Mayank Agarwal: ఐసీయూలో భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్.. విమానంలోనే అనారోగ్యం
Mayank Agarwal: భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్‍కు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. విమానం ఎక్కిన కాసేపటికే అనారోగ్యానికి గురైన అతడిని.. అగర్తలాలోని ఆసుపత్రిలో చేర్పించారు.
Mayank Agarwal: భారత క్రికెటర్, ప్రస్తుతం రంజీ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‍గా ఉన్న మయాంక్ అగర్వాల్ ఆసుపత్రిలో చేరాడు. ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం కాసేపట్లో బయలుదేరుతుందనగా నేడు అతడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అగర్తలాలోని ఐఎల్‍జే ఆసుపత్రికి మయాంక్ అగర్వాల్‍ను తరలించారు. ప్రస్తుతం అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స జరుగుతోందని సమాచారం.
మయాంక్ అగర్వాల్ ఆసుపత్రిలో చేరిన విషయాన్ని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‍లో కర్ణాటకకు సారథ్యం వహిస్తున్నాడు మయాంక్ అగర్వాల్. ఎలైట్ గ్రూప్-సీలో భాగంగా కర్ణాటక - త్రిపుర మధ్య మ్యాచ్ జనవరి 29న ముగిసింది. ఈ మ్యాచ్‍లో 29 పరుగుల తేడాతో కర్ణాటక గెలిచింది. తదుపరి సూరత్‍లో రైల్వేస్ జట్టుతో కర్ణాటక మ్యాచ్ ఫిబ్రవరి 2న మొదలుకానుంది. ఈ మ్యాచ్ కోసం డిల్లీ మీదుగా రాజ్‍కోట్‍కు మయాంక్ చేరుకోవాల్సింది.
విమానంలోనే..
అయితే, ఢిల్లీ చేరుకునే క్రమంలోనే అగర్తలాలో విమానం బయలుదేరే కాసేపటి ముందు మయాంక్ అనారోగ్యానికి గురయ్యాడు. ఫ్లైట్‍లోనే మయాంక్ అగర్వాల్ వాంతులు చేసుకున్నాడని తెలుస్తోంది.
“టీమ్ మొత్తం విమానంలో ఉండగా.. ఆ సమయంలో మయాంక్ అగర్వాల్ హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. విమానంలో కూర్చున్న సమయంలోనే అతడు రెండుసార్లు వాంతులు చేసుకున్నాడు. అనారోగ్యానికి గురవటంతో అతడిని విమానం నుంచి కిందికి తీసుకొచ్చారు. కర్ణాటక క్రికెట్ అసోయేషన్ నుంచి మేం ఇద్దరు ప్రతినిధులను ఐఎల్‍జే ఆసుపత్రికి పంపిస్తున్నాం. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అతడు ఏం తీసుకున్నాడో అనే విషయాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు” అని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వర్గాలు చెప్పినట్టు పీటీఐ వెల్లడించింది.
ప్రమాదం లేదు!
మయాంక్ అగర్వాల్ ఆరోగ్యానికి ప్రమాదం లేదని తెలుస్తోంది. అతడి ఆరోగ్యం కుదురుకుందని న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ప్రయాణించేందుకు వీలు వచ్చాక.. అతడు బెంగళూరుకు వెళ్లనున్నాడని తెలుస్తోంది.
ఓ బాటిల్‍లోని పానియాన్ని తాగాక మయాంక్ అగర్వాల్‍కు వాంతులు అయినట్టు కొన్ని రిపోర్టులు వస్తున్నాయి. దాని వల్లే అతడు అనారోగ్యానికి గురయ్యాడని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుత రంజీ ట్రోఫీలో కర్ణాటక జట్టు.. తర్వాత రైల్వేస్‍తో మ్యాచ్ ఆడనుంది. సూరత్‍లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ఫిబ్రవరి 2న ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 9 నుంచి తమిళనాడుతో తలపడనుంది. కర్ణాటక తరఫున మయాంక్ అగర్వాల్ ఈ సీజన్‍లో 7 ఇన్నింగ్స్‌లో 310 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే, రైల్వేస్‍తో జరిగే మ్యాచ్‍కు మయాంక్ దూరమవుతాడని తెలుస్తోంది.
మయాంక్ టీమిండియా కెరీర్
మయాంక్ అగర్వాల్ 2018లో టీమిండియాలో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 21 టెస్టులు ఆడిన మయాంక్ 1,488 పరుగులు చేశాడు. 4 శతకాలు, 6 అర్ధ శతకాలతో రాణించాడు. 5 వన్డేల్లో 86 రన్స్ చేశాడు. అయితే, కొంతకాలం ఫామ్ కోల్పోవడంతో భారత జట్టులో మయాంక్ చోటు కోల్పోయాడు. మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకునేందుకు మయాంక్ ప్రయత్నిస్తున్నాడు.