NZ vs AFG Scorecard: తడబడి నిలబడిన న్యూజిలాండ్.. ఆఫ్ఘనిస్థాన్ ముందు మోస్తరు టార్గెట్
NZ vs AFG Scorecard: తడబడి నిలబడింది న్యూజిలాండ్ టీమ్. ఆఫ్ఘనిస్థాన్ ముందు మోస్తరు టార్గెట్ ఉంచింది. బుధవారం (అక్టోబర్ 18) చెన్నైలో జరుగుతున్న మ్యాచ్ లోకివీస్ 6 వికెట్లకు 288 రన్స్ చేసింది.
NZ vs AFG Scorecard: న్యూజిలాండ్ తడబడి నిలబడింది. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో మొదట్లో బాగానే ఆడి.. మధ్యలో వరుసగా వికెట్లు పారేసుకొని.. మళ్లీ ఓ మంచి భాగస్వామ్యంతో మోస్తరు స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 రన్స్ చేసింది. ఓపెనర్ విల్ యంగ్, కెప్టెన్ టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
చివర్లో మార్క్ చాప్‌మాన్ 12 బంతుల్లోనే 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో న్యూజిలాండ్ మంచి స్కోరు సాధించగలిగింది. ఆ టీమ్ లో గ్లెన్ ఫిలిప్స్ 71 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. కెప్టెన్ టామ్ లేథమ్ 68, ఓపెనర్ విల్ యంగ్ 54 రన్స్ చేశారు. కివీస్ ఇన్నింగ్స్ రోలర్ కోస్టర్ ను తలపించింది. 30 పరుగుల దగ్గర డెవాన్ కాన్వే (20) వికెట్ కోల్పోయిన ఆ టీమ్.. తర్వాత రచిన్ రవీంద్ర, విల్ యంగ్ భాగస్వామ్యంతో కోలుకొని భారీ స్కోరు చేసేలా కనిపించింది.
ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 79 రన్స్ జోడించారు. 32 రన్స్ చేసి రచిన్ ఔటైన తర్వాత.. కివీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే విల్ యంగ్, డారిల్ మిచెల్ కూడా ఔటవడంతో కివీస్ 110 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో లేథమ్, ఫిలిప్స్ న్యూజిలాండ్ ను ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 144 రన్స్ జోడించడంతో న్యూజిలాండ్ మంచి స్కోరు సాధించగలిగింది.
ఇంగ్లండ్ కు షాకిచ్చిన ఊపులో ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ బౌలర్లు ఊపు మీద కనిపించారు. ఆ బౌలర్లలో నవీనుల్ హక్, అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, ముజీబుర్ రెహమాన్ చెరొక వికెట్ తీశారు. వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన న్యూజిలాండ్.. ఈ మ్యాచ్ లోనూ గెలిస్తే ఇండియాను వెనక్కి నెట్టి మరోసారి టాప్ లోకి వెళ్తుంది.