తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kkr Vs Dc: ఈడెన్‍లో ఢిల్లీని చిత్తు చేసిన కోల్‍కతా.. మళ్లీ దుమ్మురేపిన ఫిల్ సాల్ట్

KKR vs DC: ఈడెన్‍లో ఢిల్లీని చిత్తు చేసిన కోల్‍కతా.. మళ్లీ దుమ్మురేపిన ఫిల్ సాల్ట్

29 April 2024, 23:26 IST

google News
    • IPL 2024 KKR vs DC: హోం గ్రౌండ్ ఈడెన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ దుమ్మురేపింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చిత్తుగా ఓడించింది. ఫిల్ సాల్ట్ మెరుపు అర్ధ శతకంతో అదరగొట్టాడు.
KKR vs DC: ఈడెన్‍లో ఢిల్లీని చిత్తు చేసిన కోల్‍కతా.. మళ్లీ దుమ్మురేపిన ఫిల్ సాల్ట్
KKR vs DC: ఈడెన్‍లో ఢిల్లీని చిత్తు చేసిన కోల్‍కతా.. మళ్లీ దుమ్మురేపిన ఫిల్ సాల్ట్ (PTI)

KKR vs DC: ఈడెన్‍లో ఢిల్లీని చిత్తు చేసిన కోల్‍కతా.. మళ్లీ దుమ్మురేపిన ఫిల్ సాల్ట్

KKR vs DC IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతా నైట్ రైడర్స్ మరోసారి ఆల్‍రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‍లో సత్తాచాటి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును సునాయాసంగా చిత్తుచేసింది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేడు (ఏప్రిల్ 29) జరిగిన పోరులో హోం టీమ్ కోల్‍కతా ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. ఈ సీజన్‍లో 9 మ్యాచ్‍ల్లో ఆరో గెలుపుతో నైట్‍రైడర్స్ సత్తాచాటింది.

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. 9వ స్థానంలో బ్యాటింగ్‍కు వచ్చిన కుల్దీప్ యాదవ్ (26 బంతుల్లో 35 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (27) కూడా వేగంగా ఆడలేకపోయాడు. పృథ్వి షా (13)తో పాటు ఫామ్‍లో ఉన్న జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (12) కూడా త్వరగా ఔటయ్యారు. మిగిలిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు విఫలమయ్యారు. కుల్దీప్ రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.

కోల్‍కతా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయాల్లో మూడు వికెట్లు తీశాడు. ఢిల్లీ బ్యాటర్లపై పూర్తిగా ఒత్తిడి పెట్టాడు. పేసర్లు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా తలా రెండు వికెట్లతో రాణించారు. స్టార్క్, నరైన్ చెరో వికెట్ తీసుకున్నారు.

దంచికొట్టిన సాల్ట్

ఈ మోస్తరు లక్ష్యాన్ని కోల్‍కతా నైట్‍రైడర్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. 16.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 157 పరుగులు చేసి విజయం సాధించింది. కోల్‍కతా ఓపెనర్ ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 68 పరుగులు; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) మరోసారి రెచ్చిపోయాడు. మెరుపు అర్ధ శతకంతో లక్ష్యాన్ని కరిగించేశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి ఢిల్లీని ఆత్మరక్షణలో పాడేశాడు. బౌండరీలతో సాల్ట్ చెలరేగాడు. సునీల్ నరైన్ (15) ఔటైనా తాను మాత్రం దుమ్మురేపాడు. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరాడు సాల్ట్. ఆ తర్వాత కూడా దూకుడు కనబరిచాడు. అయితే, 9వ ఓవర్లో అక్షర్ బౌలింగ్‍లో సాల్ట్ ఔటయ్యాడు. సూపర్ ఫామ్‍లో ఉన్న ఫిల్ సాల్ట్‌కు ఈ సీజన్‍లో ఇది నాలుగో హాఫ్ సెంచరీ.

రింకూ సింగ్ (11) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. చివర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (23 నాటౌట్) నిలకడగా ఆడి జట్టును గెలిపించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి అలవోకగా జట్టును విజయ తీరం దాటించారు.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. లిజాడ్ విలియమ్స్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

రెండో ప్లేస్‍లోనే కోల్‍కతా

ఈ మ్యాచ్‍లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో కోల్‍కతా కొనసాగింది. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో ఆరు గెలిచి.. 12 పాయింట్లతో కేకేఆర్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్‍ల్లో 6 ఓడి, ఐదు గెలిచింది. ఇక ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశలు నిలువాలంటే లీగ్ దశలో మిగిలిన మూడు మ్యాచ్‍లను తప్పక గెలవాల్సిందే.

తదుపరి వ్యాసం