తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Lockie Ferguson: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ బౌలర్.. నాలుగు ఓవర్లలో 0 పరుగులు, 3 వికెట్లు

Lockie Ferguson: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ బౌలర్.. నాలుగు ఓవర్లలో 0 పరుగులు, 3 వికెట్లు

Hari Prasad S HT Telugu

18 June 2024, 7:25 IST

google News
    • Lockie Ferguson: న్యూజిలాండ్ బౌలర్ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నాడు. తాను వేసిన నాలుగు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకపోవడం విశేషం.
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ బౌలర్.. నాలుగు ఓవర్లలో 0 పరుగులు, 3 వికెట్లు
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ బౌలర్.. నాలుగు ఓవర్లలో 0 పరుగులు, 3 వికెట్లు (X)

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ బౌలర్.. నాలుగు ఓవర్లలో 0 పరుగులు, 3 వికెట్లు

Lockie Ferguson: టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు నమోదైంది. అసలు టీ20 క్రికెట్ లోనే ఇలా జరగడం కేవలం రెండోసారి మాత్రమే. న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ చరిత్ర సృష్టించాడు. తాను వేసిన 4 ఓవర్లలో ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీయడం విశేషం. టీ20 క్రికెట్ లో ఇలాంటి రికార్డు సాధించడం మామూలు విషయం కాదు.

లాకీ ఫెర్గూసన్ రికార్డు

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా సోమవారం (జూన్ 17) న్యూజిలాండ్, పపువా న్యూ గినియా మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 7 వికెట్లతో సులువుగా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన పపువా టీమ్ 19.4 ఓవర్లలో కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. ఆ టీమ్ పతనంలో న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కీలకపాత్ర పోషించాడు.

అతడు 4 ఓవర్లు వేయగా.. అన్నీ మెయిడిన్ ఓవర్లే. అంటే ఈ నాలుగు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. పైగా పపువా టీమ్ లోని ముగ్గురు కీలక బ్యాటర్లను ఔట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇలాంటి రికార్డు గతంలో మరే బౌలర్ కు సాధ్యం కాలేదు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బాల్ అందుకున్న ఫెర్గూసన్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో పపువా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

టీ20ల్లో రెండో బౌలర్‌గా ఘనత

తొలి బంతికే అతడు వికెట్ తీసుకున్నాడు. పపువా కెప్టెన్ అసద్ వాలా (6)ను పెవిలియన్ కు పంపించాడు. అతని పేస్ ముందు పపువా బ్యాటర్లు నిలవలేకపోయారు. తన రెండో ఓవర్లో వికెట్ తీయకపోయినా ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. ఇక మూడో ఓవర్ రెండో బంతికి క్రీజులో నిలదొక్కుకున్న చార్ల్స్ అమిని (17)ని ఔట్ చేశాడు. ఫెర్గూసన్ నాలుగో ఓవర్ మూడో బంతికి రెండు పరుగులు వచ్చినా.. అవి లెగ్ బైస్ కావడంతో బౌలర్ ఖాతాలోకి వెళ్లవు.

నాలుగో ఓవర్లో చాద్ సోపర్ (1)ను ఔట్ చేసి టీ20 వరల్డ్ కప్ చరిత్రలో గతంలో ఎవరికీ సాధ్యం కాని 4-4-0-3 రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇలా 4 ఓవర్లూ మెయిడిన్ వేసిన రెండో బౌలర్ ఫెర్గూసన్. గతంలో కెనడాకు చెందిన సాద్ బిన్ జాఫర్ టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ లో పనామా జట్టుపై ఇదే ఘనతను సాధించాడు. అప్పుడు జాఫర్ 2 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఫెర్గూసన్ మూడో వికెట్ తో ఆ రికార్డును మరింత మెరుగుపరిచాడు.

టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్

టీ20 వరల్డ్ కప్ తొలి రౌండ్లోనే న్యూజిలాండ్ ఇంటిదారి పట్టింది. చివరి లీగ్ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకున్నా.. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ చేతుల్లో ఓడిపోయింది. దీంతో సూపర్ 8 చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఫేవరెట్ టీమ్స్ లో ఒకటిగా బరిలోకి దిగినా.. దారుణమైన బ్యాటింగ్ వైఫల్యంతో న్యూజిలాండ్ లీగ్ స్టేజ్ లోనే వెనక్కి వెళ్లిపోయింది.

చివరి లీగ్ మ్యాచ్ లోనూ పపువాపై 7 వికెట్లతో గెలిచినా.. ఇక్కడా ఆ టీమ్ బ్యాటర్లు అంత సులువుగా ఏమీ ఆడలేదు. 79 పరుగుల లక్ష్యాన్ని 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. ఈ మ్యాచ్ తో ఆ టీమ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ టీ20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

తదుపరి వ్యాసం