Ravi Shastri on England: ఛీ.. ఛీ.. మీరు వరల్డ్ ఛాంపియన్సా: ఇంగ్లండ్‌కు రవిశాస్త్రి దిమ్మదిరిగే పంచ్
30 October 2023, 11:37 IST
- Ravi Shastri on England: ఛీ.. ఛీ.. మీరు వరల్డ్ ఛాంపియన్సా అంటూ ఇంగ్లండ్‌కు రవిశాస్త్రి దిమ్మదిరిగే పంచ్ ఇచ్చాడు. ఇండియా చేతుల్లో ఓడిపోయిన తర్వాత శాస్త్రి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇంగ్లండ్ టీమ్ పరువు తీసేసిన రవిశాస్త్రి
Ravi Shastri on England: డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో వరల్డ్ కప్ 2023లో అడుగుపెట్టిన ఇంగ్లండ్.. ఆరు మ్యాచ్ లలో ఐదు ఓటములతో సెమీస్ బెర్త్ కు దాదాపు దూరమైంది. అయితే తాజాగా ఇండియా చేతుల్లో ఓటమి తర్వాత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి చేసిన కామెంట్స్ మాత్రం ఆ ఓటముల కంటే కూడా ఆ టీమ్ కు ఎక్కువ బాధ కలిగించి ఉంటుందనడంలో సందేహం లేదు.
టీమిండియా చేతుల్లో 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓడిపోయిన తర్వాత రవిశాస్త్రి మాట్లాడుతూ.. మిమ్నల్ని మీరు వరల్డ్ ఛాంపియన్స్ అని ఎలా అంటారు? అలా అనుకుంటే ఈ ఓటములతో మీరు బాధపడాల్సిందే అని అన్నాడు. వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ ఓడిన ఐదు మ్యాచ్ లలోనూ ఇంగ్లండ్ దారుణంగా ఓడింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది.
మీరు వరల్డ్ ఛాంపియన్స్ ఏంటి?: రవిశాస్త్రి
"ఇంగ్లండ్ టీమ్, ప్రేక్షకులు, మద్దతుదారుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్లు తొలి మ్యాచ్ ఓడినప్పుడు 17 మిగిలి ఉండగానే న్యూజిలాండ్ గెలిచింది. సౌతాఫ్రికాతో 20 ఓవర్లలోనే ఆలౌటయ్యారు. శ్రీలంకతోనూ 30 ఓవర్లలోనే ఆలౌటయ్యారు.
శ్రీలంక టార్గెట్ ను 25 ఓవర్లలోనే చేజ్ చేసింది. ఇవాళ కూడా వాళ్లు 32 ఓవర్లలోనే తొలి 8 వికెట్లు కోల్పోయారు. మీరా వరల్డ్ ఛాంపియన్స్? తమ ప్రదర్శన చూసి వాళ్లే బాధపడకపోతే మరెవరు బాధపడతారు?" అని శాస్త్రి అనడం గమనార్హం.
ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఏంటి తేడా అని అడిగితే.. నేను 8 జట్లు అని చెబుతాను అంటూ రెండు జట్ల మధ్య పాయింట్ల టేబుల్లో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తు చేశాడు. ఇంగ్లండ్ ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో అట్టడుగున ఉంది. ఇలాగే కొనసాగితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఆ టీమ్ అర్హత సాధించదు. టాప్ 8లో ఉన్న వాళ్లే నేరుగా ఆ టోర్నీకి వెళ్తారు.
"ఇక నుంచి ఇంగ్లండ్ పరువు కోసమే ఆడాలి. ఎందుకంటే వాళ్లు ఇప్పుడు పాయింట్ల టేబుల్లో కింద ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి టాప్ 8 నేరుగా అర్హత సాధిస్తారు. ఒకవేళ ఇంగ్లండ్ ఇలాగే కింది రెండు టీమ్స్ లో ఉంటే.. అలాంటి టీమ్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం ఎలాంటి ఉంటుందో ఊహించండి. ఇది వాళ్లకు గట్టి దెబ్బే అవుతుంది" అని శాస్త్రి స్పష్టం చేశాడు.