SA vs NED ODI World Cup : వరల్డ్‌కప్‍లో మరో సెన్సేషన్.. దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన నెదర్లాండ్స్
SA vs NED ODI World Cup 2023: వరల్డ్ కప్‍లో మరో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించి.. సెన్సేషన్ క్రియేట్ చేసింది.
SA vs NED ODI World Cup 2023 Match 15: వన్డే ప్రపంచకప్ 2023 మెగాటోర్నీలో మరో సెన్సేషన్ నమోదైంది. మొన్న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‍కు అఫ్గానిస్థాన్ భారీ షాకివ్వగా.. నేడు (అక్టోబర్ 17) బలమైన దక్షిణాఫ్రికాను పసికూన నెదర్లాండ్స్ చిత్తు చేసింది. దీంతో మరో భారీ అప్‍సెట్ నమోదైంది. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా ధర్మశాలలో నేడు (అక్టోబర్ 17) జరిగిన మ్యాచ్‍లో నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించింది.
వర్షం కారణంగా దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య ఈ మ్యాచ్ 43 ఓవర్లకు కుదింపు జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 43 ఓవర్లలో 8 వికెట్లకు 245 పరుగులు చేసి సత్తాచాటింది. టాపార్డర్ విఫలమైనా కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (69 బంతుల్లో 78 పరుగులు; నాటౌట్) అజేయ అర్ధ శతకంతో సత్తాచాటడం సహా టేలెండర్లు రాణించడంతో నెదర్లాండ్స్ మంచి స్కోరు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగ్డీ, మార్కో జాన్‍సెన్, కగిసో రబాడ చెరో రెండు వికెట్లు తీశారు. కోట్జీ, మహరాజ్‍కు చెరో వికెట్ దక్కింది. నెదర్లాండ్ బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో లక్ష్యఛేదనలో సఫారీ జట్టు కుదేలైంది. 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైన దక్షిణాఫ్రికా పరాజయం పాలైంది. డేవిడ్ మిల్లర్ (43), కేశవ్ మహారాజ్ (40) మినహా మరే సఫారీ బ్యాటర్ కూడా రాణించలేకపోయారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ మూడు, పౌల్ వాన్ మీకెరెన్, రూలఫ్ వాండర్ మెర్వ్, బాస్ డె లీడే చెరో రెండు వికెట్లతో రాణించగా.. కోలెన్ అకెర్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
పడి లేచిన నెదర్లాండ్స్
దక్షిణాఫ్రికా బౌలర్లు విజృభించటంతో ఓ దశలో 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది నెదర్లాండ్స్. స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించింది. అయితే, బ్యాటింగ్ ఆర్డర్ ఏడో స్థానంలో వచ్చిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలతో చెలరేగాడు. ఊహించని ప్రతిఘటనతో సఫారీ బౌలర్లు ఖంగుతిన్నారు. ఈ క్రమంలో 53 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు ఎడ్వర్డ్. అదే దూకుడు కొనసాగించి చివరి వరకు నిలిచాడు. స్కోరును మరింత వేగంగా పరుగులు పెట్టించాడు. చివర్లో రూలఫ్ వాండెర్ మెర్వ్ (19 బంతుల్లో 29 పరుగులు), ఆర్యన్ దత్ (9 బంతుల్లో 23; నాటౌట్) మెరుపులు మెరిపించటంతో నెదర్లాండ్స్ 43 ఓవర్లలో 245 పరుగుల మంచి స్కోరు చేసింది.
కుప్పకూలిన దక్షిణాఫ్రికా
నెదర్లాండ్స్ బౌలర్ల సమిష్టి విజృంభణతో లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా కుప్పకూలింది. సఫారీ కెప్టెన్ తెంబా బవూమా (16), క్వింటన్ డికాక్ (20) మోస్తరు ఆరంభాన్ని ఇచ్చినా.. ఆ తర్వాత రాసీ వాండర్ డుసెన్ (4), ఐడెన్ మార్క్‌రమ్ (1) విఫలమవటంతో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది దక్షిణాఫ్రికా. ఆ తర్వాత కూడా నెదర్లాండ్స్ బౌలర్లు పట్టు సడలకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. హెన్రిచ్ క్లాసెన్ (28) కాసేపు పోరాడి ఔటయ్యాడు. మరో ఎండ్‍లో డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం చేసి జట్టును గెట్టెక్కిద్దామని ప్రయత్నించాడు. అయితే, అతడిని నెదర్లాండ్స్ బౌలర్ వాన్ బీక్ ఔట్ చేసి.. దక్షిణాఫ్రికాను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత గెరాల్డ్ కొట్జే (22) కాసేపు నిలిచాడు. రబాడ (9) విఫలమయ్యాడు. ఆలౌట్ కాకుండా సఫారీ టేలెండర్లు కేశవ్ మహారాజ్, లుంగీ ఎంగ్డీ (7 నాటౌట్) గట్టిగా నిలిచారు. అయితే చివరి ఓవర్లో మహారాజ్ ఔటయ్యాడు. కేశవ్ మహారాజ్ చివర్లో అద్భుతంగా పోరాడినా అప్పటికే రన్ రేట్ చేయి దాటిపోయింది.