Santner Catch of the tournament: ఒంటి చేత్తో సాంట్నర్ కళ్లు చెదిరే క్యాచ్.. క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటున్న ఫ్యాన్స్-santner catch of the tournament stuns everyone in the match against afghanistan ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Santner Catch Of The Tournament: ఒంటి చేత్తో సాంట్నర్ కళ్లు చెదిరే క్యాచ్.. క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటున్న ఫ్యాన్స్

Santner Catch of the tournament: ఒంటి చేత్తో సాంట్నర్ కళ్లు చెదిరే క్యాచ్.. క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటున్న ఫ్యాన్స్

Hari Prasad S HT Telugu
Oct 18, 2023 08:56 PM IST

Santner Catch of the tournament: ఒంటి చేత్తో న్యూజిలాండ్ ఫీల్డర్ మిచెల్ సాంట్నర్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్ అభిమానులను షాక్ కు గురి చేస్తోంది. దీనిని అప్పుడే క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటూ ఫ్యాన్స్ ఆకాశానికెత్తుతున్నారు.

గాల్లోకి ఎగురుతూ ఎడమ చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకుంటున్న మిచెల్ సాంట్నర్
గాల్లోకి ఎగురుతూ ఎడమ చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకుంటున్న మిచెల్ సాంట్నర్ (Hotstar)

Santner Catch of the tournament: న్యూజిలాండ్ ఫీల్డర్ మిచెల్ సాంట్నర్ మరోసారి అద్భుతమే చేశాడు. ఆఫ్ఘనిస్థాన్ తో బుధవారం (అక్టోబర్ 18) చెన్నైలో జరిగిన మ్యాచ్ లో ఒంటి చేత్తో గాల్లోకి ఎగురుతూ క్యాచ్ పట్టి ఆశ్చర్యానికి గురి చేశాడు. దీనికి క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో క్యాచ్ వీడియోను షేర్ చేస్తున్నారు.

న్యూజిలాండ్ విసిరిన 289 రన్స్ చేజింగ్ లో ఆఫ్ఘనిస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో ఇబ్రహీం జద్రాన్ ఇచ్చిన క్యాచ్ ను సాంట్నర్ పట్టిన తీరు అద్భుతమనే చెప్పాలి. గుడ్ లెంగ్త్ బాల్ ను జద్రాన్.. పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అది కాస్తా ఎడ్జ్ తీసుకొని స్క్వేర్ లెగ్ వైపు వెళ్లింది. అక్కడే ఉన్న సాంట్నర్.. కాస్త వెనక్కి పరుగెత్తి వెళ్లి గాల్లోకి ఎగురుతూ ఎడమ చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనూ ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్ ను సాంట్నర్ ఇలాగే గాల్లోకి ఎగురుతూ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని చూపించాడు. అసలు అసాధ్యమనుకున్న క్యాచ్ ను సాంట్నర్ అందుకున్న విధానం హైలైట్ అని చెప్పాలి.

మొత్తం 45 లీగ్ మ్యాచ్ లున్న వరల్డ్ కప్ లో ఇది 16వ మ్యాచ్ మాత్రమే. అయితే అభిమానులు మాత్రం అప్పుడే దీనిని క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ గా అభివర్ణిస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 6 వికెట్లకు 288 రన్స్ చేసింది. గ్లెన్ ఫిలిప్స్ 71 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలవగా.. కెప్టెన్ టామ్ లేథమ్ 68, ఓపెనర్ యంగ్ 54 రన్స్ చేశారు.

న్యూజిలాండ్ ఫీల్డర్ సాంట్నర్ ఇంత అద్భుతమైన క్యాచ్ అందుకోగా.. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్ ఫీల్డింగ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగింది. ఆ టీమ్ ఫీల్డర్లు ఏకంగా 5 సులువైన క్యాచ్ లను డ్రాప్ చేశారు. తొలి ఓవర్లోనే యంగ్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను స్లిప్ ఫీల్డర్ హష్మతుల్లా డ్రాప్ చేశాడు. రచిన్ రవీంద్ర డకౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోగా.. లేథమ్ 38 పరుగుల దగ్గర బతికిపోయాడు.

Whats_app_banner