IND vs NZ: నిలబడి.. తడబడిన భారత్.. చివర్లో వరుసగా వికెట్లు ఢమాల్.. న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం
19 October 2024, 17:40 IST
- IND vs NZ 1st Test: న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితి నుంచి కుప్పకూలింది. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అద్భుత బ్యాటింగ్‍తో అదరగొట్టిన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి మళ్లీ తడబడింది. దీంతో న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యమే నిలిచింది.
IND vs NZ: నిలబడి.. తడబడిన భారత్.. చివర్లో వరుసగా వికెట్లు ఢమాల్.. న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం
న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో భారత్ ఓ దశలో పటిష్ట స్థితిలో నిలిచినా.. మళ్లీ కష్టాల్లో పడింది. సర్ఫరాజ్ ఖాన్ అద్భుత శతకం, రిషబ్ పంత్ దుమ్మురేపే బ్యాటింగ్‍తో రెండో ఇన్నింగ్స్‌లో నిలదొక్కుకున్న టీమిండియా.. ఆ తర్వాత చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజైన నేడు (అక్టోబర్ 19) రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్‍కు కేవలం 107 పరుగుల టార్గెట్ ఇచ్చింది. చివరి 7 వికెట్లను టీమిండియా కేవలం 54 పరుగులకే కోల్పోయి కుప్పకూలింది టీమిండియా. మందు అద్భుతంగా నిలిచినా.. ఆ తర్వాత తడబడింది.
ఆదుకున్న సర్ఫరాజ్, పంత్
తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైన భారత్ ఈ మ్యాచ్‍లో అద్భుతంగా పుంజుకుంది. న్యూజిలాండ్ భారీ స్కోరు చేసినా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అదరగొట్టింది. అయితే, చివర్లో తడబడి మళ్లీ కష్టాల పాలైంది. మూడు వికెట్లకు 231 పరుగుల వద్ద నేడు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‍ను టీమిండియా కొనసాగించింది. సర్ఫరాజ్ ఖాన్ 70 పరుగుల వద్ద బ్యాటింగ్ కంటిన్యూ చేయగా.. రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు.
సర్ఫరాజ్ (195 బంతుల్లో 150 పరుగులు; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి శతకంతో చెలరేగగా.. పంత్ (105 బంతుల్లో 99 పరుగులు; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుతంగా ఆడారు. ఇద్దరూ వేగంగా పరుగులు రాబట్టారు. స్కోరు బోర్డును దూకుడుగా ముందుకు నడిపారు. వీలు దొరినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో భారత్ మంచి రన్‍రేట్‍తో ముందుకు సాగింది.
సర్ఫరాజ్ తొలి శకతం.. పంత్ కాస్తలో మిస్
జోరుగా ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 110 బంతుల్లోనే సెంచరీ చేరాడు. కెరీర్లో తొలి టెస్టు శకతం చేసి సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. పంత్ కూడా ధనాధన్ ఆట ఆట ఆడాడు. దీంతో తొలి సెషన్‍లో వికెట్ పడలేదు. పంత్ 55 బంతుల్లోనే అర్ధ శకతం పూర్తి చేసుకున్నాడు. వాన ఆటంకం కలిగించిన మళ్లీ ఆట మొదలైంది. సర్ఫరాజ్, పంత్ 177 పరుగుల భాగస్వామ్యం జోడించి భారత్‍ను పటిష్ట స్థితిలో నిలిపారు. లీడింగ్‍లోకి తీసుకొచ్చారు.
చివరి 54 పరుగులకు 7 వికెట్లు ఢమాల్
పటిష్ట స్థితిలో ఉన్న సమయంలో 150 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సర్ఫరాజ్ ఔటయ్యాడు. దీంతో టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయి. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఓరౌర్కీ బౌలింగ్‍లో పంత్ బౌల్డ్ అయి నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (12), రవీంద్ర జడేజా (5), రవిచంద్రన్ అశ్విన్ (15), జస్‍ప్రీత్ బుమ్రా (0), మహమ్మద్ సిరాజ్ (0) టపాటపా ఔటయ్యారు. కుల్దీప్ (6) నాటౌట్‍గా నిలిచాడు.
చివరి 7 వికెట్లను 54 పరుగులకే కోల్పోయి భారత్ కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్‍కు మోస్తరు లక్ష్యాన్ని కూడా ఇవ్వలేకపోయింది. ఓ దశలో 408/3తో పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయి 462 పరుగులకే ఆలౌటై నిరాశపరిచింది. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ, విలియమ్ ఓరౌర్కీ తలా మూడు వికెట్లు తీశారు. ఎజాజ్ పటేల్ రెండు, గ్లెన్ ఫిలిప్, టిమ్ సౌథీ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
స్పల్ప టార్గెట్.. ముందుగా నిలిచిన ఆట
న్యూజిలాండ్‍కు భారత్ 107 పరుగుల స్పల్ప టార్గెట్ ఇచ్చింది. లక్ష్యఛేదనకు కివీస్ నాలుగో రోజు చివర్లో బరిలోకి దిగినా నాలుగు బంతులే పడ్డాయి. పరుగులేమీ రాలేదు. వెలుతురు సరిగా లేని కారణంగా ఆటను అంపైర్లు నిలిపివేశారు. దీంతో అంపైర్లతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వాగ్వాదం చేశాడు. ఆ తర్వాత వాన పడింది. మ్యాచ్ చివరి రోజున ఐదో రోజు రేపు (అక్టోబర్ 20) న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్, డేవోన్ కాన్వే బరిలోకి దిగనున్నారు. వర్షం పడితే డ్రా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రేపు ఐదో రోజు ఆట జరిగితే అంత తక్కువ స్కోరుకే న్యూజిలాండ్‍ను భారత్ కుప్పకూల్చడం కష్టమే.