KKR vs DC: ఢిల్లీని ఆదుకున్న కుల్దీప్ యాదవ్.. తిప్పేసిన కోల్‍కతా స్పిన్నర్ వరుణ్-kkr vs dc update ipl 2024 kolkata knight riders bowlers rattles delhi capitals kuldeep yadav shines with bat ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kkr Vs Dc: ఢిల్లీని ఆదుకున్న కుల్దీప్ యాదవ్.. తిప్పేసిన కోల్‍కతా స్పిన్నర్ వరుణ్

KKR vs DC: ఢిల్లీని ఆదుకున్న కుల్దీప్ యాదవ్.. తిప్పేసిన కోల్‍కతా స్పిన్నర్ వరుణ్

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 29, 2024 09:34 PM IST

KKR vs DC IPL 2024: ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‍కతా నైట్ రైడర్స్ బౌలర్లు సత్తాచాటారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. అయితే, 9వ స్థానంలో బ్యాటింగ్‍కు వచ్చిన కుల్‍దీప్ జట్టును ఆదుకున్నాడు.

KKR vs DC: ఢిల్లీని బ్యాట్‍తో ఆదుకున్న కుల్దీప్ యాదవ్.. తిప్పేసిన కోల్‍కతా స్పిన్నర్ వరుణ్
KKR vs DC: ఢిల్లీని బ్యాట్‍తో ఆదుకున్న కుల్దీప్ యాదవ్.. తిప్పేసిన కోల్‍కతా స్పిన్నర్ వరుణ్ (AP)

KKR vs DC IPL 2024: బ్యాటర్ల ఆధిపత్యంతో భారీ స్కోర్లు నమోదవుతున్న ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (ఏప్రిల్ 29) సీన్ కాస్త మారింది. కోల్‍కతా నైట్‍రైడర్స్ బౌలర్లు సమిష్టిగా సత్తాచాటి.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నిలువరించారు. కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేడు జరిగిన మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. బ్యాటింగ్ ఆర్డర్లో 9వ స్థానంలో వచ్చిన కుల్‍దీప్ యాదవ్ (26 బంతుల్లో 35 పరుగులు నాటౌట్; 5 ఫోర్లు, ఓ సిక్స్) ఢిల్లీకి టాప్ స్కోరర్‌గా నిలిచి ఆదుకున్నాడు. జట్టు తక్కువ స్కోరుకే ఆలౌటవుతుందని అనుకున్న సమయంలో చివరి వరకు నిలిచి కీలక రన్స్ చేశాడు.

సమిష్టిగా సత్తాచాటిన బౌలర్లు

కోల్‍కతా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‍లో అదరగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ (27), ట్రిస్టన్ స్టబ్స్ (4), కుమార్ కుశాగ్రా (1)ను ఔట్ చేశాడు. కోల్‍కతా పేసర్లు వైభవ్ అరోరా, హర్షిత్ రానా కూడా చెరో రెండు వికెట్లు తీశారు. సునీల్ నరేన్, మిచెల్ స్టార్క్ కూడా చెరో వికెట్ తీశారు. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‍లోనూ ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ప్లేయర్ మిచెల్ స్టార్క్ 3 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు.

ఢిల్లీ టపటపా

టాస్ గెలిచి ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఓపెనర్ పృథ్వి షా (13) దూకుడుగా ఆరంభించినా.. రెండో ఓవర్లో కోల్‍కతా పేసర్ వైభవ్ ఆరోరా బౌలింగ్‍లో ఔటయ్యాడు. ఫుల్ ఫామ్‍లో ఉన్న జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (12)ను మిచెల్ స్టార్క్ మూడో ఓవర్లో ఔట్ చేశాడు. షాయ్ హోప్ (6)ను కోల్‍కతా పేసర్ ఆరోరా అద్భుత బంతితి బౌల్డ్ చేశాడు. దీంతో 37 పరుగులకే 3 వికెట్లతో ఢిల్లీ కష్టాల్లో పడింది.

అభిషేక్ పోరెల్ (18) వేగంగా ఆడలేకపోయాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (20 బంతుల్లో 27 పరుగులు) కాసేపు నిలిచాడు. అయితే, 11వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. ట్రిస్టన్ స్టబ్స్ (4), అక్షర్ పటేల్ (15), కుమార్ కుషాగ్రా (1) రాణించలేకపోయారు. త్వరగానే ఔటయ్యారు. దీంతో 111 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఢిల్లీ త్వరగా కుప్పకూలేలా కనిపించింది.

ఆదుకున్న కుల్దీప్

ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్యాట్‍తో ఢిల్లీని ఆదుకున్నాడు. బ్యాటర్లు విఫలమైన పిచ్‍పై టేలెండర్‌గా తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‍కు వచ్చిన అతడు టాప్ స్కోరర్ అయ్యాడు. క్రమంగా పరుగులు బాడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఢిల్లీకి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. 26 బంతుల్లోనే అజేయంగా 35 పరుగులు చేశాడు కుల్దీప్. 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో మెరిపించాడు. రసిక్ సలామ్ (8) అతడికి సహకరించాడు. చివరి వరకు నిలిచి ఢిల్లీకి పోరాడే మోస్తరు స్కోరు అందించాడు కుల్దీప్.

IPL_Entry_Point