Ravi Shastri on Dhoni: లీగ్ స్టేజ్‌లో ఒక మ్యాచ్ ఓడిపోవడమే మంచిదని ధోనీ చెప్పాడు: రవిశాస్త్రి
Ravi Shastri on Dhoni: లీగ్ స్టేజ్‌లో ఒక మ్యాచ్ ఓడిపోవడమే మంచిదని ధోనీ చెప్పాడంటూ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. న్యూజిలాండ్ తో ఇండియా మ్యాచ్ కు ముందు శాస్త్రి ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.
Ravi Shastri on Dhoni: వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్ తో ఇండియా ఆదివారం (అక్టోబర్ 22) లీగ్ మ్యాచ్ లో తలపడుతోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ ఈ రెండు టీమ్స్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ మ్యాచ్ లో ఆ తొలి ఓటమి రుచి ఎవరు చూస్తారో తేలనుంది. అయితే అది ఇండియా కావాలన్నట్లుగా రవిశాస్త్రి చెప్పడం విశేషం.
నిజానికి ఈ మాటలు ఒకప్పుడు ధోనీ అన్నట్లు రవిశాస్త్రి చెప్పాడు. 2011 వరల్డ్ కప్ ఇండియా గెలిచినప్పుడు లీగ్ స్టేజ్ లో ఇండియా ఒక మ్యాచ్ ఓడిందని, అది కూడా న్యూజిలాండ్ చేతుల్లో అన్న విషయాన్ని శాస్త్రి మరోసారి గుర్తు చేశాడు. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ కు ముందు స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన ధోనీ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
నిజానికి గత 20 ఏళ్లుగా ఏ ఐసీసీ టోర్నమెంట్లోనూ న్యూజిలాండ్ పై ఇండియా గెలవలేదు. ఈ నేపథ్యంలో శాస్త్రి చేసిన కామెంట్స్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. "2011లో ఇండియా ఒక మ్యాచ్ ఓడిపోయింది. అది న్యూజిలాండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్. కానీ తర్వాత వరల్డ్ కప్ గెలిచారు. అప్పుడు కెప్టెన్ గా ధోనీ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. లీగ్ ఫార్మాట్లో ఒక మ్యాచ్ ఓడిపోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సడెన్ గా సెమీఫైనల్లోనో, ఫైనల్లోనో ఏదో చేయాల్సి వచ్చినప్పుడు వణుకు పుడుతుంది అని ధోనీ అన్నాడు" అంటూ శాస్త్రి అప్పుడు జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇండియా, న్యూజిలాండ్ తమ తొలి నాలుగు మ్యాచ్ లలోనూ గెలిచాయి. ఇండియాకు అసలుసిసలు సవాలు విసిరేది న్యూజిలాండే అని క్రికెట్ పండితులు చెబుతున్న వేళ.. రవిశాస్త్రి ఈ కామెంట్స్ చేయడం విశేషం. ఈసారి వరల్డ్ కప్ లో పెద్దగా అంచనాలు లేకుండా, కెప్టెన్ విలియమ్సన్ గాయంతో దూరమవుతున్నా న్యూజిలాండ్ వరుస విజయాలు సాధిస్తోంది.
పేస్ బౌలింగ్ కు అనుకూలించే ధర్మశాల పిచ్ పై కివీస్ తో మ్యాచ్ అంటే కష్టమే అన్న భావన మొదటి నుంచీ ఉంది. ఇప్పుడు ఆ టీమ్ ఫామ్ చూస్తుంటే.. ఇండియా వరుసగా ఐదో విజయం సాధించడం అంత సులువయ్యేలా కనిపించడం లేదు.