India XI vs Bangladesh: బంగ్లాదేశ్‌తో ఆడే ఇండియా తుది జట్టు ఇదే.. ఆ ఒక్క మార్పూ చేస్తారా?
18 October 2023, 22:00 IST
- India XI vs Bangladesh: బంగ్లాదేశ్‌తో ఆడే ఇండియా తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న ఇండియన్ టీమ్.. అందరూ కోరుకుంటున్నట్లు ఆ ఒక్క మార్పూ చేస్తుందో లేదో చూడాలి.
పుణెలో బంగ్లాదేశ్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న బుమ్రా, సిరాజ్, షమి
India XI vs Bangladesh: వరల్డ్ కప్ 2023లో టీమిండియా మరో మ్యాచ్ కు సిద్ధమవుతోంది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న టీమ్.. ఇప్పుడు బంగ్లాదేశ్ తో గురువారం (అక్టోబర్ 19) పుణెలో జరగబోయే మ్యాచ్ కు సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ లో ఆడబోయే తుది జట్టుపైనే ఇప్పుడు అందరి కళ్లూ ఉన్నాయి. పాకిస్థాన్ పై గెలిచిన టీమ్ నే కొనసాగిస్తారా లేక ఆ ఒక్క మార్పూ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.
ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ లను ఇండియా చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో విన్నింగ్ టీమ్ నే కొనసాగిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమిని తీసుకోవాలన్న డిమాండ్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ క్రికెటర్ గవాస్కర్ కూడా దీనిపై పలుమార్లు స్పందించాడు.
దీంతో శార్దూల్ ను పక్కన పెట్టి షమిని తీసుకుంటారా లేక అదే జట్టును కొనసాగిస్తారన్నది చూడాలి. మిగతా జట్టులో ఏ మార్పులూ జరగకపోవచ్చు. డెంగ్యూ నుంచి కోలుకొని పాకిస్థాన్ తో మ్యాచ్ కు తిరిగి వచ్చిన శుభ్‌మన్ గిల్.. ఇక నుంచి తుది జట్టులోనే కొనసాగుతాడు. రోహిత్ టాప్ ఫామ్ లో ఉన్నాడు. కోహ్లి, శ్రేయస్, రాహుల్ లతో మిడిలార్డర్ పటిష్ఠంగా ఉంది.
హార్దిక్, జడేజా, శార్దూల్ ఆల్ రౌండర్లుగా ఉన్నారు. ఎనిమిదో స్థానం వరకూ బ్యాటింగ్ ఉండాలన్న ఉద్దేశంతో శార్దూల్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే అతడు మాత్రం ఇప్పటి వరకూ పెద్దగా రాణించింది లేదు. దీంతో షమికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది. ఇక చివర్లో కుల్దీప్, బుమ్రా, సిరాజ్ లు ఉంటారు.
మరోవైపు బంగ్లాదేశ్ వరుసగా రెండు ఓటములు చవిచూసింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ ల చేతుల్లో ఓటమి తర్వాత ఇండియా మ్యాచ్ వాళ్లకు సవాలే. కెప్టెన్ షకీబుల్ హసన్ న్యూజిలాండ్ తో మ్యాచ్ లో గాయపడటంతో ఇండియాపై ఆడతాడా లేదా అన్నది తెలియడం లేదు. అతడు నెట్స్ లో ప్రాక్టీస్ చేసినా.. స్కాన్లు చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కోచ్ చండిక హతురుసింఘా చెప్పాడు.
ఇండియా తుది జట్టు అంచనా
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/షమి, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్
బంగ్లాదేశ్ తుది జట్టు అంచనా
లిటన్ దాస్, తాన్‌జిద్ హసన్, నజ్ముల్ షాంటో, షకీబుల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫిఖుర్ రెహమాన్, తౌహిద్ హృదయ్, మమ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, ముస్తఫిజుర్ రెహమాన్