తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ishan Kishan: రాహుల్ ద్రవిడ్ ఆదేశాలను మరోసారి ధిక్కరించిన ఇషాన్ కిషన్.. మరిన్ని చిక్కుల్లో పడనున్నాడా?

Ishan Kishan: రాహుల్ ద్రవిడ్ ఆదేశాలను మరోసారి ధిక్కరించిన ఇషాన్ కిషన్.. మరిన్ని చిక్కుల్లో పడనున్నాడా?

19 January 2024, 14:12 IST

google News
    • Ishan Kishan: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆదేశాలను యంగ్ వికెట్ కీపింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మరోసారి ధిక్కరించాడు. దీంతో అతడు భారత జట్టుకు తిరిగి రావడం మరింత కష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలివే..
Ishan Kishan: రాహుల్ ద్రవిడ్ ఆదేశాలను మరోసారి ధిక్కరించిన ఇషాన్ కిషన్..
Ishan Kishan: రాహుల్ ద్రవిడ్ ఆదేశాలను మరోసారి ధిక్కరించిన ఇషాన్ కిషన్.. (AFP)

Ishan Kishan: రాహుల్ ద్రవిడ్ ఆదేశాలను మరోసారి ధిక్కరించిన ఇషాన్ కిషన్..

Ishan Kishan: భారత యువ వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ విషయం సందిగ్ధంగా మారింది. మానసిక ఆరోగ్యం సరిగా లేదంటూ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడలేదు ఇషాన్. బీసీసీఐ నుంచి సెలవు తీసుకున్నాడు. అయితే, ఆ తర్వాత అతడు దుబాయ్‍కు వెళ్లి స్నేహితులతో ఎంజాయ్ చేశాడు. దీంతో బీసీసీఐ అతడిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల అఫ్గానిస్థాన్‍తో జరిగిన మూడు టీ20ల జట్టులోనూ ఇషాన్ కిషన్‍కు చోటు దక్కలేదు. అతడే మళ్లీ బ్రేక్ కోరాడు. దీంతో మళ్లీ భారత జట్టులోకి రావాలంటే ఇషాన్ కిషన్.. దేశవాళీ క్రికెట్ ఆడాలని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆదేశించాడు.

ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బరిలోకి దిగి ఫిట్‍నెస్ నిరూపించుకుంటే ఇషాన్ కిషన్‍ను ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‍కు తీసుకోవాలని టీమిండియా మేనేజ్‍మెంట్ భావించింది. అయితే, ద్రవిడ్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‍లు ఆడలేదు ఇషాన్. అయితే, ఇప్పుడు ఈ సీజన్‍లో నేడు మొదలైన మూడో మ్యాచ్‍లోనూ ఇషాన్ కిషన్ బరిలోకి దిగలేదు. దీంతో ద్రవిడ్ ఆదేశాలను మరోసారి అతడు ధిక్కరించినట్టయింది.

ఇప్పటికే ఇంగ్లండ్‍తో ఐదు టెస్టుల సిరీస్‍లో తొలి రెండు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధృవ్ జురెల్‍ను తీసుకుంది. రంజీల్లో ఫిట్‍నెస్ నిరూపించుకుంటే తదుపరి మూడు టెస్టులకు కిషన్‍ను పరిగణించాలని అనుకుంది. అయితే, ఇషాన్ కిషన్ రంజీలు ఆడకపోతుండడంతో అతడు భారత జట్టులోకి పునరాగమనం చేయడం కష్టంగా మారుతోంది.

మరిన్ని చిక్కులు తప్పవా?

తన మానసిక ఆరోగ్యం గురించి ఒకవేళ బీసీసీఐకు మళ్లీ అప్‍డేట్ ఇవ్వకుండానే మూడు రంజీ మ్యాచ్‍లకు ఇషాన్ కిషన్ డుమ్మా కొట్టినట్టయితే.. అతడి కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. బీసీసీఐ అతడిపై కఠిన చర్యలు తీసుకుంటుందని వినిపిస్తోంది. భారత జట్టులో అతడి రీఎంట్రీ చాలా కష్టంగా మారేలా కనిపిస్తోంది. దీంతో ఇషాన్‍ కెరీర్లో మరిన్ని చిక్కులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.

టీమిండియా తరఫున ఇషాన్ కిషన్ టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నాడా లేదా అనే విషయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వదేశంలో కీలకమైన ఇంగ్లండ్ సిరీస్‍కు ముందు హెడ్ కోచ్ ఆదేశాలను ధిక్కరించి రంజీ ట్రోఫీ మ్యాచ్‍లకు ఇషాన్ డుమ్మా కొట్టడంతో ఈ టాక్ వినిపిస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ 2023-25 సైకిల్‍లో ఇంగ్లండ్‍తో సిరీస్ భారత్‍కు చాలా కీలకంగా ఉంది. ఇలాంటి సిరీస్ ముందు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఇషాన్ విముఖంగా ఉండడం అతడి కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

అయితే, రంజీ ట్రోఫీ మ్యాచ్‍లు ఎందుకు ఆడడం లేదో అతడు బీసీసీఐకి ఇప్పటికే తెలియజేసి ఉంటే ఇషాన్ కిషన్ సేఫ్‍గా ఉన్నట్టే. అలా కాకుండా సమాచారం ఇవ్వకుండా మ్యాచ్‍లు ఆడకపోతుంటే మాత్రం అతడిపై బీసీసీఐ.. కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. మరి ఇషాన్ విషయంలో ఏం జరగనుందో చూడాలి.

తదుపరి వ్యాసం