Pakistan: పాకిస్థాన్ క్రికెట్‍లో మరో దుమారం.. ఇంజమామ్ రాజీనామా.. కారణమిదే..
Pakistan - Inzamam Ul Haq: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్ పదవికి ఇంజమాముల్ హక్ రాజీనామా చేశారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలతో ఆయన తప్పుకున్నారు. వివరాలివే..
Pakistan - Inzamam Ul Haq: పాకిస్థాన్ క్రికెట్‍లో మరో దుమారం చెలరేగింది. ప్రస్తుత వన్డే ప్రపంచకప్‍లో పాక్ టీమ్ ఘోరమైన ప్రదర్శన చేస్తోంది. మరోవైపు, ఆ టీమ్ ఆటగాళ్లకు ఐదు నెలలుగా జీతాలు అందడం లేదని ఇటీవల సమాచారం బయటికి వచ్చింది. తాజాగా, పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్ పదవికి మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ నేడు రాజీనామా చేశారు. సెలెక్టర్‌గా ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలను పొందుతున్నారంటూ వస్తున్న ఆరోపణలతో ఇంజమామ్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ వివరాలివే..
బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్, షాహిన్ అఫ్రిదీ లాంటి పాక్ క్రికెటర్ల ఏజెంట్‍గా ఉన్న తెల్హా రహమానీకి చెందిన యాజో ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థలో ఇంజమామ్ పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని ఇంజమామ్‍పై ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో ఇంజమామ్.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఈ విషయంపై విచారణ కూడా చేపట్టింది.
“మీడియా ద్వారా తలెత్తిన పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై పీసీబీ పారదర్శకంగా విచారణ జరిపేందుకు నా పదవి నుంచి వైదొలుగుతున్నా. ఒకవేళ నా తప్పు లేదని కమిటీ తేలిస్తే.. మళ్లీ చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు చేపడతా” అని ఇంజమామ్ తెలిపినట్టు పీసీబీ వెల్లడించింది. ఈ విషయంపై ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీతో విచారణ జరపనున్నట్టు పీసీబీ తెలిపింది.
“ఎలాంటి పరిశోధన చేయకుండా కొందరు మాట్లాడుతున్నారు. ఒకవేళ నావైపు వేలు చూపించాలనుకుంటే.. నేరుగా నన్నే ప్రశ్నలు అడగండి. నేను రాజీనామా చేయడమే మేలు. ఒకవేళ నాపై పీసీబీ విచారణ జరిపితే.. నేను అందుబాటులోనే ఉంటా. ఎలాంటి ఆధారాలు లేకుండా కొందరు నా గురించి మాట్లాడుతున్నారు. ఏవైనా ఆధారాలు ఉంటే తీసుకురండి. ఇదే చేయాలని నేను పీసీబీని అడిగా. ప్లేయర్ల ఏజెంట్ కంపెనీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఆరోపణలు నన్ను బాధిస్తున్నాయి” ఇంజమామ్ అన్నారు.
కాగా, భారత్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‍ల్లో నాలుగు ఓడిన పాకిస్థాన్ జట్టు సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అలాగే, పాక్ ఆటగాళ్లకు ఐదు నెలలుగా వేతనాలు అందడం లేదని రషీద్ లతీఫ్ ఇటీవల సంచలన కామెంట్లు చేశారు. కెప్టెన్ బాబర్ ఆజమ్ మెసేజ్‍లకు పీసీబీ ఉన్నతాధికారులు స్పందించడం లేదని బాంబ్ పేల్చారు. ఇక ఈ క్రమంలోనే ఇంజమామ్ రాజీనామా కూడా పాకిస్థాన్ క్రికెట్‍లో మరింత దుమారం రేపింది.
సంబంధిత కథనం