తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma Flag: రోహిత్ ఎమోషనల్.. కప్పు గెలిచిన తర్వాత గ్రౌండ్లో మన జెండా ఎగురేసి..

Rohit Sharma Flag: రోహిత్ ఎమోషనల్.. కప్పు గెలిచిన తర్వాత గ్రౌండ్లో మన జెండా ఎగురేసి..

Hari Prasad S HT Telugu

30 June 2024, 8:37 IST

google News
    • Rohit Sharma Flag: టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి కొద్ది క్షణాల ముందు, టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జెండాను రోహిత్ శర్మ గ్రౌండ్లో ఎగరేశాడు.
రోహిత్ ఎమోషనల్.. కప్పు గెలిచిన తర్వాత గ్రౌండ్లో మన జెండా ఎగురేసి.
రోహిత్ ఎమోషనల్.. కప్పు గెలిచిన తర్వాత గ్రౌండ్లో మన జెండా ఎగురేసి. (Getty)

రోహిత్ ఎమోషనల్.. కప్పు గెలిచిన తర్వాత గ్రౌండ్లో మన జెండా ఎగురేసి.

Rohit Sharma Flag: నిరీక్షణకు తెరపడింది. 11 ఏళ్ల తర్వాత భారత్ వరల్డ్ చాంపియన్ గా అవతరించింది. తనకంటే ముందు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ అనే ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే సాధించిన ఘనతను రోహిత్ శర్మ సాధించాడు. దక్షిణాఫ్రికా చివరి వరకు గట్టిగానే పోరాడింది. కానీ చివరికి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి బంతిని కేశవ్ మహరాజ్ మిడిలార్డర్లో అర్ష్‌దీప్ వైపు కొట్టిన మరుక్షణమే భావోద్వేగాలు వెల్లివిరిశాయి.

రోహిత్, మిగతా ఇండియన్ ప్లేయర్స్ చిన్న పిల్లల్లా ఏడ్చేశారు. 7 నెలల 10 రోజుల కిందట వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పుడు మైదానం నుంచి వెళ్లే సమయంలో అతను కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ రోజు మళ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు.. కానీ ఈసారి అవి ఆనందంతో వచ్చి కన్నీళ్లు.

కోహ్లి, రోహిత్ రిటైర్మెంట్

టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించే ముందు రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. రోహిత్ భారత పతాకాన్ని పట్టుకుని గ్రౌండ్ లోకి వెళ్లి అక్కడ పాతే ప్రయత్నం చేశాడు. 1983 ప్రపంచ కప్ లో వెస్టిండీస్ ను ఓడించి భారత్ గెలిచిన 41 సంవత్సరాల తరువాత అదే కరీబియన్ గడ్డపై ఇప్పుడు భారత పతాకాన్ని సగర్వంగా ఎగరేయడం విశేషం. 50 ఓవర్ల వరల్డ్ కప్ తనకు ఎప్పుడూ అంతిమ బహుమతి అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అప్పుడు అది సాధ్యం కాకపోయినా.. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ రూపంలో తన కలను ఇలా నిజం చేసుకున్నాడు.

రోహిత్ ఉద్వేగాలు అక్కడితో ఆగిపోలేదు. మిగిిలిన ఆటగాళ్లు తమదైన శైలిలో సంబరాలు చేసుకుంటుండగా ఒంటరిగా నిల్చుని అలా ఉండిపోయాడు. అతని కళ్లు చెమర్చాయి. ఆ తర్వాత కూతురు సమైరాను భుజాలపై ఎత్తుకుని తన భార్య రితికా సజ్దే వైపు నడిచాడు.

రవిశాస్త్రి భావోద్వేగం

రోహిత్ శర్మ ఎమోషనల్ మూమెంట్ ను కామెంటేటర్లు రవిశాస్త్రి, ఇయాన్ స్మిత్ లాంటి అద్భుతంగా వివరించారు. ఇది అతని కెరీర్లోనే ప్రత్యేక సమయం అని ఇయాన్ స్మిత్ అన్నాడు. అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయిన తర్వాత నువ్వేం చేశావని అతన్ని ప్రశ్నించారు.. ఇప్పుడు తనకు మరో అవకాశం ఇచ్చినందుకు ఆకాశంలోకి చూస్తూ అతడు థ్యాంక్స్ చెప్పాడంటూ రవిశాస్త్రి అన్నాడు.

"అతను అన్ని ప్రశంసలకు అర్హుడు. ఈ టోర్నమెంట్లో అతను వారికి అద్భుతంగా నాయకత్వం వహించాడు. ఈ రోజు కూడా మధ్యలో కాస్త ఆందోళన రేగినప్పుడు సరైన సమయంలో సరైన బౌలర్లను మార్చడం, హార్దిక్ పాండ్యాపై నమ్మకం చూపిస్తూ.. చాలా ముఖ్యమైన సమయంలో అతడిని బరిలోకి దింపాడు' అని శాస్త్రి అన్నాడు. కానీ అన్ని భావోద్వేగాల మధ్య కూడా రోహిత్, మిగిలిన ఆటగాళ్లు పరిపూర్ణ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి దక్షిణాఫ్రికాతో కరచాలనం చేశారు. రోహిత్ కళ్లు, ఇంకా చాలా మంది కళ్లు చెమ్మగిల్లాయి.

తదుపరి వ్యాసం