తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: టీ20లకు కెప్టెన్‍గా సూర్య.. రోహిత్, కోహ్లీకి నో రెస్ట్.. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‍లకు భారత జట్లు ఎంపిక

Team India: టీ20లకు కెప్టెన్‍గా సూర్య.. రోహిత్, కోహ్లీకి నో రెస్ట్.. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‍లకు భారత జట్లు ఎంపిక

18 July 2024, 21:22 IST

google News
    • Team India: శ్రీలంక పర్యటనకు భారత జట్లు ఎంపికయ్యాయి. టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ రెగ్యులర్ టీ20 కెప్టెన్ అయ్యాడు. వన్డే సిరీస్‍కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంపికయ్యారు. వారికి విశ్రాంతినివ్వలేదు. ఈ పర్యటనతోనే హెడ్ కోచ్‍గా గంభీర్ బాధ్యతలు మొదలుపెట్టనున్నాడు.
Team India: టీ20లకు కెప్టెన్‍గా సూర్య.. రోహిత్, కోహ్లీకి నో రెస్ట్.. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‍లకు భారత జట్లు ఎంపిక
Team India: టీ20లకు కెప్టెన్‍గా సూర్య.. రోహిత్, కోహ్లీకి నో రెస్ట్.. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‍లకు భారత జట్లు ఎంపిక (AP)

Team India: టీ20లకు కెప్టెన్‍గా సూర్య.. రోహిత్, కోహ్లీకి నో రెస్ట్.. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‍లకు భారత జట్లు ఎంపిక

భారత టీ20 జట్టుకు కొత్త రెగ్యులర్ కెప్టెన్‍గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‍ ఎంపికయ్యాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‍లో అతడే కెప్టెన్సీ చేయనున్నాడు. మాజీ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్నా సూర్యకే సెలెక్టర్లు టీ20 సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. శ్రీలంకతో టీ20లు, వన్డే సిరీస్‍లకు భారత జట్లను బీసీసీఐ నేడు (జూలై 18) వెల్లడించింది. వన్డే సిరీస్‍కు కెప్టెన్ రోహిత్ శర్మనే సారథ్యం వహించనున్నాడు. అతడు విశ్రాంతి తీసుకోలేదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా వన్డే సిరీస్ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. వన్డే జట్టులో శ్రేయస్ అయ్యర్ మళ్లీ వచ్చేశాడు. లంకతో మూడు టీ20ల సిరీస్ జూలై 27న మొదలు కానుంది. జూలై 30 వరకు ఈ సిరీస్ ఉండనుంది. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 7 మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ పర్యటనతోనే భారత జట్టు హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్ తన బాధ్యతలను చేపట్టనున్నాడు.

సూర్య నయా కెప్టెన్

గత నెల టీ20 ప్రపంచకప్ వరకు భారత జట్టుకు వైస్ కెప్టెన్‍గా హార్దిక్ పాండ్యా వ్యవహరించాడు. వరల్డ్ కప్ తర్వాత టీ20లకు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చాడు. వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడేందుకు డిసైడ్ అయ్యాడు. దీంతో భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‍గా హార్దిక్ పాండ్యా అవుతాడనే అంచనాలు వచ్చాయి. అయితే, సెలెక్టర్లు, కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. సూర్యకుమార్ యాదవ్ వైపే మొగ్గుచూపారు. టీమిండియా టీ20 రెగ్యులర్ కెప్టెన్‍గా సూర్యనే నియమించారు. 2026 టీ20 ప్రపంచకప్ వరకు అతడినే టీ20లకు కెప్టెన్‍గా కొనసాగించాలని సెలెక్టర్లు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఐపీఎల్‍లో కోల్‍కతా నైట్ రైడర్స్ తరఫున కెప్టెన్, ప్లేయర్‌గా ఆడిన గంభీర్, సూర్య.. ఇప్పుడు భారత టీ20ల్లో హెడ్‍కోచ్, కెప్టెన్‍గా ఉండనున్నారు. లంక పర్యటనలో వన్డే జట్టులో సూర్యకు అవకాశం దక్కలేదు.

యంగ్ స్టార్ ఓపెనర్ శుభ్‍మన్ గిల్‍ టీ20, వన్డేల జట్లకు వైస్ కెప్టెన్‍గా ఎంపికయ్యాడు. భవిష్యత్తులో అతడినే సెలెక్టర్లు కెప్టెన్సీ ఆప్షన్‍కు పరిశీలిస్తున్నట్టు అర్థమవుతోంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ మళ్లీ భారత జట్టులోకి వచ్చేశాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‍కు అతడు ఎంపికయ్యాడు.

రోహిత్, కోహ్లీకి నో రెస్ట్

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శ్రీలంక పర్యటన నుంచి విశ్రాంతి తీసుకోవాలని ముందుగా భావించినట్టు తెలిసింది. అయితే, వన్డే సిరీస్ ఆడాల్సిందిగా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వీరిని కోరినట్టు సమాచారం. దీంతో విశ్రాంతి తీసుకోకుండా శ్రీలంకతో వన్డే సిరీస్‍ రోహిత్, కోహ్లీ ఆడేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో వన్డే సిరీస్‍కు రోహితే కెప్టెన్సీ చేయనున్నాడు.

శ్రీలంక పర్యటనలో శివమ్ దూబే, రియాన్ పరాగ్‍లకు టీ20లతో పాటు వన్డేల జట్టుకు కూడా ఎంపికయ్యారు. వికెట్ కీపర్ పంత్ కూడా రెండు జట్లలో ఉన్నాడు. అయితే, జింబాబ్వేతో సిరీస్ సహా అవకాశం వచ్చిప్పుడల్లా అదరగొడుతున్న రుతురాజ్ గైక్వాడ్‍కు ఈ పర్యటనలో చోటు దక్కలేదు.

శ్రీలంకతో టీ20 సిరీస్‍కు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్

శ్రీలంకతో వన్డే సిరీస్‍కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా

తదుపరి వ్యాసం