Sehwag Trolled Akhtar: అక్తర్‌ను దారుణంగా ట్రోల్ చేసిన సెహ్వాగ్.. పాక్ బ్యాటర్ల వైఫల్యంపై వరుస ట్వీట్లు వైరల్
14 October 2023, 19:25 IST
- Sehwag Trolled Akhtar: అక్తర్, పాకిస్థాన్ బ్యాటర్లను దారుణంగా ట్రోల్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. వరల్డ్ కప్ లో భాగంగా ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఆ టీమ్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టిన తర్వాత వీరూ చేసిన వరుస ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
పాకిస్థాన్ ప్లేయర్ షహీన్ అఫ్రిది
Sehwag Trolled Akhtar: పాకిస్థాన్ టీమ్ బ్యాటర్లు, ఆ టీమ్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ లను దారుణంగా ట్రోల్ చేశాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఇండియాతో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆ టీమ్ బ్యాటర్లు 191 పరుగులకే చేతులెత్తేసిన తర్వాత వరుస ట్వీట్లతో ఆటాడుకున్నాడు. అక్తర్ తోపాటు పాకిస్థాన్ మొత్తం పరువు తీశాడు.
ఇండియాతో మ్యాచ్ లో ఒక దశలో 2 వికెట్లకు 155 రన్స్ తో ఉన్న పాకిస్థాన్.. తర్వాత 36 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు పాక్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకొని బౌండరీలు బాదుతున్న సమయంలో అక్తర్ ఓ ట్వీట్ చేశాడు. "వాహ్ రే.. ఈ సైలెంట్ ఫోర్లు" అంటూ పాక్ బ్యాటర్లు బౌండరీలు బాదుతుంటే స్టేడియమంతా నిశ్శబ్దంగా ఉండటాన్ని గుర్తు చేశాడు.
దీనిపై తర్వాత సెహ్వాగ్ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. "బహుశా ఈ సైలెంట్ ఫోర్లు చూసి చూసి పాకిస్థాన్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఒత్తిడి తట్టుకోలేకపోయారు. హా హా.. ఫర్వాలేదు షోయబ్ భాయ్. 8-0 ఓటమిలో ఉన్న మజా ప్రేమలోనూ ఉండదు" అంటూ వీరూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
సెహ్వాగ్ అక్కడితో ఆగలేదు. పాకిస్థాన్ బ్యాటర్లతోనూ ఆటాడుకున్నాడు. "మా ఆతిథ్యం అలాంటిది మరి. పాకిస్థాన్ ప్లేయర్స్ అందరికీ బ్యాటింగ్ దొరికింది. అందరి బాగోగులు చూసుకుంటాం" అని వీరూ మరో ట్వీట్ చేశాడు. "పాకిస్థాన్ 2 వికెట్లకు 155 రన్స్ చేసిన తర్వాత వాళ్లకు సాయంత్రం టిఫిన్ చేయాల్సిన టైమ్ అయిందని గుర్తొచ్చింది. ఫాఫ్డా జిలేబీ కనిపించింది. అందుకే 191 ఆలౌట్. మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం. అందుకే అందరికీ 2-2-2-2-2 వికెట్లు దక్కాయి" అని మరో ట్వీట్ చేశాడు.
ఈ వరుస ట్వీట్లు పాకిస్థాన్ కు పుండు మీద కారం చల్లినట్లు అయింది. అసలే బ్యాటింగ్ వైఫల్యం వేధిస్తున్న సమయంలో సెహ్వాగ్ ట్వీట్లు పాక్ అభిమానులు, ప్లేయర్స్ కు అస్సలు రుచించవనడంలో సందేహం లేదు.