Rishabh Pant: ఇక్కడో ఫీల్డర్‌ను పెట్టు.. చెపాక్ టెస్టులో బంగ్లా కెప్టెన్‌తో ఆడుకుంటున్న రిషబ్ పంత్
21 September 2024, 12:10 IST
IND vs BAN 1st Test Live: చెపాక్ టెస్టులో తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయిన బంగ్లాదేశ్ టీమ్‌ను బ్యాటింగ్‌తోనే కాదు తన సరదాతనంతోనూ రిషబ్ పంత్ ఆడుకుంటున్నాడు. బంగ్లాదేశ్ కెప్టెన్‌ను పిలిచి ఎక్కడ ఫీల్డర్‌ను పెట్టాలో కూడా పంత్ చెప్తున్నాడు.
రిషబ్ పంత్
India vs Bangladesh 1st Test: చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు విజయానికి భారత్ జట్టు బాటలు వేసుకుంది. మ్యాచ్‌లో మూడో రోజైన శనివారం తొలి సెషన్‌లో దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ (82 బ్యాటింగ్: 108 బంతుల్లో 9x4, 3x6), శుభమన్ గిల్ (86 బ్యాటింగ్: 137 బంతుల్లో 7x4, 3x6).. నాలుగో వికెట్‌కి అజేయంగా 190 బంతుల్లో 138 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.
శనివారం 81/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా లంచ్ విరామానికి 205/3తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 227 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే ఇప్పుడు భారత్ జట్టు 432 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
తొలి సెషన్‌లో గిల్, రిషబ్ పంత్ జోరుతో బంగ్లాదేశ్ టీమ్ ఢీలా పడిపోయింది. దాంతో రిషబ్ పంత్ సరదాగా బంగ్లాదేశ్ టీమ్ ఫీల్డింగ్‌లో సరదాగా మార్పులు చేస్తూ కనిపించాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటోని పిలిచి.. లెగ్ సైడ్‌లో ఒక ఫీల్డర్‌ను పెట్టాలని సూచించాడు.
బౌలర్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న సమయంలో పంత్ బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో వైపు తిరిగి, పూర్తిగా ఖాళీగా ఉన్న లెగ్ సైడ్‌లోని ఇన్నర్ సర్కిల్‌లో ఫీల్డర్ ను ఉంచాలని సరదాగా కోరాడు.
‘‘హేయ్.. ఇక్కడ ఒక ఫీల్డర్ ను ఉంచు. ఇక్కడ ఎక్కువ మంది ఫీల్డర్లు లేరు’’ అని పంత్ లెగ్ సైడ్ చేత్తో చూపిస్తూ శాంటోతో అన్నాడు. దాంతో చెపాక్ స్టేడియంలో ఒక్కసారిగా అభిమానుల కేరింతలతో మార్మోగింది. పంత్ సూచనను గౌరవించిన బంగ్లా కెప్టెన్ శాంటో ఒక ఫీల్డర్‌ను అక్కడ ఉంచాడు.
2019 వన్డే ప్రపంచకప్ సమయంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కూడా ఇలానే సరదాగా బంగ్లాదేశ్ టీమ్ ఫీల్డింగ్ సెట్ చేశాడు. ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్క్వేర్ లెగ్ ఫీల్డర్ కుడి వైపునకి ఎక్కువగా ఉండటంతో.. కాస్త ఎడమవైపునకు మార్చమని ధోనీ సూచించాడు. దాంతో ధోనీ చెప్పినట్లే రెండు సార్లు ఫీల్డర్లను బంగ్లాదేశ్ టీమ్ బౌలర్ షబ్బీర్ మార్చారు.
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిట్టన్ దాస్‌తో మ్యాచ్‌లో తొలిరోజే రిషబ్ పంత్‌కి గొడవైంది. బంతిని బౌలర్‌కి విసిరే క్రమంలో లిట్టన్ దాస్ పదే పదే పంత్ శరీరానికి అతి సమీపం నుంచి బంతిని విసురుతూ వచ్చాడు. దాంతో పంత్.. నువ్వు అతనికి బాల్ విసురు.. అంతేతప్ప నన్ను గాయపరచొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది.