తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Asian Games Cricket: క్రికెట్‍లో భారత్‍దే బంగారు పతకం.. ఫైనల్ రద్దయినా.. కబడ్డీలోనూ స్వర్ణం

Asian Games Cricket: క్రికెట్‍లో భారత్‍దే బంగారు పతకం.. ఫైనల్ రద్దయినా.. కబడ్డీలోనూ స్వర్ణం

07 October 2023, 15:25 IST

google News
    • Asian Games Cricket: ఏషియన్ క్రీడల్లో భారత క్రికెట్ పురుషుల జట్టు కూడా బంగారు మెడల్ దక్కించుకుంది. ఫైనల్ రద్దయినా గోల్డ్ మాత్రం భారత్ చేతికి వచ్చింది.
Asian Games Cricket: క్రికెట్‍లో భారత్‍దే బంగారు పతకం.. ఫైనల్ రద్దయినా..
Asian Games Cricket: క్రికెట్‍లో భారత్‍దే బంగారు పతకం.. ఫైనల్ రద్దయినా.. (AFP)

Asian Games Cricket: క్రికెట్‍లో భారత్‍దే బంగారు పతకం.. ఫైనల్ రద్దయినా..

Asian Games Cricket: ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అఫ్గానిస్థాన్‍తో నేడు (అక్టోబర్ 7) జరిగిన ఫైనల్ వాన వల్ల అర్ధాంతరంగా రద్దయినా ఇండియాకే గోల్డ్ మెడల్ వచ్చింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ క్రీడల్లో ఇప్పటికే భారత మహిళల జట్టు బంగారు పతకం గెలువగా.. ఇప్పుడు పురుషుల జట్టు కూడా స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల్లో తాము అడుగుపెట్టిన తొలిసారే బంగారు మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించాయి భారత క్రికెట్ జట్లు.

హాంగ్జౌ వేదికగా నేడు (అక్టోబర్ 7) జరిగిన పురుషుల క్రికెట్ ఫైనల్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 18.2 ఓవర్లలో 5 వికెట్లకు 112 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టుంగా బౌలింగ్ చేశారు. అయితే, ఆ సమయంలో వర్షం తీవ్రంగా పడటంతో మ్యాచ్ ఆడేందుకు సాధ్యం కాలేదు. దీంతో ఈ ఫైనల్‍ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దయినా.. భారత పురుషుల జట్టు మెరుగైన ర్యాంక్‍లో ఉండటంతో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అఫ్గానిస్థాన్ రజతం పతకం దక్కించకుంది.

ఈ ఫైనల్‍లో టీమిండియా ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకోవడంతో.. తొలుత అఫ్గానిస్థాన్‍ బ్యాటింగ్‍కు దిగింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. అఫ్గాన్ బ్యాటర్లు జుబైద్ అక్బరి (5), మహమ్మద్ షహజాద్ (4), నూర్ అలీ జర్డాన్ (1) వెనువెంటనే పెవిలియన్ చేరారు. షహిదుల్లా (49 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. అఫ్సర్ జజాయ్ (15), కరీమ్ జన్నత్ (1)ను కూడా పెవిలియన్‍కు పంపారు భారత బౌలర్లు. చివర్లో షహిదుల్లాకు తోడైన గుల్బాదిన్ నైబ్ (27 నాటౌట్) నిలకడగా ఆడటంతో అఫ్గాన్ కోలుకుంది. 18.2 ఓవర్లో అఫ్గానిస్థాన్ 5 వికెట్లకు 112 పరుగులు చేసిన సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, శివమ్ దూబే, షహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్‍కు చెరో వికెట్ దక్కింది.

వాన జోరున పడటంతో మళ్లీ ఆట మొదలుపెట్టేందుకు సాధ్యపడలేదు. దీంతో ఫలితం తేలకుండానే ఫైనల్ రద్దయింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టీమిండియాకు స్వర్ణ పతకం సాధించింది. అఫ్గాన్‍కు రజతం దక్కింది. ఇక, కాంస్య పతకం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‍లో పాకిస్థాన్‍పై బంగ్లాదేశ్ గెలిచింది.

కబడ్డీ జట్టు కూడా..

ఈ ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల కబడ్డీ జట్టు కూడా స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్‍లో 33-29 తేడాతో ఇరాన్‍ను ఓడించిన భారత్.. మరోసారి ఆసియా చాంపియన్‍గా నిలిచింది. నేడు భారత మహిళల కబడ్డీ టీమ్ కూడా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

19వ ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు 104 పతకాల(28 స్వర్ణాలు, 35 రజతాలు, 41 కాంస్యాలు) ను కైవసం చేసుకుంది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో తొలిసారి 100 పతకాల మార్కును దాటింది భారత్.

తదుపరి వ్యాసం