Kohli in Sri Lanka: శ్రీలంక చేరిన విరాట్ కోహ్లి.. గంభీర్‌తో మాత్రం కలవని స్టార్ బ్యాటర్.. ఇదీ కారణం-virat kohli reached sri lanka yet to meet head coach gautham gambhir india vs sri lanka odi series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kohli In Sri Lanka: శ్రీలంక చేరిన విరాట్ కోహ్లి.. గంభీర్‌తో మాత్రం కలవని స్టార్ బ్యాటర్.. ఇదీ కారణం

Kohli in Sri Lanka: శ్రీలంక చేరిన విరాట్ కోహ్లి.. గంభీర్‌తో మాత్రం కలవని స్టార్ బ్యాటర్.. ఇదీ కారణం

Hari Prasad S HT Telugu

Kohli in Sri Lanka: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి శ్రీలంక చేరుకున్నాడు. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను మాత్రం అతడు ఇంకా కలవలేదు. కోహ్లి కొలంబోలో ఉండగా.. గంభీర్ పల్లెకెలెలో టీ20 టీమ్ తో ఉన్నాడు.

శ్రీలంక చేరిన విరాట్ కోహ్లి.. గంభీర్‌తో మాత్రం కలవని స్టార్ బ్యాటర్.. ఇదీ కారణం (RCB-X)

Kohli in Sri Lanka: టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచి సరిగ్గా నెల రోజు పూర్తయిన రోజే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం ఆ దేశానికి వెళ్లాడు. సోమవారం (జులై 29) అతడు కొలంబో చేరుకున్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో అతనికి గతంలో ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ ఇద్దరూ ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో ఎలా ఉండబోతున్నారన్న ఆసక్తి నెలకొంది.

శ్రీలంకలో విరాట్ కోహ్లి

శ్రీలంకతో ఆగస్ట్ 2 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కు దూరంగా ఉండాలని రోహిత్, కోహ్లి మొదట భావించినా.. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో వాళ్లను ఎంపిక చేశారు. దీంతో ఈ ఇద్దరూ సోమవారం (జులై 29) ఉదయం శ్రీలంకలో అడుగుపెట్టారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కొన్ని రోజుల పాటు భార్య అనుష్క, కూతురు, కొడుకుతో కలిసి లండన్ లో హాలీడే ఎంజాయ్ చేసిన విరాట్.. మళ్లీ ఫీల్డ్ లో అడుగుపెట్టనున్నాడు.

శ్రీలంకతో ఆగస్ట్ 2, 4, 7వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. రోహిత్, కోహ్లితోపాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా శ్రీలంక వెళ్లారు. ప్రస్తుతం ఆ టీమ్ తో మూడు టీ20ల సిరీస్ లో మరో టీమ్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ జట్టులోని కొందరు సభ్యులు వన్డే సిరీస్ కూడా ఆడనున్నారు.

గంభీర్‌ను కలవని కోహ్లి

విరాట్ కోహ్లి శ్రీలంక చేరుకున్నా.. హెడ్ కోచ్ గంభీర్ ను మాత్రం ఇంకా కలవలేదు. దీనికి కారణం గంభీర్ ఇంకా టీ20 టీమ్ తో ఉండటమే. కోహ్లి నేరుగా కొలంబో చేరుకున్నాు. అయితే గంభీర్ మాత్రం ఇంకా పల్లెకెలెలోనే ఉన్నాడు. మంగళవారం (జులై 30) లంకతో చివరిదైన మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ ను టీమిండియా 2-0తో గెలిచిన విషయం తెలిసిందే.

ఈ సిరీస్ ముగిసిన వెంటనే గంభీర్ కొలంబో చేరుకుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వన్డే టీమ్ తో అతడు కలుస్తాడు. ఈ సందర్భంగా విరాట్, గంభీర్ పైనే అందరి కళ్లూ ఉండనున్నాయి. అప్పటి వరకూ ఇద్దరు అసిస్టెంట్ కోచ్ లలో ఒకరైన అభిషేక్ నాయర్ కు కోహ్లి, రోహిత్ ప్రాక్టీస్ సెషన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. లంకతో మూడు వన్డేలూ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి.

2016లో చివరిసారి టీమిండియాలోనే కోహ్లి, గంభీర్ కలిసి ఆడారు. గౌతీ తన చివరి టెస్ట్ సిరీస్ ను ఆ ఏడాది ఇంగ్లండ్ తో ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్లో ఈ ఇద్దరూ వేర్వేరు జట్లకు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించనున్నారు.