Ajinkya Rahane New Car: లగ్జరీ కారు కొనుగోలు చేసిన అజింక్య రహానే.. ధర ఎంతంటే!
21 February 2024, 17:33 IST
- Ajinkya Rahane - Mercedes Maybach GLS: భారత సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే కొత్త కారు కొన్నారు. మెర్సెజెడ్‍కు చెందిన లగ్జరీ కారు తీసుకున్నారు. కారు మోడల్, ధర వివరాలివే..
Ajinkya Rahane New Car: లగ్జరీ కారు కొనుగోలు చేసిన అజింక్య రహానే.. ధర ఎంతంటే!
Ajinkya Rahane Car: సీనియర్ బ్యాటర్ అజింక్య రహానేకు టీమిండియాలో చోటు దక్కడం లేదు. యువ ఆటగాళ్లకు సెలెక్టర్లు మొగ్గు చూపుతుండటంతో అతడికి నిరాశే ఎదురవుతుంది. అయినా నిరాశ చెందకుండా మళ్లీ భారత జట్టులోకి రావడమే లక్ష్యంగా దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో రహానే ఆడుతున్నాడు. రంజీల్లో ముంబైకు కెప్టెన్‍గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అంజిక్య రహానే ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.
‘మెర్సెడెజ్ మేబాచ్ జీఎల్ఎస్ 600’ కారును అజింక్య రహానే కొత్తగా కొనుగోలు చేశాడు. పోలార్ వైట్ కలర్ వేరియంట్‍ను తీసుకున్నాడు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి. కొత్త కారు వద్ద రహానే, అతడి భార్య రాధిక దిగిన ఫొటోలు వెల్లడయ్యాయి.
ధర ఇదే..
మెర్సెడెజ్ మేబాచ్ జీఎల్ఎస్ 600 ఎస్‍యూవీ ధర ప్రారంభ రూ.2.96 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కళ్లు చెదిరేలా ఉన్న ఈ లగ్జరీ కారును రహానే కొనుగోలు చేశారు.
సెలెబ్రిటీస్ సర్కిల్‍లో మేబాచ్ జీఎల్ఎస్ మోడల్ చాలా ఫేమస్. చాలా మంది ప్రముఖులు ఇప్పటికే ఈ లగ్జరీ కారును తీసుకున్నారు. వైట్ కలర్ షేడ్‍లో ఉండే వేరియంట్లనే ఎక్కువగా ఎంపిక చేసుకుంటుంటారు.
స్పెసిఫికేషన్లు
మెర్సెడెజ్ మేబాచ్ జీఎల్ఎస్ 600 లగ్జరీ కారు 4.0 లీటర్ బై టర్బో వీ8 ఇంజిన్‍తో వస్తుంది. 542 బీపీహెచ్, 730 ఎన్ఎం వరకు పీక్ టార్క్యూను ఇది జనరేట్ చేయగలదు. 21 బీపీహెచ్, 250 ఎన్ఎం టార్క్యూ ఉండే ఈక్యూ బూస్ట్ 48వోల్ట్ మైల్డ్ హైబ్రీడ్ సిస్టమ్‍ను కూడా అదనంగా కలిగి ఉంటుంది. 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఈ కారు గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి 4.9 సెకన్లలోనే యాక్సలరేట్ అవగలదు. టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు (Kmph)గా ఉంది.
డిస్టింక్టివ్ క్రోమ్డ్ ఔట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‍ల్యాంప్స్, 22 ఇంచుల అలాయ్ వీల్స్‌ను ఈ కారు కలిగి ఉంది. ఈ కారు బొనెట్, బీ-పిల్లర్‌పై మేబాచ్ బ్యాడ్జ్ ఉంటుంది. లుక్ పరంగా చాలా ప్రీమియంగా ఈ లగ్జరీ ఎస్‍యూవీ కనిపిస్తుంది.
ప్యాకేజీని బట్టి ఫోర్, ఫైవ్ సీటర్‌గా మెర్సెడెజ్ మేబాచ్ జీఎల్ఎస్ 600 ఎస్‍యూవీ ఉంటుంది. నప్పా లెదర్ అప్‍హోల్సరీ, పనారోమిక్ సన్‍రూఫ్, మాసాజ్, వెంటిలేషన్ లాంటి ఫీచర్లు ఉండే రిక్లైనింగ్ సీట్లు ఈ కారులో ఉంటాయి. మరిన్ని అధునాతన ఫీచర్లను ఈ ఎస్‍యూవీ కలిగి ఉంటుంది. రెండో వరుసలో ఎక్స్‌టెండ్ చేసుకునేలా ఫోల్డింగ్ టేబుల్స్, బుల్టిన్ రిఫ్రిజిరేటర్ సదుపాయాలు కూడా ఉంటాయి. మొత్తంగా ప్రీమియం లగ్జరీ ఫీచర్లతో ఈ కారు అదిరిపోయేలా ఉంటుంది.
రహానే కెరీర్
అజింక్య రహానే చివరగా టీమిండియా తరఫున 2023 జూలైలో వెస్టిండీస్‍తో టెస్టు ఆడాడు. ఆ తర్వాత టీమ్‍లో చోటు కోల్పోయాడు. రహానే బాగానే ఆడుతున్నా యువకులు రావటంతో అతడికి చోటు దక్కడం కష్టంగా మారింది. అయితే, టీమిండియాలోకి మళ్లీ వెళ్లాలనే పట్టుదలతో రంజీల్లో ముంబై జట్టుకు ఆడుతున్నాడు రహానే.
రహానే ఇప్పటి వరకు టీమిండియా తరఫున 85 టెస్టులు ఆడి 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధ శతకాలు ఉన్నాయి. చాలాసార్లు కీలకమైన ఇన్నింగ్స్ ఆడి టెస్టుల్లో జట్టును ఆదుకున్నాడు రహానే. అలాగే, కొన్ని మ్యాచ్‍ల్లో కెప్టెన్‍గానూ వ్యవహరించి చిరస్మరణీయ విజయాలు అందించాడు. భారత్ తరఫున 90 వన్డేలు, 20 అంతర్జాతీయ టీ20లు కూడా ఆడాడు. ఐపీఎల్‍లో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అజింక్య ఉన్నాడు.