Ravichandran Ashwin: ‘బాటిల్ కూడా..’ హెడ్‍కోచ్‍లుగా గంభీర్, రాహుల్ ద్రవిడ్ మధ్య తేడాను చెప్పిన రవిచంద్రన్ అశ్విన్
24 September 2024, 21:18 IST
- Ravichandran Ashwin: భారత హెడ్ కోచ్‍లుగా గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్ ఎలా ఉంటారో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పారు. ఇద్దరి మధ్య ప్రధానమైన తేడా ఏంటో వెల్లడించారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Ravichandran Ashwin: ‘బాటిల్ కూడా..’ హెడ్‍కోచ్‍లుగా గంభీర్, రాహుల్ ద్రవిడ్ మధ్య తేడాను చెప్పిన రవిచంద్రన్ అశ్విన్
దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా హెడ్‍కోచ్ స్థానానికి వీడ్కోలు పలికారు. ఆ తర్వాత హెడ్‍కోచ్‍గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వచ్చారు. శ్రీలంక పర్యటనలో టీ20, వన్డే సిరీస్‍లతో భారత హెడ్‍కోచ్‍గా ప్రస్థానాన్ని గంభీర్ మొదలుపెట్టారు. ఇటీవలే బంగ్లాదేశ్‍తో భారత్ తొలి టెస్టులో గెలిచింది. భారత హెడ్‍కోచ్‍గా గంభీర్ వచ్చి సుమారు రెండు నెలలైంది. ఈ తరుణంలో హెడ్‍కోచ్‍గా రాహుల్ ద్రవిడ్, గంభీర్ మధ్య పెద్ద తేడా ఏంటో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించారు.
ముఖ్యమైన తేడా ఇదే
హెడ్‍కోచ్‍గా డ్రెస్సింగ్ రూమ్‍లో రాహుల్ ద్రవిడ్ కంటే గౌతమ్ గంభీర్ చాలా రిలాక్స్డ్‌గా ఉంటారని అశ్విన్ తెలిపారు. ద్రవిడ్ అన్నీ పద్ధతిగా ఉండాలని అనుకుంటారని, గంభీర్ అంతగా పట్టించుకోరని తన యూట్యూబ్ ఛానెల్‍లో అశ్విన్ అన్నారు. దీని కోసం బాటిల్ ఉదాహరణ కూడా చెప్పారు.
గంభీర్ ఎలాంటి ఒత్తిడి కనిపించనివ్వరని అశ్విన్ అన్నారు. “అతడు (గంభీర్) చాలా రిలాక్స్డ్‌గా ఉంటారు. అతడిని రిలాక్స్డ్ రాచో అని నేను అనాలనుకుంటా. అసలు ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఉదయం ఓ టీమ్ మీటింగ్ ఉంటుంది. ఆ విషయంలోనూ గంభీర్ చాలా కులాసాగా ఉంటారు” అని అశ్విన్ చెప్పారు.
బాటిల్ కూడా సరిగా ఉండాలంటూ..
రాహుల్ ద్రవిడ్ అన్నీ పద్ధతిగా ఉండాలని అనుకుంటారని అశ్విన్ అన్నారు. బాటిల్ కూడా నిర్దిష్టమైన చోటే ఉండాలని చెబుతారని వెల్లడించారు. క్రమశిక్షణ విషయంలో ద్రవిడ్ కట్టుదిట్టంగా ఉంటారని అన్నారు. “అన్నీ పద్ధతిగా ఉండాలని రాహుల్ ద్రవిడ్ అనుకుంటారు. బాటిల్ కూడా నిర్ధిష్టమైన చోట.. నిర్దిష్టమైన సమయంలో ఉండాలని అనుకుంటారు. ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అన్నీ ఓ ఆర్డర్‌లో ఉండాలనుకుంటారు” అని అశ్విన్ చెప్పారు.
గంభీర్ తమ నుంచి అలాంటివి ఊహించరని అశ్విన్ చెప్పారు. అంత కట్టుదిట్టంగా ఉండాలని అనుకోరని, సరదాగా ఉంటారని వెల్లడించారు. అందరి మనసులను గౌతీ త్వరగా గెలిచేస్తారని అశ్విన్ చెప్పారు.
ప్రస్తుతం టీమిండియాలో ఆడుతున్న అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతో ఒకప్పుడు ఆటగాడిగా గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు, హెడ్‍కోచ్‍గా గౌతీ వచ్చారు.
బంగ్లాదేశ్‍తో తొలి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‍లో శతకంతో కదం తొక్కిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్ మ్యాజిక్‍తో ఆరు వికెట్లు పడగొట్టారు. బంగ్లాను భారత్ 280 పరుగుల భారీ తేడాతో చిత్తు చేయటంతో అశ్విన్ కీలకపాత్ర పోషించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‍గా నిలిచారు.
క్లీన్‍స్వీప్‍పై గురి
తొలి టెస్టులో గెలిచి రెండు మ్యాచ్‍ల సిరీస్‍లో 1-0తో ఆధిక్యంలోకి భారత్ వచ్చేసింది. టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు సెప్టెంబర్ 27వ తేదీన కాన్పూర్ వేదికగా సాగనుంది. ఈ మ్యాచ్‍లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో భారత్ పటిష్టంగా ఉంది. కాన్పూర్ పిచ్ స్పిన్‍కు సహకరించే అవకాశాలు ఉండడం కూడా కలిసి రానుంది.
టాపిక్