Netherlands captain: ఏ టీమ్‌నైనా ఓడిస్తాం.. ఏదో సరదాకి వరల్డ్ కప్ ఆడటం లేదు: నెదర్లాండ్స్ కెప్టెన్
18 October 2023, 14:37 IST
- Netherlands captain: ఏ టీమ్‌నైనా ఓడిస్తాం.. ఏదో సరదాకి వరల్డ్ కప్ ఆడటం లేదు అంటూ నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఇతర జట్లను హెచ్చరించాడు. వరల్డ్ కప్ 2023లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన తర్వాత అతడీ వార్నింగ్ ఇవ్వడం విశేషం.
నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్
Netherlands captain: వరల్డ్ కప్ 2023లో మరో సంచలన విజయం నమోదు చేసింది నెదర్లాండ్స్. ఏకంగా సౌతాఫ్రికాకే షాకిచ్చింది. ఇంగ్లండ్ పై ఆఫ్ఘనిస్థాన్ విజయాన్ని మరచిపోకముందే నెదర్లాండ్స్ సాధించిన ఈ విజయం.. వరల్డ్ కప్ ను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఈ నేపథ్యంలో ఇతర జట్లకు కూడా నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ వార్నింగ్ ఇవ్వడం విశేషం.
సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఎడ్వర్డ్స్.. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ ఏ టీమ్ నైనా ఓడిస్తామని స్పష్టం చేశాడు. "మేము ప్రతి మ్యాచ్ కూ మా ప్లాన్ ప్రకారం వెళ్తాం. గెలవడానికే ప్రయత్నిస్తాం. మా వరకూ మా అత్యుత్తమ క్రికెట్ ఆడటానికే ప్రయత్నిస్తాం. ఆ రోజు బాగా ఆడగలిగితే ఏ టీమ్ నైనా ఓడిస్తాం" అని ఎడ్వర్డ్స్ అన్నాడు.
క్వాలిఫయర్స్ లో తమకంటే ఎంతో మెరుగైన ఐర్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్ లాంటి టీమ్స్ కు షాకిచ్చి వరల్డ్ కప్ కు అర్హత సాధించింది నెదర్లాండ్స్. అవి గాలివాటం విజయాలు కాదని సౌతాఫ్రికాపై విజయంతో చాటి చెప్పింది. అంతేకాదు రానున్న రోజుల్లో ఇలాంటి విజయాలు మరిన్ని సాధిస్తామన్న హెచ్చరికలు కూడా జారీ చేసింది.
"టోర్నీకి క్వాలిఫై అయిన తర్వాత ఇందులో ఎలా ఆడాలో మేము ముందే నిర్ణయించుకున్నాం. మేమిక్కడికి వచ్చింది ఏదో సరదాగా ఆడి ఎంజాయ్ చేసి వెళ్లడానికి కాదు. మ్యాచ్ లు గెలిచి, తర్వాత స్టేజ్ కు అర్హత సాధించడమే మా లక్ష్యం. సౌతాఫ్రికా చాలా బలమైన జట్టు. ఆ టీమ్ సెమీఫైనల్ బెర్త్ కు దగ్గరవుతుంది. మేము కూడా ఆ స్థానానికి చేరువవ్వాలంటే అలాంటి జట్లను ఓడించాల్సిందే" అని ఎడ్వర్డ్స్ అన్నాడు.
సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ 38 పరుగులతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో డచ్ టీమ్ ఒక దశలో 140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కెప్టెన్ ఎడ్వర్డ్స్ 69 బంతుల్లోనే 78 పరుగులు చేసి ఆ టీమ్ ను 245 పరుగుల వరకూ తీసుకెళ్లాడు. ఆ తర్వాత బౌలింగ్ లోనూ రాణించి పటిష్టమైన సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను చిత్తు చేశారు.
టాపిక్