South Africa vs England: డికాక్ చెలరేగినా ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన సౌతాఫ్రికా.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
21 June 2024, 21:53 IST
- South Africa vs England: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓ మోస్తరు స్కోరు చేసింది. ఓపెనర్ డికాక్, చివర్లో మిల్లర్ మెరుపులతో ఇంగ్లండ్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది.
డికాక్ చెలరేగినా ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన సౌతాఫ్రికా.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
South Africa vs England: ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ డికాక్ హాఫ్ సెంచరీ, డేవిడ్ మిల్లర్ మెరుపుల తప్ప మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో ఆ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 రన్స్ మాత్రమే చేసింది. ఒక దశలో 200 వరకు స్కోరు చేసేలా కనిపించినా.. మిడిల్ ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లు సఫారీలను కట్టడి చేశారు.
సౌతాఫ్రికా మోస్తరు స్కోరు
ఇంగ్లండ్ తో మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగింది. మొదటి నుంచీ ఓపెనర్ క్వింటన్ డికాక్ చెలరేగిపోయాడు. ఓ వైపు మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ నెమ్మదిగా ఆడగా.. డికాక్ మాత్రం ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అతడు కేవలం 22 బంతుల్లోనే 4సిక్స్ లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు.
ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. హెండ్రిక్స్ మాత్రం 25 బంతుల్లో కేవలం 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అప్పటికే సౌతాఫ్రికా స్కోరు 9.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులుగా ఉంది. ఈ సమయంలో కూడా సౌతాఫ్రికా 200 వరకు స్కోరు చేస్తుందని భావించారు. అయితే 92 పరుగుల స్కోరు దగ్గర డికాక్ ఔటవడంతో సఫారీల పతనం మొదలైంది.
డికాక్, మిల్లర్ మాత్రమే..
డికాక్ కేవలం 38 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్ లతో 65 రన్స్ చేశాడు. తర్వాత వచ్చిన క్లాసెన్ (8), మార్‌క్రమ్ (1) విఫలమయ్యారు. చివర్లో డేవిడ్ మిల్లర్ మాత్రమే చెలరేగాడు. అతడు 28 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 43 రన్స్ చేసి ఔటయ్యాడు. చివరి ఓవర్ తొలి బంతికి మిల్లర్ ఔటవడంతో సౌతాఫ్రికా 163 పరుగులతోనే సరిపెట్టుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీయగా.. మొయిన్ అలీ, రషీద్ చెరొక వికెట్ తీసుకున్నారు.
ఈ రెండు టీమ్స్ సూపర్ 8 దశలో తమ తొలి మ్యాచ్ లు గెలిచాయి. ఇప్పుడు గ్రూప్ 2 పాయింట్ల టేబుల్లో టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. అయితే సౌతాఫ్రికా ఊహించినంత స్కోరు చేయలేకపోవడంతో ఇంగ్లండ్ కు విజయావకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.
టాపిక్