Robin Uthappa Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రాబిన్‌ ఉతప్ప-robin uthappa retired from all forms of cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Robin Uthappa Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రాబిన్‌ ఉతప్ప

Robin Uthappa Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రాబిన్‌ ఉతప్ప

Hari Prasad S HT Telugu
Sep 14, 2022 07:58 PM IST

Robin Uthappa Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు స్టార్ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప. అన్ని రకాల క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం (సెప్టెంబర్‌ 14) ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు.

<p>రాబిన్ ఉతప్ప (ఫైల్ ఫొటో)</p>
రాబిన్ ఉతప్ప (ఫైల్ ఫొటో) (Getty Images)

Robin Uthappa Retirement: టీమిండియా క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప అన్ని రకాల క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతడు ట్విటర్‌ ద్వారా చెప్పాడు. ఇండియా తరఫున వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆడిన అతడు.. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌లోనూ ఉన్నాడు. దేశానికి, కర్ణాటకకు ఆడటం గౌరవంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ఉతప్ప చెప్పాడు.

"నా దేశం, నా రాష్ట్రం కర్ణాటకకు ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అయితే అన్నింటికీ ఎప్పుడో ఒకప్పుడు ముగింపు ఉంటుంది. అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌ కావాలని నేను నిర్ణయించుకున్నాను. అందరికీ కృతజ్ఞతలు" అని ఉతప్ప ట్వీట్‌ చేశాడు. దీంతోపాటు ఓ సుదీర్ఘ లేఖను కూడా అతడు పోస్ట్‌ చేశాడు.

2006, ఏప్రిల్‌ 15న గౌహతిలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో రాబిన్‌ ఉతప్ప టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత కెరీర్‌లో 46 వన్డేలు ఆడాడు. ఆరు హాఫ్ సెంచరీలు సహా 934 రన్స్ చేశాడు. అతని అత్యధిక స్కోరు 86. అటాకింగ్‌ ఆటతో ఉతప్ప వార్తల్లో నిలిచాడు. ఆ అటాకింగ్ ఆటే ఉతప్పకు 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌లో చోటు దక్కేలా చేసింది.

ఈ వరల్డ్‌కప్‌ను ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌ టై అయినప్పుడు బౌల్‌ ఔట్‌లో ఉతప్ప కూడా ఓ బాల్‌ వేశాడు. అది స్టంప్స్‌ను గిరాటేసింది. ఇండియన్‌ టీమ్‌ తరఫున ఉతప్ప 13 టీ20లు ఆడి 249 రన్స్‌ చేశాడు. అయితే నిలకడ లేని ఆటతీరుతో టీమ్‌లో ఎప్పుడూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు.

2015లో జింబాబ్వేతో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. అదే టూర్‌లో జింబాబ్వేపైనే చివరి టీ20 మ్యాచ్‌లో ఇండియన్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. నేషనల్‌ టీమ్‌లో పెద్దగా మెరుపులు లేకపోయినా.. ఐపీఎల్‌తోపాటు డొమెస్టిక్‌ క్రికెట్‌లో కొనసాగాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఉతప్ప ఆడాడు. మొత్తం 205 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో 4952 రన్స్‌ చేశాడు. అందులో 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Whats_app_banner

టాపిక్