Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‍లో బిగ్ వికెట్ డౌన్.. పీసీబీ చైర్మన్ రాజీనామా: కారణమిదే!
19 January 2024, 23:23 IST
- Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ జకా అష్రఫ్ తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆయన వ్యవహార శైలి వివాదాస్పదమైంది. ఇప్పుడు ఏకంగా పీసీబీ పదవి నుంచే తప్పుకున్నారు. వివరాలివే..
జకా అష్రఫ్
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‍లో సంక్షోభం ముదురుతూనే ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవికి జకా అష్రఫ్ నేడు (జనవరి 19) రాజీనామా చేశారు. పాక్ టీమ్ హెడ్ కోచ్‍గా మిక్కీ ఆర్థర్ తప్పుకొని ఒక్క ముగియక ముందే.. ఏకంగా పీసీబీ చైర్మన్ కూడా రాజీనామా చేశారు. దీంతో పాక్ క్రికెట్‍లో డ్రామా కొనసాగుతూనే ఉంది. ఆ బోర్డు మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది. గతేడాది జూలై 6వ తేదీన పీసీబీ చైర్మన్‍గా బాధ్యతలు తీసుకున్న జకా అష్రఫ్.. సంవత్సరం కూడా కాకుండానే రాజీనామా చేసేశారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మేనేజింగ్ కమిటీ సమావేశం నేడు జరగగా.. అది ముగిసిన వెంటనే తన రాజీనామా నిర్ణయాన్ని జకా అష్రఫ్ ప్రకటించారు. “మీటింగ్ ముగింపులో తన రాజీనామాను తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్‌కు పంపారు జకా అష్రఫ్. ఇంతకాలం తనపై నమ్మకం ఉంచిన వారికి థ్యాంక్స్ చెప్పారు. పాకిస్థాన్ క్రికెట్‍కు ముమ్ముందు మంచి జరగాలని ఆకాక్షించారు” అని పీసీబీ వెల్లడించింది.
ఇలా అయితే కష్టమంటూ..
పాకిస్థాన్ క్రికెట్‍ను బాగు చేయాలని తాను కష్టపడుతున్నా.. సరైన మద్దతు లభించడం లేదని భావించిన కారణంగా పీసీబీ చైర్మన్ పదవికి జకా అష్రఫ్ రాజీనామా చేశారని తెలుస్తోంది. ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారంటూ పాక్ మీడియా జియో న్యూస్ రిపోర్ట్ వెల్లడించింది.
“నేను క్రికెట్‍ను మెరుగుపరిచేందుకు పని చేస్తున్నా. కానీ ఇలా పని చేయడం సాధ్యం కాదు. ఇక ఎవరిని నియమించుకుంటారో వారి (ప్రధాన మంత్రి) ఇష్టం” అని జకా అష్రఫ్ చెప్పినట్టు జియో న్యూస్ వెల్లడించింది.
జకా అష్రఫ్.. పీసీబీ చైర్మన్ అయ్యాక పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఎక్కువగా పరాజయాలను చవి చూసింది. గతేడాది ఆసియా కప్ ఫైనల్ కూడా చేరలేకపోయింది. అలాగే, గతేడాది వన్డే ప్రపంచకప్‍లో లీగ్ స్టేజ్‍లోనే నిష్క్రమించింది. ఆ తర్వాత పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్ తప్పుకున్నాడు. టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ షా అఫ్రిది కెప్టెన్లు అయ్యారు. ఈ క్రమంలో పాకిస్థాన్ టీమ్ డైరెక్టర్‌గా మహమ్మద్ హఫీజ్ వచ్చాడు.
ప్రపంచకప్ సమయంలో రచ్చరచ్చ
గతేడాది వన్డే ప్రపంచకప్ సమయంలో పాకిస్థాన్ క్రికెట్‍లో రచ్చసాగింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ కాల్ చేస్తే పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్ మాట్లాడడం లేదని సమాచారం బయటికి వచ్చింది. ప్రపంచకప్‍లో ఘోర ప్రదర్శనకు బాబర్ సహా అప్పటి చీఫ్ సెలెక్టర్ ఇంజిమాముల్ హక్ కారణమంటూ అష్రఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వెల్లడైంది. దీనిపై అప్పట్లోనే ఆయనపై విమర్శలు వచ్చాయి. అలాగే, బాబర్ ఆజమ్, పీసీబీ అధికారి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ కూడా ఓ లోకల్ టీవీ ఛానెల్‍లో వచ్చింది. అది కూడా రచ్చ అయింది. మొత్తంగా ప్రపంచకప్ తర్వాత బాబర్ ఆజమ్ ఏకంగా కెప్టెన్సీ నుంచే తప్పుకున్నాడు. ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణల ఎదుర్కొన్న ఇంజిమాముల్ హక్.. చీఫ్ సెలెక్టర్ పదవికి కొన్ని నెలల క్రితమే రాజీనామా చేశాడు.