India vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరిగేది అనుమానమే.. ఇదీ కారణం
31 August 2023, 13:25 IST
- India vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరిగేది అనుమానంగా మారింది. ఆసియా కప్ లో భాగంగా శనివారం (సెప్టెంబర్ 2) ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే క్యాండీలోని పల్లెకెలెలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి.
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ పై నీలి మేఘాలు
India vs Pakistan: ఆసియా కప్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. అసలు ఈ మ్యాచ్ జరిగేది అనుమానంగా మారింది. మ్యాచ్ జరగాల్సిన శ్రీలంకలోని పల్లెకెలెలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మ్యాచ్ జరగాల్సిన శనివారం (సెప్టెంబర్ 2) కూడా 91 శాతం వర్షం కురిసే అవకాశాలే ఉండటం గమనార్హం.
దీంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరిగేది అనుమానమే. సాధారణంగా ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. దీంతో అక్కడ అద్భుతం జరుగుతుందని కూడా ఆశించలేం. ఈ రెండు నెలల్లో అసలు క్రికెట్ మ్యాచ్ లు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం ఏకంగా ఆసియా కప్ నే నిర్వహిస్తున్నారు.
పల్లెకెలె స్టేడియంలో ఇప్పటి వరకూ 33 వన్డేలు జరిగాయి. వాటిలో కేవలం 3 వన్డేలు మాత్రమే ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో జరగడం విశేషం. దీనినిబట్టే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కానీ చివరి నిమిషంలో పాకిస్థాన్ తోపాటు శ్రీలంకలోనూ ఆసియా కప్ నిర్వహించాలని నిర్ణయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీలంక బోర్డు ఈ టైమ్ లో మ్యాచ్ లకు అంగీకరించింది.
గురువారం (ఆగస్ట్ 31) ఇదే పల్లెకెలె స్టేడియంలో శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ కు కూడా అడ్డంకులు తప్పకపోవచ్చు. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉండటంతో మ్యాచ్ సమయానికి గ్రౌండ్ సిద్ధం చేయడం కూడా అక్కడి సిబ్బందికి సవాలే. ఆ లెక్కన శనివారం వరుణుడు కరుణిస్తేనే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ పై ఆశలు పెట్టుకోవచ్చు.
ఒకవేళ వర్షం ఆగితే కనీసం టీ20 ఫార్మాట్లో అయినా మ్యాచ్ నిర్వహించడానికి నిర్వాహకులు ప్రయత్నించవచ్చు. అది కూడా సాధ్యం కాకపోతే ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ కు సమానంగా పాయింట్లు కేటాయిస్తారు. అప్పుడు పాకిస్థాన్ నేరుగా సూపర్ 4కి క్వాలిఫై అవుతుంది. ఇప్పటికే నేపాల్ పై పాక్ గెలిచిన విషయం తెలిసిందే. ఇండియా.. నేపాల్ పై గెలిస్తే సూపర్ 4 చేరుతుంది.