తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni Six: ధోనీ వరల్డ్ కప్ గెలిపించిన సిక్స్.. ఆ రెండు సీట్లనూ వేలం వేస్తున్న ఎంసీఏ

MS Dhoni Six: ధోనీ వరల్డ్ కప్ గెలిపించిన సిక్స్.. ఆ రెండు సీట్లనూ వేలం వేస్తున్న ఎంసీఏ

Hari Prasad S HT Telugu

14 September 2023, 19:59 IST

google News
    • MS Dhoni Six: ధోనీ వరల్డ్ కప్ గెలిపించిన సిక్స్ ఏ సీట్లపై పడిందో ఆ రెండు సీట్లనూ వేలం వేస్తోంది ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ). 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ సిక్స్ తో మ్యాచ్ ముగించిన విషయం తెలిసిందే.
2011 వరల్డ్ కప్ ఫైనల్లో సిక్స్ కొడుతున్న ధోనీ
2011 వరల్డ్ కప్ ఫైనల్లో సిక్స్ కొడుతున్న ధోనీ (Twitter)

2011 వరల్డ్ కప్ ఫైనల్లో సిక్స్ కొడుతున్న ధోనీ

MS Dhoni Six: ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఎమ్మెస్ ధోనీ కొట్టిన ఆ సిక్స్ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై ఆ సిక్స్ తోనే ధోనీ మ్యాచ్ ముగించాడు. 28 ఏళ్ల తర్వాత ఇండియా వరల్డ్ కప్ అందించిన సిక్స్ అది. ఈ ప్రత్యేకమైన సిక్స్ ను ఇప్పుడు క్యాష్ చేసుకోబోతోంది ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ). ఆ రెండు సీట్లను వేలం వేయాలని నిర్ణయించింది.

వాంఖెడే స్టేడియంలో జరిగిన ఆ వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్స్ ఈ రెండు సీట్లపైనే పడింది. ఆ చారిత్రక సందర్భాన్ని అక్కడి క్రికెట్ అసోసియేషన్ ఇలా వాడుకోబోతుండటం విశేషం. ఈ విషయాన్ని గురువారం (సెప్టెంబర్ 14) సోషల్ మీడియా ద్వారా ఎంసీఏ వెల్లడించింది.

"ధోనీ తనదైన స్టైల్లో ముగించాడు.. ఈ చారిత్రక క్షణం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడానికి ఆ బంతి పడిన వాంఖెడే స్టేడియంలోని రెండు సీట్లను ఎంసీఏ వేలం వేస్తోంది" అని ట్వీట్ చేసింది. ధోనీ కొట్టిన ఆ సిక్స్ లాంగాన్ దిశగా వెళ్లి స్టాండ్స్ లో పడింది. దీంతో ఇండియా మొత్తం సంబరాలు చేసుకుంది. ఇక ఇండియన్ టీమ్ చివరిసారి వరల్డ్ కప్ గెలిచిన సందర్భం కూడా అదే.

12 ఏళ్ల తర్వాత మరోసారి స్వదేశంలో ఈసారి వరల్డ్ కప్ జరగబోతోంది. దీంతో ఆ నిరీక్షణకు తెరపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2011 ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 6 వికెట్లకు 274 రన్స్ చేసింది. చేజింగ్ లో ఇండియా 114 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులో ఉన్న గంభీర్ తో ధోనీ వచ్చి చేరాడు.

ఇక అక్కడి నుంచీ ఇండియాకు తిరుగు లేకుండా పోయింది. చివరికి ధోనీ 91 పరుగులతో అజేయంగా నిలిచాడు. గంభీర్ తో కలిసి ధోనీ నాలుగో వికెట్ కు 109 రన్స్ జోడించాడు. ఇక ఐదో వికెట్ కు అజేయంగా 54 పరుగులు జోడించడంతో ఇండియా 6 వికెట్లతో గెలిచింది. ఆ ఫైనల్లో గంభీర్ 97 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచినా.. సిక్స్ తో గెలిపించిన ధోనీనే హీరోగా నిలిచిపోయాడు.

తదుపరి వ్యాసం