Virat Kohli for T20I: టీ20 వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లి లేనట్లే.. అతని స్థానంలో ఎవరంటే?
07 December 2023, 14:04 IST
- Virat Kohli for T20I: టీ20 వరల్డ్ కప్ కోసం విరాట్ కోహ్లి పేరు పరిశీలించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ను మూడో స్థానంలో ఆడించాలని భావిస్తున్నారు.
India's Virat Kohli
Virat Kohli for T20I: వన్డే వరల్డ్ కప్ 2023లో టాప్ స్కోరర్ గా నిలిచిన విరాట్ కోహ్లి ఇక టీ20ల్లో ఆడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. వచ్చే ఏడాది జూన్ లో టీ20 వరల్డ్ కప్ జరగనుండగా.. కోహ్లి పేరును ఆ మెగా టోర్నీకి పరిశీలించకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ అధికారులు ఐదు గంటల పాటు చర్చలు జరిపారు.
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా కేవలం 6 టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడనుంది. సౌతాఫ్రికాతో మూడు, ఆఫ్ఘనిస్థాన్ తో మూడు ఆడాల్సి ఉంది. ఇప్పటికే సౌతాఫ్రికా సిరీస్ నుంచి రోహిత్, కోహ్లి, బుమ్రా తప్పుకున్నారు. ఇక ఆఫ్ఘనిస్థాన్ తో మాత్రమే మూడు మ్యాచ్ లు ఉంటాయి. వీటి ద్వారానే వరల్డ్ కప్ టీమ్ ఎంపిక చేయాల్సి ఉంటుంది.
రోహిత్, బుమ్రాలను జట్టులోకి తీసుకోవాలని అనుకుంటున్నా.. కోహ్లి స్థానమే అనుమానంగా మారినట్లు దైనిక్ జాగరన్ తన రిపోర్ట్ లో వెల్లడించింది. టీ20 వరల్డ్ కప్ జట్టును రోహిత్ శర్మనే లీడ్ చేయాలని బీసీసీఐ అధికారులు, సెలక్టర్లు భావిస్తున్నారు. నిజానికి గతేడాది టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ తర్వాత రోహిత్, కోహ్లి టీ20 ఫార్మాట్ లో ఆడలేదు.
అయితే వన్డే వరల్డ్ కప్ లో టీ20 స్టైల్లో చెలరేగిన రోహిత్ స్థానం జట్టులో ఖాయమైనా.. ఆ స్థాయి స్ట్రైక్ రేట్ తో పరుగులు చేయని కోహ్లికి మాత్రం స్థానం దక్కడం అనుమానమే. ఇదే విషయాన్ని బీసీసీఐ పెద్దలు కోహ్లికి చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఆ లెక్కన ఇక ఈ ఫార్మాట్ లో కోహ్లి కనిపించడం అనుమానమే. వరల్డ్ కప్ కోసం తన పేరు పరిశీలించడం లేదని కోహ్లికి బోర్డు అధికారులు వివరించే ప్రయత్నం చేయనున్నారు.
ఇక కోహ్లి మూడో స్థానం కోసం టీ20ల్లో ఇషాన్ కిషన్ పేరును పరిశీలిస్తున్నారు. మొదటి నుంచీ ధాటిగా ఆడే ప్లేయర్ కోసం బోర్డు చూస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారని జాగరణ్ తెలిపింది. ఈ స్థానంలో ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఆడిన ఇషాన్ మంచి స్ట్రైక్ రేట్ తో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ కోసం ఇషాన్ స్థానం ఖాయమైపోయినట్లే.
ఓపెనింగ్ స్థానాల్లో రోహిత్ తోపాటు యశస్వి లేదా శుభ్‌మన్ గిల్ ఉండే అవకాశం ఉంది. మూడో స్థానంలో ఇషాన్ ఉంటే.. ఆ తర్వాత సూర్యకుమార్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, జడేజాలతో బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుంది. ఆ లెక్కన కోహ్లికి జట్టులో స్థానం అనుమానమే. నిజానికి ఈ ఫార్మాట్లో ఆడేందుకు కోహ్లి కూడా ఆసక్తి చూపడం లేదు. అతడే ఈ విషయాన్ని బోర్డుకు చెప్పినా ఆశ్చర్యం లేదని సదరు బోర్డు అధికారి వెల్లడించారు.