Kane Williamson: విరాట్ కోహ్లి రికార్డు సమం చేసిన కేన్ విలియమ్సన్.. అయినా కష్టాల్లోనే న్యూజిలాండ్
29 November 2023, 17:06 IST
- Kane Williamson: టెస్టుల్లో విరాట్ కోహ్లి రికార్డు సమం చేశాడు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్. అయితే బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో మాత్రం న్యూజిలాండ్ ఇంకా కష్టాల్లోనే ఉంది.
టెస్టుల్లో 29వ సెంచరీ చేసిన కేన్ విలియమ్సన్
Kane Williamson: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ టెస్టుల్లో మరో సెంచరీ బాదాడు. ఈ క్రమంలో అతడు విరాట్ కోహ్లి సెంచరీల రికార్డును సమం చేశాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజైన బుధవారం (నవంబర్ 29) విలియమ్సన్ ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో అతనికి ఇది 29వ సెంచరీ కావడం విశేషం.
టెస్టుల్లో విరాట్ కోహ్లి కూడా ఇప్పటి వరకూ 29 సెంచరీలు చేశాడు. అయితే కోహ్లి కంటే 16 టెస్టులు తక్కువ ఆడిన విలియమ్సన్ అప్పుడే అతని సెంచరీల రికార్డును సమం చేశాడు. కేన్ సెంచరీ చేసినా న్యూజిలాండ్ మాత్రం ఇంకా కష్టాల్లోనే ఉంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 310 రన్స్ చేయగా.. న్యూజిలాండ్ 266 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
ఆదుకున్న విలియమ్సన్
రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు లేథమ్ (21), కాన్వే (12) విఫలమయ్యారు. స్కోరు 36 పరుగుల దగ్గర క్రీజులోకి వచ్చిన విలియమ్సన్.. తన జట్టును ఆదుకున్నాడు. బంగ్లాదేశ్ స్పిన్నర్ల ధాటికి ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. కేన్ మాత్రం ఎంతో ఓపిగ్గా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు కదిలించాడు.
ఈ క్రమంలో 189 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విలియమ్సన్ తన 95వ టెస్టులో 29వ సెంచరీ చేయడం విశేషం. కోహ్లి తన 111వ టెస్టులో ఈ మైలురాయి అందుకున్నాడు. ఇక టెస్టుల్లో డాన్ బ్రాడ్‌మన్ సెంచరీల రికార్డును కూడా కేన్ సమం చేశాడు. బ్రాడ్‌మన్ అయితే కేవలం 52 టెస్టుల్లోనే ఈ 29 సెంచరీలు చేశాడు.
2010 నుంచి న్యూజిలాండ్ కు ఆడుతున్న విలిమయ్సన్ ఆ టీమ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో విలియమ్సన్ కు ఇది వరుసగా నాలుగో సెంచరీ కావడం విశేషం. ఈ ఏడాది ఇంగ్లండ్, శ్రీలంకలపై అతడు వరుసగా మూడు సెంచరీలు బాదాడు. 2023-25 టెస్ట్ సైకిల్లో న్యూజిలాండ్ ఆడుతున్న తొలి టెస్ట్ ఇదే.
టాపిక్