Robin Uthappa case: భారత మాజీ స్టార్ క్రికెటర్‌కు అరెస్ట్ వారెంట్.. కేసు ఏంటంటే..
21 December 2024, 14:26 IST
- Robin Uthappa: భారత మాజీ స్టార్ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఓ మోసం విషయంలో ఊతప్పకు ఈ వారెంట్ వచ్చింది. ఈ వివరాలు ఇవే..
Robin Uthappa: భారత మాజీ స్టార్ క్రికెటర్‌కు అరెస్ట్ వారెంట్.. కేసు ఏంటంటే..
టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప చిక్కుల్లో పడ్డాడు. అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)కు సంబంధించిన మోసం కేసులో అతడికి నోటీసులు జారీ అయ్యాయి. ఊతప్పకు చెందిన ఓ క్లాతింగ్ కంపెనీ విషయంలో ఈ మోసం జరిగినట్టు ఈపీఎఫ్‍వో అధికారులు గుర్తించారు.
గడువులోగా చెల్లించకపోతే..
డిసెంబర్ 27లోగా ఉద్యోగులకు చెందిన రూ.24లక్షల బకాయిలను ఈపీఎఫ్‍వోకు కట్టకపోతే రాబిన్ ఊతప్ప అరెస్ట్ కావాల్సి వస్తుందని వారెంట్‍లో ఉంది. ఉద్యోగుల జీతాల్లో నుంచి కట్ చేస్తున్న మోత్తాన్ని ఈపీఎఫ్‍లో జమ చేయడం లేదని అధికారులు గుర్తించారు. దీనిపైనే పీఎఫ్ రీజనల్ కమిషనర్ సుధాక్షరి గోపాల్ రెడ్డి.. ఊతప్పకు వారెంట్ జారీ చేశారు.
కేసు ఇదే..
సెంచరీ లైఫ్‍స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ క్లాతింగ్ బ్రాండ్‍ను రాబిన్ ఊతప్ప బెంగళూరులో నడుపుతున్నాడు. ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వారి వేతనాల్లో నుంచి పీఎఫ్ కోసం కోత విధించిన సుమారు రూ.24లక్షలను ఈపీఎఫ్‍వోలో జమ చేయలేదు. దీంతో దీన్ని మోసంగా పరిగణించి ఈపీఎఫ్‍వో అధికారి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు.
డిసెంబర్ 4నే అరెస్ట్ వారెంట్ జారీ చేసినా మళ్లీ తిరిగి వచ్చిందని సుధాక్షరి తెలిపారు. “పులకేషినగర్‌లోని తన ఇంట్లో రాబిన్ ఊతప్ప లేరు. అందుకే డిసెంబర్ 4న జారీ చేసిన అరెస్ట్ వారెంట్ తిరిగి వచ్చింది” అని వెల్లడించారు. ఊతప్ప ప్రస్తుతం దుబాయ్‍లో ఉన్నట్టు తెలుస్తోంది. వారెంట్ మళ్లీ జారీ చేయాలని, డిసెంబర్ 27లోగా బకాయిలు చెల్లించకపోతే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఈపీఎఫ్‍వో అధికారి సూచనలు ఇచ్చారు.
రాబిన్ ఊతప్ప భారత్ తరఫున 46 వన్డేలు ఆడి 934 పరుగులు చేశాడు. ఆరు అర్ధ శతకాలు బాదాడు. 13 అంతర్జాతీయ టీ20ల్లో 249 రన్స్ చేశాడు. ఐపీఎల్‍లో ఊతప్ప ఎక్కువగా సక్సెస్ అయ్యాడు. కోల్‍కతా నైట్‍రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పుణె వారియల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడాడు. దూకుడైన బ్యాటింగ్‍తో చాలా మ్యాచ్‍ల్లో అదరగొట్టాడు. 2014లో కోల్‍కతా నైట్‍రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలువడంతో ఊతప్ప కీలకపాత్ర పోషించాడు.