SRH vs KKR: ఐపీఎల్ 2024లో హైదరాబాద్ వేట షురూ.. టాస్ గెలిచిన ఎస్‍ఆర్‌హెచ్.. తుది జట్లు ఎలా ఉన్నాయంటే..
23 March 2024, 20:06 IST
- Sunrisers Hyderabad vs Kolkata Knight Riders: ఐపీఎల్ 2024 (IPL 2024)లో సన్‍రైజర్స్ హైదరాబాద్ తన పోరును మొదలుపెట్టింది. కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టుతో మ్యాచ్‍కు అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచింది హైదరాబాద్.
SRH vs KKR: ఐపీఎల్ 2024లో హైదరాబాద్ వేట షురూ.. టాస్ గెలిచిన ఎస్‍ఆర్‌హెచ్
SRH vs KKR - IPL 2024: మెగా లీగ్ ఐపీఎల్ 2024 సీజన్‍లో తన వేటను సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రారంభించింది. జట్టు కొత్త కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో సత్తాచాటేందుకు సమాయత్తమైంది. కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా నేడు (మార్చి 23) కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుతో ఈ సీజన్‍లో తన తొలి మ్యాచ్‍కు బరిలోకి దిగింది ఎస్‍ఆర్‌హెచ్. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.
పూర్తి ఆత్మవిశ్వాసంతో..
సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆత్మవిశ్వాసం మెండుగా ఉందని ప్యాట్ కమిన్స్ టాస్ సమయంలో చెప్పాడు. ఈ జట్టుకు ఇది తన తొలి మ్యాచ్ అని, సారథ్యం వహిస్తుండడం సంతోషంగా ఉందని అన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం రూ.20.50 కోట్ల భారీ ధరకు కమిన్స్‌ను వేలంలో కొనుగోలు చేసింది ఎస్‍ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ. ఐడెన్ మార్కరమ్‍ను తప్పించి.. అతడిని కెప్టెన్‍ను చేసింది. మార్కరమ్ ఆటగాడిగా ఈ మ్యాచ్ తుది జట్టులో ఉన్నాడు.
గతేడాది పాయింట్ల పట్టికలో తుది స్థానంలో నిలిచి హైదరాబాద్ నిరాశపరిచింది. అయితే, ఆస్ట్రేలియాను విజయపథంలో నడిపిస్తున్న కమిన్స్ సారథ్యంలో ఈసారి సత్తాచాటుతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి.
అయ్యర్ ఈజ్ బ్యాక్
గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్‍కు మొత్తం దూరమయ్యాడు కోల్‍కతా నైట్‍రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. దీంతో గతేడాది ఆ ఫ్రాంచైజీ ఇబ్బందులు పడింది. అయితే, ఇప్పుడు అయ్యర్ తిరిగి వచ్చేశాడు. దీంతో ఈ సీజన్‍లో కేకేఆర్ జట్టుకు కెప్టెన్సీ కష్టాలు తిరిగాయి. అలాగే, ఈ సీజన్ కోసం మెంటార్‌గా గౌతమ్ గంభీర్ రావడం కూడా కోల్‍కతాకు ప్లస్‍గా ఉంది.
గాయం నుంచి కోలుకొని తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ప్రాక్టీస్ బాగా చేశామని తెలిపాడు. కొన్ని సీజన్లు తమ స్పిన్నర్లు అదరగొడుతున్నారని చెప్పాడు. ఈ పిచ్ కాస్త పొడిగా ఉందని, స్పినర్లకు సహకారం లభిస్తుందని అనుకుంటున్నట్టు అభిప్రాయపడ్డాడు. విదేశీ ప్లేయర్లుగా ఫిల్ సాల్ట్, సునీల్ నరేన్, ఆండ్రీ రసెల్, మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్ తుది జట్టులో ఉన్నారని తెలిపాడు.
సన్‍రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు: మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్ రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమాద్, షెహబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్
ఇంపాక్ట్ సబ్ ఆప్షన్లు: నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్, అభిషేక్ శర్మ
కోల్‍కతా నైట్‍రైడర్స్ తుదిజట్టు: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితేశ్ రాణా, రింకూ సింగ్, అండ్రే రసెల్, సునీల్ నరేన్, రమన్‍దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ సబ్ ఆప్షన్లు: సుయాశ్ శర్మ, మనీశ్ పాండే, విభవ్ అరోరా, అగ్నిక్రిష్ రఘువంశీ, రహ్మనుల్లా గుర్బాజ్