
తాజాగా శ్రీలంకలోని అభిమాని కూడా అందరి ముందు తనను ఇలా చోక్లీ అనడంతో విరాట్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ మాట వినగానే అతడు వెంటనే తిరిగి అతన్ని సీరియస్ గా చూశాడు. అక్కడితోనే వీడియో ఆగిపోయింది. ఇక్కడ కాదు అని కోహ్లి అన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం 7 సెకన్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. విరాట్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కోహ్లి ఆ మ్యాచ్‌లలో ఫెయిల్
పెద్ద మ్యాచ్‌లు, ముఖ్యమైన మ్యాచ్ లలో ఫెయిలయ్యే జట్లు, ప్లేయర్స్ ను చోకర్స్ అని పిలవడం సహజమే. ఎన్నో ఏళ్లుగా క్రికెట్ లో సౌతాఫ్రికా టీమ్ కు ఈ చోకర్స్ అనే పేరుంది. కోహ్లి కూడా కొన్ని ముఖ్యమైన మ్యాచ్ లలో ఫెయిలవడంతో కొందరు ఫ్యాన్స్ అతన్ని ఇలా చోక్లీ అని ట్రోల్ చేస్తున్నారు. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో కోహ్లి కేవలం ఒకే పరుగు చేశాడు.
ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. అంతకుముందు 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్లోనూ విరాట్ 1 పరుగే చేశాడు. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ పై అతడు ఒక పరుగు చేసి దారుణంగా విఫలమయ్యాడు. అయితే గత నెల జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో మాత్రం విరాట్ టీమ్ ను ఆదుకున్నాడు. టోర్నీ అంతా విఫలమైన అతడు.. ఫైనల్లో 76 రన్స్ చేయడంతో ఇండియా రెండోసారి వరల్డ్ కప్ గెలవగలిగింది.
శ్రీలంకతో వన్డే సిరీస్
శ్రీలంకతో ఆగస్ట్ 2 నుంచి 7 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుంది. టీ20 సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత టీమిండియా ఎంతో కాన్ఫిడెంట్ గా వన్డేల్లో బరిలోకి దిగుతోంది. ఈ జట్టులోకి కోహ్లితోపాటు కెప్టెన్ రోహిత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి వాళ్లు కూడా తిరిగి వచ్చారు. అయితే శ్రీలంకపై విరాట్ కోహ్లికి అదిరిపోయే రికార్డు ఉంది.
అతడు 2008లో ఇదే లంకపై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు 25 వన్డేల్లో ఏకంగా 2595 రన్స్ చేశాడు. అందులో 10 సెంచరీలు ఉండటం విశేషం. ఇక ఈ సిరీస్ జరగబోయే కొలంబోలో కోహ్లి రికార్డు మరింత మెరుగ్గా ఉంది. ఇక్కడ 11 వన్డేల్లో 644 రన్స్ చేశాడు. నాలుగు సెంచరీలు ఉన్నాయి. సగటు ఏకంగా 107.3గా ఉంది.