Ravi Shastri on India: 2011 వరల్డ్ కప్ తర్వాత ఇదే అత్యంత బలమైన ఇండియన్ టీమ్: రవిశాస్త్రి
01 September 2023, 18:39 IST
- Ravi Shastri on India: 2011 వరల్డ్ కప్ తర్వాత ఇదే అత్యంత బలమైన ఇండియన్ టీమ్ అని అన్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఇండియానే ఫేవరెట్స్ అని స్పష్టం చేశాడు.
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి
Ravi Shastri on India: పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఈ మ్యాచ్ విజేతతోపాటు వివిధ అంశాలపై స్పందించాడు. ఈ మ్యాచ్ లో ఇండియా ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతున్నా.. గత కొన్నేళ్లుగా ఇండియన్ టీమ్ కు పాకిస్థాన్ చేరువగా వస్తోందని రవిశాస్త్రి అన్నాడు. 2011 వరల్డ్ కప్ తర్వాత ఇదే అత్యంత బలమైన ఇండియన్ టీమ్ అని కూడా అన్నాడు.
"ఇండియా ఈ మ్యాచ్ లో ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతోంది. 2011 తర్వాత ఇదే అత్యంత బలమైన జట్టు. మంచి కెప్టెన్ కూడా ఉన్నాడు. అయితే పాకిస్థాన్ టీమ్ చేరువగా వచ్చేసింది. ఏడెనిమిదేళ్ల కిందట చూస్తే ఈ రెండు జట్ల బలాబలాల్లో స్పష్టమైన తేడా ఉండేది. కానీ పాకిస్థాన్ ఆ గ్యాప్ తగ్గించింది. వాళ్లది చాలా మంచి టీమ్. అందుకే వాళ్లతో అత్యుత్తమ ఆట ఆడాల్సి ఉంటుంది" అని రవిశాస్త్రి అన్నాడు.
ఇక ఈ మ్యాచ్ ను ప్లేయర్స్ మరీ ఎక్కువ చేసి చూడకూడదని కూడా సూచించాడు. "ఇది కూడా మరో మ్యాచ్ అన్నట్లుగా ఉండటం ముఖ్యం. మరీ ఎక్కువ చేసి చూడకూడదు. అలా చూస్తే భిన్నమైన ఆలోచనలు వస్తాయి. ఇతర ఏ మ్యాచ్ లో ఉన్నట్లే ఈ మ్యాచ్ లోనూ మీ ఆటతీరు ఉండాలి. కానీ లోలోపల ఉండే ఆ ఒత్తిడి వల్ల మానిసకంగా బలంగా ఉన్న ప్లేయర్సే మెరుగ్గా రాణిస్తారు" అని శాస్త్రి చెప్పాడు.
"ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లో ఫామ్ ని చూడొద్దు. మానసికంగా బలంగా ఉన్న ప్లేయర్స్ కొంత కాలంగా సరిగా ఆడకపోయినా.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లో రాణిస్తారు. వాళ్లు ఈ మ్యాచ్ ప్రాముఖ్యత తెలుసు. ఇందులో బాగా ఆడితే వాళ్లకు ఎంతటి పేరొస్తుందో కూడా తెలుసు" అని రవిశాస్త్రి చెప్పాడు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంపైనా ప్రశంసలు కురిపించాడు.
"బాబర్ ఆ 30లు, 40లను సెంచరీలుగా మలుస్తాడు. అది చాలా ముఖ్యం. టీమ్ లోని టాప్ 3లో ఎవరైనా సెంచరీ చేస్తే స్కోరు 300 దాటుతుంది" అని శాస్త్రి అన్నాడు. బాబర్ తొలి మ్యాచ్ లో నేపాల్ పై సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 104 వన్డేల్లోనే అతడు 19 సెంచరీలు చేయడం విశేషం. ఈ క్రమంలో అతడు హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లి రికార్డులను బ్రేక్ చేశాడు.