Sunrisers Hyderabad Key Players: సన్రైజర్స్ హైదరాబాద్‌లో ఈ ఐదుగురు బ్యాట్స్‌మెన్ కీలకం.. వాళ్లు చెలరేగితే..
20 March 2024, 15:17 IST
- Sunrisers Hyderabad Key Players: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాణించాలంటే ఐదుగురు బ్యాటర్లు కీలకం కానున్నారు. వీళ్లు రాణిస్తేనే కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో అయినా ఈ టీమ్ సక్సెస్ అవుతుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఈ ఐదుగురు బ్యాట్స్‌మెన్ కీలకం.. వాళ్లు చెలరేగితే..
Sunrisers Hyderabad Key Players: సన్ రైజర్స్ హైదరబాద్ ఎన్నో ఆశలతో ఐపీఎల్ 2024 బరిలోకి దిగబోతోంది. 2013లో లీగ్ లోకి అడుగుపెట్టినా.. కేవలం ఒకే ఒక్కసారి (2016) మాత్రమే ట్రోఫీ గెలిచింది. గతేడాది టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది. దీంతో ఈసారి కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్, కొత్త జెర్సీలతో అడుగుపెడుతున్న ఈ జట్టు సక్సెస్ కు ఐదుగురు బ్యాటర్లు కీలకం కానున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ బ్యాటర్లు వీళ్లే
సన్ రైజర్స్ హైదరబాద్ గతేడాది ఐపీఎల్లో దారుణంగా విఫలమైన తర్వాత వేలంలో ప్యాట్ కమిన్స్ తోపాటు ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ లాంటి వాళ్లను తీసుకుంది. దీంతో ఈ సీజన్లో ఓ కొత్త లుక్ తో, ఎన్నో ఆశలతో బరిలోకి దిగనుంది. గత సీజన్ తో పోలిస్తే సన్ రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండూ మెరుగ్గా కనిపిస్తున్నాయి. అయితే జట్టులోకి కీలకమైన ప్లేయర్స్ ఎలా రాణిస్తారన్నదే ఇప్పుడు ముఖ్యం.
ట్రావిస్ హెడ్
ఆస్ట్రేలియా గతేడాది వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర ఇతనిదే. ఫైనల్లో సెంచరీతో ఇండియా కొంప ముంచాడు. దీంతో ట్రావిస్ హెడ్ పై భారీ ఆశలతో వేలంలో సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. నిజానికి ఐపీఎల్లో అతనికి పెద్దగా అనుభవం లేదు. 2016లో తొలిసారి లీగ్ లోకి వచ్చినా ఇప్పటి వరకూ కేవలం 10 మ్యాచ్ లే ఆడాడు. దీంతో ఈ సీజన్లో అతడు ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మయాంక్ తో కలిసి హెడ్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
హెన్రిచ్ క్లాసెన్
మిడిలార్డర్ లో విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్. గతేడాది టీమ్ విఫలమైనా.. క్లాసెన్ మాత్రం 49.78 సగటుతో 448 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. 177.07 స్ట్రైక్ రేట్ క్లాసెన్ ఏంటో చెప్పకనే చెబుతోంది. ఈసారి కూడా మిడిలార్డర్ లో అతడు కీలకంగా మారాడు.
రాహుల్ త్రిపాఠీ
సన్ రైజర్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న మరో బ్యాటర్ రాహుల్ త్రిపాఠీ. అతడు కూడా ధాటిగా ఆడగల, నమ్మదగిన బ్యాటరే. గతేడాది ఐపీఎల్లో 22.75 సగటుతో 273 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు 74గా ఉంది. ఈ సీజన్లో అతడు ఏం చేస్తాడో చూడాలి.
మయాంక్ అగర్వాల్
గతంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న మయాంక్ అగర్వాల్ ను గత వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకూ ఐపీఎల్లో 123 మ్యాచ్ లు ఆడిన మయాంక్.. 2597 రన్స్ చేశాడు. గతేడాది 10 మ్యాచ్ లు ఆడి 270 రన్స్ మాత్రమే చేసిన మాయంక్.. ఈసారి సన్ రైజర్స్ లోకి వచ్చాడు. ట్రావిస్ హెడ్, మయాంక్ లపై హైదరాబాద్ టీమ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
ఏడెన్ మార్‌క్రమ్
ఐపీఎల్లో సన్ రైజర్స్ కు గతేడాది కెప్టెన్ గా ఉన్న ఏడెన్ మార్‌క్రమ్ దారుణంగా విఫలమయ్యాడు. ఎస్ఏ20లో ఇదే సన్ రైజర్స్ ఫ్రాంఛైజీని రెండుసార్లు విజేతగా నిలిపిన అతడు.. ఈసారి కెప్టెన్సీ కోల్పోయినా మిడిలార్డర్ బ్యాటర్ గా కీలకంగా మారాడు. గతేడాది మార్‌క్రమ్ 248 రన్స్ మాత్రమే చేశాడు.
ఇక వీళ్లే కాకుండా అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ లో ఓ చేయి వేయగలరు. అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ లలో ఒకరికి తుది జట్టులో అవకాశం దక్కనుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ ను సన్ రైజర్స్ శనివారం (మార్చి 23) కోల్‌కతాలో నైట్ రైడర్స్ తో ఆడనుంది.