Ranji Trophy: కర్ణాటక 50/0 నుంచి 103 ఆలౌట్.. రంజీ ట్రోఫీ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో గుజరాత్ సంచలన విజయం
16 January 2024, 7:36 IST
- Ranji Trophy: రంజీ ట్రోఫీలో గుజరాత్ సంచలన విజయం సాధించింది. 53 పరుగుల తేడాతో మొత్తం 10 వికెట్లు కోల్పోయిన కర్ణాటక చేజేతులా విజయాన్ని ప్రత్యర్థికి అప్పగించింది.
కర్ణాటకపై సంచలన విజయం తర్వత గుజరాత్ రంజీ టీమ్
Ranji Trophy: రంజీ ట్రోఫీలో ఓ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. గుజరాత్ లెఫ్టామ్ స్పిన్నర్ సిద్ధార్థ్ దేశాయ్ దెబ్బకు గెలిచే మ్యాచ్ లో కర్ణాటక చేతులెత్తేయడంతో చివరికి 6 పరుగుల తేడాతో గుజరాత్ సంచలన విజయం నమోదు చేసింది. కేవలం 110 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కర్ణాటక.. 103 పరుగులకే ఆలౌట్ కావడం ఈ మ్యాచ్ లో హైలైట్.
అంతకంటే మరో హైలైట్ ఏంటంటే.. చేజింగ్ లో కర్ణాటక టీమ్ ఒక దశలో 50 పరుగులకు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. దీంతో ఆ టీమ్ గెలవడం పక్కా అని అందరూ భావించారు. 9.2 ఓవర్లలోనే ఆ టీమ్ ఓపెనర్లు 50 రన్స్ చేశారు. కానీ కెప్టెన్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 19 పరుగుల దగ్గర ఔటవడంతో కర్ణాటక పతనం మొదలైంది. ఇక ఏ దశలోనూ ఆ టీమ్ కోలుకోలేదు.
కర్ణాటక చేజేతులా..
మయాంక్ అగర్వాల్, మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ తో కలిసి మంచి స్టార్ట్ అందించాడు. కానీ మయాంక్ ఔటైన తర్వాత కర్ణాటక వరుసగా వికెట్లు కోల్పోయింది. 9.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులతో ఉన్న కర్ణాటక.. తర్వాత 18వ ఓవర్లో 6 వికెట్లకు 74 రన్స్ తో నిలిచింది. చివరికి సరిగ్గా గెలుపు ముంగిట 25వ ఓవర్లో 103 పరుగులకే చాప చుట్టేసింది.
గుజరాత్ స్పిన్నర్ సిద్ధార్థ్ దేశాయ్ దెబ్బకు కర్ణాటక 53 పరుగుల వ్యవధిలో మొత్తం 10 వికెట్లు కోల్పోయింది. ఈ లెఫ్టామ్ బౌలర్ 7 వికెట్లు తీయడం విశేషం. నిజానికి అతడే పేస్ బౌలర్, గుజరాత్ కెప్టెన్ చింతన్ గాజాతో కలిసి బౌలింగ్ ప్రారంభించాడు. అయితే 9 ఓవర్ల వరకూ వాళ్లకు ఎలాంటి వికెట్ దక్కలేదు. పడిక్కల్ 29 బంతుల్లోనే 31 రన్స్ చేసి వన్డే ఇన్నింగ్స్ ఆడాడు.
మరోవైపు మయాంక్ కూడా నిలదొక్కుకున్నట్లు కనిపించాడు. కానీ పదో ఓవర్లో సిద్ధార్థ్ తన వికెట్ల వేట మొదలు పెట్టాడు. తర్వాత వచ్చిన నికిన్ జోస్ (4), మనీష్ పాండే (0), సుజయ్ సటేరీ (2), విజయ్ కుమార్ వైశాంక్ (0), రవికుమార్ సమర్థ్ (2), రోహిత్ కుమార్ (0) వరుసగా పెవలియన్ చేరారు. సిద్ధార్థ్ దేశాయ్ స్పిన్ మాయాజాలానికి కర్ణాటక మిడిల్, లోయర్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది.
కర్ణాటక ఇన్నింగ్స్ లో మయాంక్ (19), పడిక్కల్ (31), శుభాంగ్ (27) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో గుజరాత్ 264 రన్స్ చేయగా.. మయాంక్ సెంచరీతో కర్ణాటక 374 రన్స్ చేసి 110 రన్స్ ఆధిక్యం సంపాదించింది. తర్వాత గుజరాత్ రెండో ఇన్నింగ్స్ లో 219 రన్స్ కు ఆలౌటైంది. మ్యాచ్ మొదటి నుంచీ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన కర్ణాటక చివరి రోజు మాత్రం విజయం ముందు చేతులెత్తేసింది.
రెండో ఇన్నింగ్స్ లో 7, మొదటి ఇన్నింగ్స్ లో 2.. మ్యాచ్ లో మొత్తం 9 వికెట్లు తీసుకున్న సిద్ధార్థ్ దేశాయ్ కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.