తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 World Cup 2024: రోహిత్, కోహ్లీ టీ20 ప్రపంచకప్‍ ఆడాలి..బ్యాటింగ్‍తో పాటు..: టీమిండియా దిగ్గజం

T20 World Cup 2024: రోహిత్, కోహ్లీ టీ20 ప్రపంచకప్‍ ఆడాలి..బ్యాటింగ్‍తో పాటు..: టీమిండియా దిగ్గజం

06 January 2024, 21:29 IST

google News
    • T20 World Cup 2024: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍లో భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడాలని దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఎందుకో కూడా కారణాలను వివరించారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (ANI )

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

T20 World Cup 2024: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్‍ను ఐసీసీ వెల్లడించింది. జూన్ 1వ తేదీన మొదలయ్యే ఈ మెగాటోర్నీ జూన్ 29వతేదీ వరకు జరగనుంది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఈ పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ జరగనుంది. టీమిండియా మరోసారి ఫేవరెట్‍గా బరిలోకి దిగనుంది. అయితే, భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మళ్లీ టీ20 జట్టులోకి వస్తారా.. టీ20 ప్రపంచకప్ ఆడతారా అనేది ఉత్కంఠగా మారింది.

రోహిత్ శర్మ, కోహ్లీ.. 2022 టీ20 ప్రపంచకప్ ఆడారు. ఆ తర్వాత భారత తరఫున మళ్లీ టీ20 ఆడలేదు. వన్డేలు, టెస్టులకే పరిమితమయ్యారు. రోహిత్ గైర్హాజరీలో టీ20లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేశారు. పాండ్యా గాయపడ్డాక సూర్యకుమార్ యాదవ్.. రెండు టీ20 సిరీస్‍లకు సారథ్యం వహించాడు. అయితే, ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి రోహిత్ శర్మనే కెప్టెన్సీ చేసేలా చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను వెల్లడించారు.

2024 టీ20 ప్రపంచకప్‍లో భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడడం చాలా ముఖ్యమని సునీల్ గవాస్కర్ చెప్పారు. బ్యాటింగ్‍తో పాటు వారిద్దరూ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నారని, అందుకే వారు పొట్టి ప్రపంచకప్ ఆడాలని సూచించారు.

“ఏడాదిన్నరగా విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‍లో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్‍లోనూ సత్తాచాటాడు. అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్‍లో అతడి బ్యాటింగ్ పవర్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతమైన ఫీల్డర్లు కూడా అవడం చాలా ముఖ్యమైన విషయం” అని స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో గవాస్కర్ అన్నారు.

రోహిత్, కోహ్లీ ఉంటే డ్రెస్సింగ్‍ రూమ్‍లోనూ సీనియారిటీ ఉండడం అదనపు బలంగా ఉంటుందని సునీల్ గవాస్కర్ చెప్పారు. “కొన్నిసార్లు 35-36 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఫీల్డింగ్‍లో స్లోగా ఉంటారు. త్రో కూడా వేగంగా వేయలేరు. అయితే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో ఈ సమస్యలు కూడా ఉండవు. ఎందుకంటే వారిద్దరూ అద్భుతమైన ఫీల్డర్లు. అందులోనూ డ్రెస్సింగ్ రూమ్‍కు సీనియారిటీ కూడా అదనంగా ఉంటుంది. రోహిత్ శర్మ కెప్టెన్‍గా ఉన్నా.. ఉండకపోయినా.. రోహిత్, కోహ్లీ ఉంటే జట్టుకు ప్రయోజనంగా ఉంటుంది” అని గవాస్కర్ చెప్పారు.

భారత జట్టు తదుపరి స్వదేశంలో అఫ్గానిస్థాన్‍తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. జనవరి 11, 14, 17 తేదీల్లో ఈ మ్యాచ్‍లు జరగనున్నాయి. ఈ సిరీస్‍కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంపికవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. గాయపడిన హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా సందేహమే. ఈ సిరీస్‍తోనే టీ20ల్లోకి రోహిత్, కోహ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

టీ20 ప్రపంచకప్‍కు ముందు భారత్ ఆడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే కానుంది. అలాగే, వరల్డ్ కప్ కంటే ముందే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) సీజన్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‍కు భారత ఆటగాళ్ల ఎంపికలో ఐపీఎల్‍లో ప్రదర్శన కూడా కీలకంగా మారనుంది.

తదుపరి వ్యాసం