Asian Games India: అనుకున్నది సాధించి.. చరిత్ర సృష్టించిన భారత్.. సెంచరీ చేరిన పతకాలు.. తెలుగమ్మాయికి మూడో స్వర్ణం
Asian Games India: ఏషియన్ గేమ్స్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. 100 పతకాల మార్క్ చేరి సత్తాచాటింది. అనుకున్నది సాధించి.. అద్భుతం చేసింది. ఆ వివరాలివే..
Asian Games India: ఏషియన్ గేమ్స్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. నిర్దేశించుకున్న 100 పతకాల లక్ష్యాన్ని చేరుకొని సత్తాచాటింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్‌లో ఇండియా సత్తాచాటుతోంది. ఆసియా గేమ్స్ 14వ రోజైన నేడు (అక్టోబర్ 7) ఆరంభంలోనే భారత అథ్లెట్లు అదరగొట్టారు. మూడు స్వర్ణాలు సహా మొత్తం ఐదు పతకాలను కాసేపట్లోనే కైవసం చేసుకుంది ఇండియా. దీంతో 19వ ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 100కు చేరింది. ఇందులో 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్య పతకాలు ఉన్నాయి. ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్ 100 పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ఇలా చైనా వేదికగా జరిగిన ఈ ఎడిషన్ ఆసియా క్రీడల్లో ఇండియా చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్‌లో తొలిసారి సెంచరీ మార్కును చేరింది. అనుకున్నది సాధించింది. మరిన్ని పతకాల దిశగా కూడా భారత్ ముందుకు సాగుతోంది. కాగా, నేడు ఆర్చరీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఏకంగా మూడో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. భారత మహిళల కబడ్డీ జట్టు కూడా బంగారు పతకాన్ని పట్టింది. ఆ వివరాలు ఇవే.
తెలుగమ్మాయి సురేఖకు మూడో గోల్డ్
19వ ఏషియన్ గేమ్స్‌లో భారత స్టార్ ఆర్చర్, తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. నేడు జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఆర్చరీలో స్వర్ణ పతకాన్ని సురేఖ కైవసం చేసుకున్నారు. ఫైనల్‍లో 149-145 తేడాతో కొరియా ప్లేయర్ చాయీవోన్‍ను సురేఖ ఓడించారు. బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఏషియన్ గేమ్స్‌లో సురేఖకు ఇది మూడో స్వర్ణ పతకం. మహిళల కాంపౌడ్ టీమ్ ఈవెంట్‍లోనూ సురేఖకు బంగారు పతకం దక్కింది. అలాగే, మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీలో ప్రవీణ్ ఓజాస్‍తో కలిసి కూడా జ్యోతి సురేఖ బంగారు పతకం సాధించారు. ఇప్పుడు వ్యక్తిగత ఈవెంట్‍లోనూ పసిడి కైవసం చేసుకున్నారు. ఇలా, ఈ 19 ఏషియన్ క్రీడల్లో మూడు స్వర్ణాలు ఒడిసిపట్టారు తెలుగమ్మాయి సురేఖ.
కబడ్డీలో బంగారం
కబడ్డీలో భారత మహిళలు అదరగొట్టారు. నేడు జరిగిన కబడ్డీ మహిళల ఫైనల్‍లో టీమిండియా 26-25 తేడాతో చైనీస్ తైపీ జట్టును ఉత్కంఠ పోరులో ఓడించింది. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ పతకంతోనే భారత్ చరిత్రాత్మక 100వ మెడల్ మార్కును చేరింది. చరిత్ర సృష్టించింది.
ఆర్చరీలో మరో మూడు..
నేడు ఆర్చరీ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ ఓజాస్ ప్రవీణ్ డియోటెల్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే ఈవెంట్‍లో భారత అథ్లెట్ అభిషేక్ రజత పతకాన్ని దక్కించుకున్నారు. ఆర్చరీ మహిళల వ్యక్తిగత కాంపౌడ్ విభాగంలో భారత ఆర్చర్ అదితి స్వామి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఏషియన్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్‍లో నేడు బంగారు పతకం కోసం ఫైనల్‍లో అఫ్గానిస్థాన్‍తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ నేటి (అక్టోబర్ 7) ఉదయం 11.30 గంటలకు మొదలుకానుంది.