IPL 2024 Orange Cap Purple Cap: కోహ్లి ఆరెంజ్ క్యాప్‌కు సంజూ శాంసన్ నుంచి పొంచి ఉన్న ముప్పు
08 May 2024, 7:52 IST
- IPL 2024 Orange Cap Purple Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లికి సంజూ శాంసన్ చేరువయ్యాడు. మంగళవారం (మే 7) ఢిల్లీతో మ్యాచ్ లో తన జట్టును గెలిపించకపోయినా హాఫ్ సెంచరీతో మూడో స్థానానికి దూసుకెళ్లాడు.
కోహ్లి ఆరెంజ్ క్యాప్‌కు సంజూ శాంసన్ నుంచి పొంచి ఉన్న ముప్పు
IPL 2024 Orange Cap Purple Cap: విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ నుంచి ముప్పు వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ పై మెరుపు హాఫ్ సెంచరీతో శాంసన్ ఈ లిస్టులో మూడో స్థానానికి దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్ లో అతడు 86 రన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాయల్స్ 20 పరుగుల దూరంలోనే ఆగిపోయింది.
ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్
ఐపీఎల్ 2024 మొదట్లో వరుస విజయాలతో దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయి ఇప్పటికీ ప్లేఆఫ్స్ కు చేరలేకపోయింది. అయితే ఆ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్ 11 మ్యాచ్ లలో 471 రన్స్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో శాంసన్ 46 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్స్ లతో 86 రన్స్ చేశాడు. తన టీమ్ ను గెలిపించలేకపోయినా ఆరెంజ్ క్యాప్ రేసులో ముందడుగు వేశాడు.
ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లియే 542 పరుగులతో టాప్ లో ఉన్నాడు. అతడు 11 మ్యాచ్ లు ఆడేశాడు. ఇక తర్వాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 541 పరుగులతో ఉన్నాడు. కోహ్లి కంటే కేవలం ఒక్క పరుగు వెనుకే ఉన్నాడు. ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసులో ఆర్సీబీ వెనుకబడటం, రాయల్స్, సీఎస్కేలకు అవకాశం ఉండటంతో కోహ్లిని వెనక్కి నెట్టి రుతురాజ్, సంజూ శాంసన్ రేసులో ముందుకు దూసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక 461 పరుగులతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ సునీల్ నరైన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. సన్ రైజర్స్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ 444 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆరో స్థానంలో మరో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్ 436 పరుగులతో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో అతడు 27 రన్స్ చేశాడు.
ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్
ఇక ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తర్వాత టాప్ లో ఎలాంటి మార్పులు జరగలేదు. బుమ్రా 18 వికెట్లతో టాప్ లో కొనసాగుతుండగా.. పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ 17 వికెట్లతో రెండో స్థానంలో, కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి 16 వికెట్లతో మూడో స్థానంలో, సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్ 15 వికెట్లతో నాలుగో స్థానంలో, అర్ష్‌దీప్ సింగ్ 15 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టాప్ 10లోకి దూసుకొచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 14 వికెట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. రాయల్స్ తో మ్యాచ్ లో కుల్దీప్.. 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఇక ముంబై, పంజాబ్ కూడా ప్లేఆఫ్స్ పై దాదాపు ఆశలు వదిలేసుకున్న టాప్ లో ఉన్న బుమ్రా, హర్షల్ పటేల్ స్థానాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
టాపిక్