NZ vs AFG Highlights: తిరుగులేని న్యూజిలాండ్.. ఆఫ్ఘనిస్థాన్ చిత్తు.. మళ్లీ టాప్‌లోకి కివీస్-nz vs afg highlights new zealand beat afghanistan to go top of points table once again ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Nz Vs Afg Highlights: తిరుగులేని న్యూజిలాండ్.. ఆఫ్ఘనిస్థాన్ చిత్తు.. మళ్లీ టాప్‌లోకి కివీస్

NZ vs AFG Highlights: తిరుగులేని న్యూజిలాండ్.. ఆఫ్ఘనిస్థాన్ చిత్తు.. మళ్లీ టాప్‌లోకి కివీస్

Hari Prasad S HT Telugu
Oct 18, 2023 09:34 PM IST

NZ vs AFG Highlights: వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. తాజాగా బుధవారం (అక్టోబర్ 18) ఆఫ్ఘనిస్థాన్ ను ఏకంగా 149 పరుగులతో చిత్తు చేసి పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది.

వరల్డ్ కప్ 2023లో వరుసగా నాలుగో విజయం సాధించిన న్యూజిలాండ్
వరల్డ్ కప్ 2023లో వరుసగా నాలుగో విజయం సాధించిన న్యూజిలాండ్ (PTI)

NZ vs AFG Highlights: వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్ మరో భారీ విజయం సొంతం చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ తో బుధవారం (అక్టోబర్ 18) చెన్నైలో జరిగిన మ్యాచ్ లో 149 రన్స్ తేడాతో గెలిచింది. ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన కివీస్.. పూర్తి ఏకపక్షంగా మ్యాచ్ ముగించింది. వరుసగా నాలుగో విజయంతో మరోసారి పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది.

289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ కేవలం 139 పరుగులకే కుప్పకూలింది. ఏ దశలో ఆఫ్ఘన్ టీమ్ లక్ష్యం దిశగా అడుగులు వేయలేదు. మొదటి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివరికి 34.4 ఓవర్లలోనే చాప చుట్టేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. బౌల్ట్ 2, రచిన్, మ్యాట్ హెన్రీ చెరొక వికెట్ తీసుకున్నారు.

ఆఫ్ఘన్ బ్యాటర్లలో రహ్మద్ షా మాత్రమే 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ టీమ్ చివరి 32 పరుగుల తేడాలో చివరి ఆరు వికెట్లు కోల్పోవడం విశేషం. ఇంగ్లండ్ టీమ్ పై సంచలన విజయం సాధించిన ఆఫ్ఘనిస్థాన్.. ఈ మ్యాచ్ లో తేలిపోయింది. మొదట ఒక దశలో న్యూజిలాండ్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసేలా కనిపించిన తర్వాత చేతులెత్తేసింది. ఫీల్డింగ్ కూడా దారుణంగా ఉంది. ఏకంగా ఐదు క్యాచ్ లు డ్రాప్ చేసింది.

తలబడి నిలబడి..

అంతకుముందు న్యూజిలాండ్ తడబడి నిలబడింది. మొదట్లో బాగానే ఆడి.. మధ్యలో వరుసగా వికెట్లు పారేసుకొని.. మళ్లీ ఓ మంచి భాగస్వామ్యంతో మోస్తరు స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 రన్స్ చేసింది. ఓపెనర్ విల్ యంగ్, కెప్టెన్ టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్ హాఫ్ సెంచరీలతో రాణించారు.

చివర్లో మార్క్ చాప్‌మాన్ 12 బంతుల్లోనే 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో న్యూజిలాండ్ మంచి స్కోరు సాధించగలిగింది. ఆ టీమ్ లో గ్లెన్ ఫిలిప్స్ 71 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. కెప్టెన్ టామ్ లేథమ్ 68, ఓపెనర్ విల్ యంగ్ 54 రన్స్ చేశారు. కివీస్ ఇన్నింగ్స్ రోలర్ కోస్టర్ ను తలపించింది. 30 పరుగుల దగ్గర డెవాన్ కాన్వే (20) వికెట్ కోల్పోయిన ఆ టీమ్.. తర్వాత రచిన్ రవీంద్ర, విల్ యంగ్ భాగస్వామ్యంతో కోలుకొని భారీ స్కోరు చేసేలా కనిపించింది.

ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 79 రన్స్ జోడించారు. 32 రన్స్ చేసి రచిన్ ఔటైన తర్వాత.. కివీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే విల్ యంగ్, డారిల్ మిచెల్ కూడా ఔటవడంతో కివీస్ 110 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో లేథమ్, ఫిలిప్స్ న్యూజిలాండ్ ను ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 144 రన్స్ జోడించడంతో న్యూజిలాండ్ మంచి స్కోరు సాధించగలిగింది.

ఇంగ్లండ్ కు షాకిచ్చిన ఊపులో ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ బౌలర్లు ఊపు మీద కనిపించారు. ఆ బౌలర్లలో నవీనుల్ హక్, అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, ముజీబుర్ రెహమాన్ చెరొక వికెట్ తీశారు.

Whats_app_banner