Netherlands bowler: కోహ్లికి చెప్పకండి.. అతన్ని ఇలా ఔట్ చేస్తా: నెదర్లాండ్స్ బౌలర్ ఫన్నీ వీడియో వైరల్
29 September 2023, 10:16 IST
- Netherlands bowler: కోహ్లికి చెప్పకండి.. అతన్ని ఇలా ఔట్ చేస్తా అంటూ నెదర్లాండ్స్ బౌలర్ లోగాన్ వాన్ బీక్ చేసిన ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. అతన్ని ఔట్ చేయడానికి సాయం చేయాలని క్రికెట్ దేవుళ్లనే తాను ప్రార్థిస్తానని అతడు అనడం విశేషం.
నెదర్లాండ్స్ బౌలర్ లోగాన్ వాన్ బీక్
Netherlands bowler: కోహ్లి వికెట్ తీయడం ప్రపంచంలో ఎలాంటి బౌలర్ కైనా ఓ కల. అలాంటిది నెదర్లాండ్స్ లాంటి క్రికెట్ పసికూన.. ఆ టీమ్ లోని బౌలర్లకు విరాట్ కోహ్లి వికెట్ తీయడం అంటే మాటల కాదు. అందుకే తాను కోహ్లి వికెట్ తీయడంలో సాయం చేయాలని ఆ క్రికెట్ దేవుళ్లని ప్రార్థించడం తప్ప చేసేదేమీ లేదని ఆ టీమ్ బౌలర్ లోగాన్ వాన్ బీక్ అనడం విశేషం.
ఇప్పుడీ నెదర్లాండ్స్ బౌలర్ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. వరల్డ్ కప్ లో భాగంగా ఆ టీమ్ ఇండియాతో ఆడనుంది. దీంతో సహజంగానే ఆ టీమ్ లోని ప్రతి బౌలర్ కూడా విరాట్ కోహ్లి వికెట్ కోసం కలలు కంటుంటారు. ప్రత్యేకంగా అతని కోసం ప్లాన్స్ కూడా వేస్తుంటారు. డచ్ బౌలర్ లోగాన్ వాన్ బీక్ కూడా అదే పని చేస్తున్నాడు. అయితే ఆ ప్లాన్ ను అతడు చాలా ఫన్నీగా చెబుతూ.. ఈ విషయం కోహ్లికి చెప్పకండి అని అనడం నవ్వు తెప్పించింది.
క్రికెట్ దేవుళ్లే కాపాడాలి
నెదర్లాండ్స్, ఇండియా మ్యాచ్ నవంబర్ 12న బెంగళూరులో జరగనుంది. అక్కడి చిన్నస్వామి స్టేడియం కోహ్లికి సెకండ్ హోమ్. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఇదే గ్రౌండ్లో అతడు పరుగుల వరద పారించాడు. అలాంటి స్టేడియంలో కోహ్లికి అడ్డుకట్ట వేయడం నెదర్లాండ్స్ బౌలర్లకు తలకు మించిన భారమే. ఈ నేపథ్యంలో క్రిక్‌ట్రాకర్ తో మాట్లాడిన లోగాన్ వాన్ బీక్.. కోహ్లి కోసం ఎలాంటి ప్లాన్ వేశాడో చెప్పాడు.
"విరాట్ కోహ్లికి బౌలింగ్ చేసేటప్పుడు తొలి రెండు బంతులను ఔట్ స్వింగర్లుగా వేస్తాను. ఆ తర్వాత ఓ స్లో బాల్ ఆఫ్ కటర్ వేస్తాను. ఆ బంతిని అతడు ఫోర్ కొడతాడు. నేను వెనక్కి వెళ్లి చాలా నిరాశ చెందినట్లు నటిస్తాను. ఆటను ఓ ఐదు నిమిషాలు ఆపేస్తాను. కెప్టెన్ ను పిలిచి ఏదో ఒక వైపుకు చూపిస్తూ అటే బౌలింగ్ చేయబోతున్నట్లు నటిస్తాను. కానీ నేను అలా బౌలింగ్ చేయను. నేను అతన్ని బోల్తా కొట్టిస్తాను" అని అంటూ చెబుతూ వెళ్లాడు.
అతడు ఇంకా ఏమన్నాడంటే.. "నాలుగో బంతికి ఓ మంచి హాఫ్ వాలీ వేస్తాను. అతడు నన్ను మరో ఫోర్ బాదుతాడు. స్టాండ్స్ లో అభిమానులు అరుస్తూ ఉంటారు. అప్పుడు కోహ్లి గర్వంగా ఫీలవుతూ తనకు తాను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని ఫీలవుతూ ఉంటాడు. నిజానికి అతడు అదే.
అతన్ని అలా అనుకునేలా చేయడమే నా లక్ష్యం. ఇక ఐదో బంతి వేయడానికి సిద్ధమవుతాను. ఈ బంతికి నేను క్రికెట్ దేవుళ్లను ప్రార్థిస్తాను. మీకోసం ఏమైనా చేస్తాను.. కోహ్లి వికెట్ మాత్రం ఇవ్వండని అడుగుతాను. తర్వాత కళ్లు మూసుకొని ఆ ఐదో బంతి వేస్తాను. అంతే.. కోహ్లి ఔటవుతాడు. ఈ విషయం కోహ్లికి చెప్పకండి" అని వాన్ బీక్ సరదాగా అన్నాడు.